జిల్లా కలెక్టర్‌గా గౌరవ్ ఉప్పల్
శ్రీకాకుళం కలెక్టరేట్: జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న సౌరభ్‌గౌర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం జరిపిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈ మార్పులు జరిగాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 జూలై 3న జిల్లా కలెక్టర్‌గా వచ్చిన సౌరభ్‌గౌర్ సరిగ్గా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం జరిపిన సాధారణ బదిలీల్లో భాగంగా ఈయన కూడా బదిలీ అయ్యారు. అయితే గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావుకు అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. అదే పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన బదిలీకి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది.
కేంద్ర సర్వీసుల నుంచి..
కొత్తగా వస్తున్న గౌరవ్ ఉప్పల్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ(పబ్లిక్ పాలసీ) పీజీ పట్టా తీసుకున్నారు. 1975లో జన్మించిన ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో విజయవాడ్ సబ్ కలెక్టర్‌గా, గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లి రైల్వేల్లో పని చేశారు. అనంతరం గత నెల 26నే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈయన్ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమించింది.