సామాజిక బాధ్యతతో సేవా వైద్యం
‘డాక్టరీ చదివాను.. మూడేళ్లు వైద్యం కూడా చేశాను. అయినా ఏదో వెలితి.. ఇంకేదో చేయాలన్న తపన. కేవలం రోగులకే సేవ చేసే వైద్యం కన్నా.. పేదరికం, అసమానత.. వంటి రుగ్మతలతో బాధపడుతున్న మెజారిటీ ప్రజానీకానికి సేవావైద్యం చేయడమే గొప్పదన్న భావనే నన్ను సివిల్స్ వైపు మళ్లించింది’...
‘నా స్నేహితులెందరో విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రయత్నిస్తే నాకూ అవకాశాలు వచ్చేవే.. కానీ నాన్న అంగీకరించలేదు. స్వదేశంలోనే.. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చాను. ఈ స్థాయికి రాగలిగాను’.. అని చెప్పార్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. జిల్లా కలెక్టర్‌గా వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆయన్ను ‘సాక్షి’ మంగళవారం కలిసినప్పుడు తన కుటుంబ నేపథ్యాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
వ్యక్తిగతం
మాది చంఢీగఢ్. నాన్న పి.ఎన్.ఉప్పల్.. ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ చేశారు. అమ్మ ఉషా ఉప్పల్.. గృహిణి. భార్య కోమల్ ఉప్పల్.. ఆమె చిన్నపిల్లల వైద్యురాలు. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బ్రిజు (6), మరొకరు దిజా (3). మా అన్నయ్య దంత వైద్యుడు. ఈ రకంగా చూస్తే.. మాది వైద్య, ఉద్యోగ కుటుంబం.
ఉద్యోగ ప్రస్థానం
తొలుత నేను మెడిసిన్ చదివా. ఆరేళ్ల చదువు తర్వాత మూడేళ్లు వైద్యాధికారిగా సేవలందించా. ఉద్యోగం బాగానే ఉన్నా ఏదో లోటు. మరేదో సాధించాలన్న తపన. మా కజిన్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పైగా మా నాన్న అత్యధిక ప్రజలకు సేవ చేసే రంగం ఎంచుకోమని సూచించారు. ఆయన స్పూర్తితో.. కజిన్‌ను ఆదర్శంగా తీసుకొని ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నా. రెండుసార్లు పరీక్ష రాసి విఫలమయ్యాను. మూడోసారి దేశంలోనే మూడో ర్యాంకు సాధించగలిగాను. ఆ విధంగా 2005లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. 2007లో విశాఖలో ట్రైనీ ఐఏఎస్‌గా పనిచేశా. తర్వాత విజయవాడలో సబ్ కలెక్టర్‌గా, కొన్నాళ్లు గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించా. కృష్ణా జిల్లా జేసీగా పనిచేశా. మరికొన్నాళ్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా చేసి కేంద్ర సర్వీసులకు వెళ్తాను. అక్కడ ఏడాదిన్నర పని చేశాను. ఈనెల 14న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా ఇదే తొలి అడుగు.
విదేశాల్లో అవకాశాలున్నా..
నా స్నేహితులు ఎంతో మంది విదేశాల్లో స్థిరపడిపోయారు. కావాలనుకుంటే నాకూ అవకాశం వచ్చేదే. కానీ నాన్న ఒప్పుకోలేదు. స్వదేశంలోనే సేవలందించాలని కోరారు. ఆయన ఆకాంక్ష నెరవేర్చేందుకు ఇక్కడే ఉండిపోయా. మాదీ పంజాబీ అయినా ట్రైనింగ్‌లో చాలా నేర్చుకున్నా. తెలుగు భాషపై ఎంతో మమకారం ఉంది. శిక్షణ సమయంలో తెలుగు నేర్చుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఇప్పుడు తెలుగు పూర్తిగా మాట్లాడగలుగుతున్నా. పేపర్ చదువుతా. తెలుగులో రాయగలను కూడా.
సిక్కోలుకు ఏం తక్కువ..
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అనగానే సంబరపడిపోయా. ఇక్కడి ప్రజలు అమాయకులు. మంచివాళ్లు. అందర్నీ ప్రేమిస్తారని విన్నా. మంచి మనసున్న వ్యక్తులు ఇక్కడున్నారని గత కలెక్టర్ కూడా చెప్పారు. అందమైన తీర ప్రాంతం శ్రీకాకుళం సొంతం. అందువల్ల పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తాను. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను తీర్చిదిద్దుతా. విద్యా విభాగంలో మార్పులు తెస్తా. పరిశ్రమలకు ఊతమిస్తా. గిరిజన గ్రామాల్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తా. జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో గ్రోత్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాను. దేవాలయాల పరిరక్షణకు పాటుపడతా. ఫుడ్ ప్రాసెసింగ్ (పార్క్) యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ రాస్తా. పైనాపిల్ పంటకు మార్కెట్ సౌకర్యం, మత్స్యకార గ్రామాల్లో జెట్టీ ఏర్పాటుకు కృషి చేస్తాను.
సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా. ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. అన్ని వనరులూ ఉండి వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా నేతలు చర్యలు తీసుకోవాలి. విశాఖ సహా తిరుపతి, విజయవాడ పట్టణాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ సహాయం కోరతాను. అందరూ సహకరిస్తే కచ్చితంగా శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లోనూ ముందంజ వేయడం ఖాయం.
- శ్రీకాకుళం, సాక్షి ప్రతినిధి