
ఎర్రకోట
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక సంపద ఎర్రకోట చుట్టూ వివాదం ముసురుకుంటోంది. ఎర్రకోటను ఐదేళ్లకు దాల్మియ గ్రూపు దత్తత తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. చారిత్రక సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. పార్లమెంట్, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టులను కూడా అభివృద్ధి పేరుతో లీజుకిస్తారా అని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది.
దేశంలోని 93 వారసత్వ కట్టడాల అభివృద్ధికి కేంద్ర పర్యాటకశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వారసత్వ స్థలం ఎర్రకోట అభివృద్ధి కాంట్రాక్ట్‌ను అడాప్ట్ హెరిటేజ్ సైట్ పథకం కింద ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, టూరిజం శాఖలతో దాల్మియా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లపాటు ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున ఆ సంస్థ పర్యాటకశాఖకు చెల్లించనున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
దీనిపై కేంద్ర టూరిజం శాఖ స్పందించింది. గత ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు రాష్ట్రపతి ఈ పథకాన్ని ప్రకటించారు. చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే దాల్మిక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం. కేవలం వారసత్వ కట్టడాల అభివృద్ధి కోసమే ఇందుకు శ్రీకారం చుట్టామని, ఇందులో ఎలాంటి లాభాపేక్షలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment