Gaurav Uppal
-
సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 'ఆపరేషన్ కావేరి' పేరుతో సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న భారతీయులను దశల వారిగా ఢిల్లీ, ముంబైలకు తరలించింది. ఇప్పటి వరకు సూమారు 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విదేశాంగ శాఖ సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. దీని కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొత్తం నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడే వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపే ఏర్పాటు చేస్తున్నట్ల రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. అంతేగాదు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా అయితే తెలంగాణకు పంపామో అదే తరహాలో పంపించేలా.. ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. (చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు) -
సెలూన్ లో కలెక్టర్ షేవింగ్..
పేటీఎం ద్వారా చెల్లింపులు కనగల్: నగదు రహిత లావాదేవీలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం కనగల్ మండలం చిన్నమాదారంలో పర్య టించిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓ హెయిర్ సెలూన్ లో షేవింగ్ చేయించుకున్న కలెక్టర్.. తన మొబైల్ ఫోన్ నుంచి పేటీఎం ద్వారా నగదు రహిత చెల్లింపులు నిర్వహించారు. మారుమూల కుగ్రామంలో ఉన్న చిన్న కటింగ్ డబ్బాలో కలెక్టర్ షేవింగ్ చేయించుకోవడంతో స్థానికులు ఆశ్చర్య పోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా మార్చేందుకు జిల్లాలో 11 పల్లెలను ఎంపిక చేశామన్నారు. ఇందులో చినమాదారం గ్రామం ఒక్కటని చెప్పారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రామగిరి : జిల్లా కేంద్రం రామగిరి శ్రీనివాసనగర్‌లో గల వికలాంగుల వసతి గృహాన్ని శనివారం గౌరవ్ ఉప్పల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. ముందస్తుగా లైట్ల వసతి కల్పించాలని, మంచాలు, బెడ్‌షీట్స్, పుస్తకాలు, తదితర సామగ్రిని వెంటనే అందించాలని ప్రాధాన్యత క్రమంలో అవసరమై వస్తువులను సరఫరాచేయాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ పుష్పలతను ఆదేశించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని అన్ని రూమ్‌లు తిరుగుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రాధాన్యతాక్రమంలో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు బోయవాడలోని బాలసదన్‌ను సందర్శించి అక్కడ నెలలు మాత్రమే నిండిన చిన్నారుల ఆలనా పాలనా గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల యాదయ్యగౌడ్, విద్యార్థులు తదితరులున్నారు. -
జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా కొత్త కలెక్టర్‌గా పి.లక్ష్మీనరసింహాన్ని ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజుల క్రితం వరకు కలెక్టర్‌గా ఉన్న గౌరవ్ ఉప్పల్ ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించడంతో ఈ నెల మూడో తేదీన ఆయన రిలీవై వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రస్తుతం ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా బుధవారం జరిపిన ఐఏఎస్‌ల పోస్టింగులు, బదిలీల్లో భాగంగా లక్ష్మీనరసింహం జిల్లా కలెక్టర్‌గా రానున్నారు. రాష్ట్ర సచివాలయంలోని భూపరిపాలనలో ప్రస్తుతం పని చేస్తున్న ఆయన గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ సర్వీసులో చేరి, 2008లో ఐఏఎస్ హోదా పొందారు. ఆ వెంటనే విజయనగరం జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేశారు. 2010 నుంచి 2013 వరకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి భూ పరిపాలన విభాగానికి బదిలీ పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీసీఎల్ఏలో విజిలెన్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పి గోపాలక్రిష్టారెడ్డి వద్ద పీఎస్‌గా పనిచేశారు. హూద్‌హుద్ తుపాను సమయంలో సహయ చర్యల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చిన ఆయనపాలకొండ డివిజన్లో పని చేశారు. కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల కావడంతో బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. అయితే కొత్త కలెక్టర్ విధుల్లో చేరేందుకు కొద్ది రోజులు పట్టవచ్చని తెలిసింది. -
అర్హతే కొలమానం
శ్రీకాకుళం అర్బన్: పింఛన్ లబ్ధిదారుల ఎంపికకు అర్హతే కొలమానమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగానే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని.. ప్రతి ఒక్క అర్హుడూ లబ్ధి పొందాల్సిందేనన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 10 లక్షల మంది అనర్హులు లబ్ధి పొందినట్టు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసునన్నారు. ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వెళ్లి వారి సమస్యల పరిష్కరించాలనే లక్ష్యంతోనే జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగం రోజంతా ఒకే గ్రామంలో ఉండి అక్కడి సమస్యలను తెలుసుకుంటారన్నారు. పేదల ఆరోగ్యానికి ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. 2029 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన పేదరికం లేని పరిశుభ్ర రాష్ట్రంగా తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. 2019 నాటికి పరిశుభ్ర భారత్‌లో భాగంగా పరిశుభ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను స్థాపించినట్టు వెల్లడించారు. జిల్లాలో రెండు మండలాలను 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎంపిక చేసినట్టు మంత్రి ప్రకటించారు. అలాగే విద్యుత్ ఆదా చేయడానికి పేదలకు రూ. 400 విలువ చేసే ఎల్ఈడీ బల్బును పది రూపాయలకే అందిస్తున్నామని, ఇందుకోసం జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పింఛన్‌ను ఐదురెట్లు పెంచి రెండు వందల పింఛన్‌ను రూ.వెరుు్య చేశామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జన్మభూమి మాఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25న ప్రారంభించామని, ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకూ కొనసాగుతోందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌లో నమోదు కానివారు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్లను రూపొందించనున్నట్లు తెలి పారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రచార పోస్టర్లను మంత్రి తదితరులు విడుదల చేశారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.హెచ్.షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషా ఖాసీం, మెప్మా పీడీ ఎం.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, డీఈవో ఎస్.అరుణకుమారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, నాయకులు జామి భీమశంకర్, పి.వి.రమణ, వెంకటలక్ష్మి, సుగుణ పాల్గొన్నారు. తొలిరోజు ఆర్భాటమే ! శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో తొలి రోజైన గురువారం ఆర్భాటమే మిగిలింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని సంక్షేమాలకు, హమీలకు ఆక్టోబర్ రెండో తేదీ గడువని ప్రజలను పాలకులు నమ్మిస్తూ వచ్చారు. పలు పథకాలు, పెరిగిన పింఛన్లు ప్రజలకు అందజేయనున్నట్టు ప్రచారం చేశారు. అయితే జన్మభూమి ప్రారంభంతో మాత్రం ప్రజల ఆశలు తీరలేదు. అన్ని ఆరకొరగానే జరిగాయి. అయితే నాలుగో తేదీ శనివారం నుంచి జన్మభూమి కార్యక్రమం పూర్తిస్థారుులో ప్రారంభం కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలిరోజు జిల్లా అంతటా గాంధీ జయంతి ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించారే తప్పా హామీల మేరకు సంక్షేమ పథకాలు మాత్రం ప్రారంభం కాలేదు. సుజలధార పథకం శ్రీకాకుళం పట్టణంతోపాటు మరో రెండుచోట్ల మాత్రమే ప్రారంభించారు. నిరంతర విద్యుత్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. వైద్య శిబిరాలు నిర్వహించలేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నామమాత్రంగానే ప్రారంభమైంది. -
స్వయం శక్తి సంఘాలకు ఇసుక రవాణా బాధ్యతలు!
ఎచ్చెర్ల: త్వరలో ఇసుక రవాణా బాధ్యతలను స్వయంశక్తి సంఘాలకు అప్పగించి ఇసుక అక్రమ తరలింపునకు చెక్ చెబుతామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. ఎచ్చెర్ల మహిళా ప్రాంగణ శిక్షణ కేంద్రం(టీటీడీసీ)లో జిల్లాలోని స్వయంశక్తి సంఘాల పని తీరుపై ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని 13 జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం జిల్లాలోని స్వయం శక్తి సహాయక సంఘాల పని తీరు బాగుందన్నారు. ఐకేపీ కార్యక్రమాలు, పింఛన్ పంపిణీల వివరాలను సమాఖ్య సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పని తీరులో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఐకేపీ సిబ్బంది, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలాలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర స్థాయిలో అధికారులతో మాట్లాడి పరి ష్కరిస్తామని చెప్పా రు. మండలాల్లో ఆధార్ సీడింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆధార్ సీడింగ్ జరగనిదే ప్రభుత్వ పథకాలు ప్రజలకు, లబ్ధిదారులకు చేరవని తేల్చి చెప్పారు. గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు ఎస్.తనూజారాణి మాట్లాడుతూ జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య భవనాల నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయన్నారు. ఆ పనులకు మరో * 5 లక్షల వరకు నిధులు అవసరమౌతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నిధుల మంజూరుకు త్వరలో చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం తనిఖీ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎచ్చెర్ల మహిళా శిక్షణా కేంద్రంలోని కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని తనిఖీచేశారు. కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను సైతం పరిశీలించారు. ఏర్పాట్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను సున్నితంగా మందలించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కె.సావిత్రి, ఏపీడీ ల్యాండ్ జి.సుజాత, తహశీల్దార్ బి.వెంకటరావు, ఎంపీడీవో పి.రాధ, జిల్లాలోని పలు మహిళా సంఘాల సమాఖ్య సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆమదాలవలస బాయ్స్ హాస్టల్ లో బస
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్: వసతి గృహంలో మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటూ వసతి గృహల్లో ఉంటున్న విద్యార్థులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆప్యాయంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఆముదాలవలసలోని బాలుర సాంఘీక సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు నిర్వహించి వసతి గృహంలో బస చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి కష్ట సుఖాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా వసతి గృహంలో విద్యార్థులకు పెట్టే మెనూపై ఆరా తీశారు. వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అంటూ.. విద్యార్థులు ఉపయోగించే స్నానపు గదుల, మరుగు దొడ్లను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు ఇలా చెప్పారు... నిత్యం వసతి గృహంలో పెట్టే మెనూలో కిచిడీ, టమాటా రైస్, పొంగలి వంటివి మాకు నచ్చడంలేదని వాటిని వృథాగా కొంతమంది బయటపడేస్తున్నారని విద్యార్థులు చెప్పారు. అలాగే వసతి గృహంలో దోమలు బెడద ఎక్కువుగా ఉందని, తాగునీటి బోరు ఉన్నా ఎన్నటికప్పుడే మరమ్మతులకు గురవుతోందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ముందస్తుగా వసతిగృహాధికారి విద్యార్థులు సార్వస్తే అంతా సక్రమంగా ఉందని చెప్పాలని చెప్పడంతో విద్యార్థులు కొంతమంది భయపడి అంతా బాగుందని మొదటగా చెప్పారు. కలెక్టర్ ఈ విషయాన్ని గమనించి వారి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసి అధికారులు ఎవరూ లేరని భయం లేకుండా చెప్పండని విద్యార్థులను ప్రశ్నించడంతో కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వసతిగృహాల అభివృద్ధికే ఈ పరిశీలన.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల అభివృద్ధికే ఈ పరిశీలన నిర్వహిస్తునట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. జిల్లాలో 69వ సాంఘికసంక్షేమ, ట్రైబుల్ వెల్ఫేర్ వసతి గృహాలు ఉన్నాయని అందులో 53 వసతి గృహాల్లో 53 మంది జిల్లా అధికారులు శుక్రవారం రాత్రి ఇలా పరిశీలనలకు వెళ్లి వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు బసచేసి ఉదయాన్నే వారితో కలిసి టిఫిన్ చేసి నివేదిక సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తాను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. వసతి గృహాధికారులు తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ వారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ వారిని ఇంటిని మరిపించే విధంగా చూడాలని వసతి గృహాధికారి కె. ప్రహ్లాదరావవుకు సూచించారు. కార్యక్రమంలో సహాయక సాంఘిక సంక్షేమాధికారి ఎస్. కృష్ణారావు, ఆమదాలవలస తహశీల్దారు కె. శ్రీరాములు, ఆర్ఐ రామశాస్త్రి, వీఆర్వోలు కిరణ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి అంశాలపై చర్చించా..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం హార్బర్లను అభివృద్ది చేయడంతోపాటు పారిశ్రామిక అభివృద్దిలో హార్బర్లను ఒక భాగంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. అయితే ఇప్పుడు కాకపోయినా ప్రాధ్యాన్యత, వరుస క్రమం ఆధారంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి తొలిసారిగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంతో పాల్గోని, శుక్రవారం సాయంత్రం కలెక్టర్ జిల్లాకు చేరారు. అక్కడ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన శుక్రవారం తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల పరిస్థితులు, వనరులు, అవసరాలు తదితర ఆంశాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపానన్నారు. జిల్లాలో భావనపాడు, కళింగపట్నం హర్బర్లు అభివృద్ది అవసరంపై వివరించానన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్దికి ఏడు మిషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. దీని ద్వారా అన్ని శాఖలు అబివృద్ది జరుగుతుందన్నారు. సమావేశంలో ఎక్కువగా అభివృద్ది కావాల్సిన అంశాలపై చర్చ సాగిందని ఆయన తెలిపారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు చేయడానికి అధికారులందరి సహకారం తీసుకోవాలని, ఏఏ శాఖలను సమన్వయం చేసుకోవాలో మిషన్లులో తెలిపారని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పరిశ్రలు అవసరం ఉందని, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అన్ని ప్రాంతాలను అబివృద్ది చేయాలని కోరానన్నారు. పలాసలో జీడి పరిశ్రమ, తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి, అనుంబంద పరిశ్రమలు, ఉద్దానం ప్రాంతంతో కొబ్బరి, వాటి అనుంబందంగా ఉండే పరిశ్రమలు, ఈ ఉత్పత్తుల అమ్మకాలకి కావాల్సిన సదుపాయాలు కల్పన తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పర్యాటక కేంద్రాల అబివృద్దికి కూడా చర్యలు తీసుకోవాలని, దీనికోసం ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. మిషన్లులో భాగంగా పర్యాటక రంగానికి కూడా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇది తొలి సమావేశం కావడంతో ఎక్కువగా శాఖల మధ్య సమన్వయం, అభివృద్దికి కావాల్సిన వనరులు, పారిశ్రామిక రంగం, మహిళా సంక్షేమంపై చర్చలు సాగాయన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారని, ఆయన కూడా జిల్లా అభివృద్దికి కావాల్సిన అంశాలను వివరించారని కలెక్టర్ తెలిపారు. -
సిక్కోలును అభివృద్ధి చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరినట్టు తెలిసింది. గురువారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి చేయాల్సిన అంశాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వెనుకబడిన జిల్లాగా ఉండిపోయిన శ్రీకాకుళాన్ని భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిందేనని, ఇందుకు ఇక్కడ ఉన్న వనరులు, భూ లభ్యతపై వివరించినట్టు సమాచారం. వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినటు అవుతోందని కలెక్టర్ వివరించినట్టు భోగట్టా. అలాగే వలసల్ని నివారించాలంటే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిందేనని వివరించారు. మొత్తం 29 అంశాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ ఉప్పల్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే వంశధార, వంశధార ప్రాజెక్టు ఫలాల్ని జిల్లా రైతులకు చేర వేయాలని, శివారు ప్రాంత రైతులకు కూడా సాగునీటిని చేర్చేందుకు పెండింగ్ పనుల్ని పూర్తిచేయాలని కోరారు. బి.ఆర్.రాజగోపాలరావు (వంశధార) రెండోదశ పనుల్ని సకాలంలో పూర్తిచేస్తే జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని, పంటలు నష్టపోకుండా ఉండేందుకు ఈ నీరు ఎంతో అవసరమని వివరించారు. సాగు, తాగు నీటి సరఫరా, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా జిల్లా మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందని సీఎంకు కలెక్టర్ వివరించారు. అలాగే ఫోర్టుల ఏర్పాట్లు, అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు..సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఎంతో అవసరమని వివరించారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. -
పర్యాటక పరుగులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు నవ్య శోభతో కళకళలాడనున్నాయి. విశాలమైన తీరప్రాం తం, సహజసిద్ధమైన ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఆలవాలమైన శ్రీకాకుళం జిల్లాను పర్యాటక రంగంలో పరుగులు తీయించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రతి పాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యాటక రంగానికి రూ.4.50 కోట్లు విడుదల కావడంతో రెట్టిం చిన ఉత్సాహంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల పనులు ప్రారంభించగా రానున్న రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. పలు గ్రోత్ సెం టర్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్ ఈనెల 26 నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తుండటంతో ఆమెకు సమర్పించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. గ్రోత్ సెంటర్ల వివరాలు * పొన్నాడ కొండ-బ్రిడ్జి ప్రాంతంలో రూ.2 కోట్ల అంచనాతో విశాఖలోని కైలాసగిరి తరహాలో మినీ కైలాసగిరి ఏర్పాటు కానుంది. * భావనపాడులో ఫిషింగ్ హార్బర్, మినీ పార్కు, స్పీడ్ బోట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. * గుళ్ల సీతారాంపురంలో 16వ శతాబ్దానికి చెందిన రామాలయంలో విద్యుత్ ధగధగలు, తోటలు, కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలతో పనులు ప్రారంభం కానున్నాయి. * సరుబుజ్జిలి మండలం దంతపురి ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. * జిల్లాకే తలమానికంగా ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి దైవ క్షేత్రాలతోపాటు శాలిహుండం, కళింగపట్నం, తేలి నీలాపురం, బారువ బీచ్ వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధు లు కావాలని ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. జరుగుతున్న పనులివే.. * శ్రీకాకులం ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో ఉన్న డచ్హౌస్ను రూ.50 లక్షలతో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మూడు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. * అరసవల్లి రోడ్డులోని ఇందిరా విజ్ఞాన్ భవన్ సమీపంలో రూ.13 కోట్ల ఖర్చుతో బడ్జెట్ హోటల్ రానుంది. ఇప్పటికే రూ.6 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. * కళింగపట్నం బీచ్‌లో రూ.17 కోట్లతో బీచ్ రిసార్ట్స్‌తో పాటు శిల్పారామం కూడా ప్రారంభం కానున్నాయి. * అరసవల్లిలో రూ.16 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టగా శ్రీకూర్మంలో రూ.35 లక్షలతో, శ్రీముఖలింగంలో రూ.18 లక్షలతో, రావివలస మల్లిఖార్జునస్వామి ఆలయంలో రూ.1.12లక్షలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాం తాల్లో గదులు, ఇతరత్రా వసతుల కల్పనకు తొలి దశలో రూ.50 లక్షలతో టెండర్లు పిలవనున్నారు. * మడ్డువలస జలాశయంలో బోట్ షికారుకు రూ.60 లక్షలతో టెం డర్లు పిలవనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే తమ శాఖ కు రూ.4.57 కోట్లు జమ అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్ శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు బౌద్ధారామాలను అనుసంధానం చేస్తూ త్వరలో అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్’ను తీర్చిదిద్దనున్నారు. ఇది పూర్తిస్థాయిలో తయారైతే చైనా తదితర దేశాలకు చెందిన బౌద్ధ మతస్తులు తరచూ ఇక్కడకూ వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు. శాలిహుండం, నగరాలపేట, దంతపురి ప్రాం తాల్లో ఇప్పటికే ప్రముఖ బౌద్ధమతస్తుడు శాంతన్సేథ్ పర్యటించి ఓ ప్రణాళిక సిద్ధం చేశారని, త్వరలో దానిని కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు. -
సామాజిక బాధ్యతతో సేవా వైద్యం
‘డాక్టరీ చదివాను.. మూడేళ్లు వైద్యం కూడా చేశాను. అయినా ఏదో వెలితి.. ఇంకేదో చేయాలన్న తపన. కేవలం రోగులకే సేవ చేసే వైద్యం కన్నా.. పేదరికం, అసమానత.. వంటి రుగ్మతలతో బాధపడుతున్న మెజారిటీ ప్రజానీకానికి సేవావైద్యం చేయడమే గొప్పదన్న భావనే నన్ను సివిల్స్ వైపు మళ్లించింది’... ‘నా స్నేహితులెందరో విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రయత్నిస్తే నాకూ అవకాశాలు వచ్చేవే.. కానీ నాన్న అంగీకరించలేదు. స్వదేశంలోనే.. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చాను. ఈ స్థాయికి రాగలిగాను’.. అని చెప్పార్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. జిల్లా కలెక్టర్‌గా వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆయన్ను ‘సాక్షి’ మంగళవారం కలిసినప్పుడు తన కుటుంబ నేపథ్యాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యక్తిగతం మాది చంఢీగఢ్. నాన్న పి.ఎన్.ఉప్పల్.. ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ చేశారు. అమ్మ ఉషా ఉప్పల్.. గృహిణి. భార్య కోమల్ ఉప్పల్.. ఆమె చిన్నపిల్లల వైద్యురాలు. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బ్రిజు (6), మరొకరు దిజా (3). మా అన్నయ్య దంత వైద్యుడు. ఈ రకంగా చూస్తే.. మాది వైద్య, ఉద్యోగ కుటుంబం. ఉద్యోగ ప్రస్థానం తొలుత నేను మెడిసిన్ చదివా. ఆరేళ్ల చదువు తర్వాత మూడేళ్లు వైద్యాధికారిగా సేవలందించా. ఉద్యోగం బాగానే ఉన్నా ఏదో లోటు. మరేదో సాధించాలన్న తపన. మా కజిన్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పైగా మా నాన్న అత్యధిక ప్రజలకు సేవ చేసే రంగం ఎంచుకోమని సూచించారు. ఆయన స్పూర్తితో.. కజిన్‌ను ఆదర్శంగా తీసుకొని ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నా. రెండుసార్లు పరీక్ష రాసి విఫలమయ్యాను. మూడోసారి దేశంలోనే మూడో ర్యాంకు సాధించగలిగాను. ఆ విధంగా 2005లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. 2007లో విశాఖలో ట్రైనీ ఐఏఎస్‌గా పనిచేశా. తర్వాత విజయవాడలో సబ్ కలెక్టర్‌గా, కొన్నాళ్లు గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించా. కృష్ణా జిల్లా జేసీగా పనిచేశా. మరికొన్నాళ్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా చేసి కేంద్ర సర్వీసులకు వెళ్తాను. అక్కడ ఏడాదిన్నర పని చేశాను. ఈనెల 14న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా ఇదే తొలి అడుగు. విదేశాల్లో అవకాశాలున్నా.. నా స్నేహితులు ఎంతో మంది విదేశాల్లో స్థిరపడిపోయారు. కావాలనుకుంటే నాకూ అవకాశం వచ్చేదే. కానీ నాన్న ఒప్పుకోలేదు. స్వదేశంలోనే సేవలందించాలని కోరారు. ఆయన ఆకాంక్ష నెరవేర్చేందుకు ఇక్కడే ఉండిపోయా. మాదీ పంజాబీ అయినా ట్రైనింగ్‌లో చాలా నేర్చుకున్నా. తెలుగు భాషపై ఎంతో మమకారం ఉంది. శిక్షణ సమయంలో తెలుగు నేర్చుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఇప్పుడు తెలుగు పూర్తిగా మాట్లాడగలుగుతున్నా. పేపర్ చదువుతా. తెలుగులో రాయగలను కూడా. సిక్కోలుకు ఏం తక్కువ.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అనగానే సంబరపడిపోయా. ఇక్కడి ప్రజలు అమాయకులు. మంచివాళ్లు. అందర్నీ ప్రేమిస్తారని విన్నా. మంచి మనసున్న వ్యక్తులు ఇక్కడున్నారని గత కలెక్టర్ కూడా చెప్పారు. అందమైన తీర ప్రాంతం శ్రీకాకుళం సొంతం. అందువల్ల పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తాను. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను తీర్చిదిద్దుతా. విద్యా విభాగంలో మార్పులు తెస్తా. పరిశ్రమలకు ఊతమిస్తా. గిరిజన గ్రామాల్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తా. జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో గ్రోత్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాను. దేవాలయాల పరిరక్షణకు పాటుపడతా. ఫుడ్ ప్రాసెసింగ్ (పార్క్) యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ రాస్తా. పైనాపిల్ పంటకు మార్కెట్ సౌకర్యం, మత్స్యకార గ్రామాల్లో జెట్టీ ఏర్పాటుకు కృషి చేస్తాను. సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా. ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. అన్ని వనరులూ ఉండి వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా నేతలు చర్యలు తీసుకోవాలి. విశాఖ సహా తిరుపతి, విజయవాడ పట్టణాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ సహాయం కోరతాను. అందరూ సహకరిస్తే కచ్చితంగా శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లోనూ ముందంజ వేయడం ఖాయం. - శ్రీకాకుళం, సాక్షి ప్రతినిధి -
జిల్లా కలెక్టర్‌గా గౌరవ్ ఉప్పల్
శ్రీకాకుళం కలెక్టరేట్: జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న సౌరభ్‌గౌర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం జరిపిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈ మార్పులు జరిగాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 జూలై 3న జిల్లా కలెక్టర్‌గా వచ్చిన సౌరభ్‌గౌర్ సరిగ్గా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం జరిపిన సాధారణ బదిలీల్లో భాగంగా ఈయన కూడా బదిలీ అయ్యారు. అయితే గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావుకు అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. అదే పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన బదిలీకి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి.. కొత్తగా వస్తున్న గౌరవ్ ఉప్పల్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ(పబ్లిక్ పాలసీ) పీజీ పట్టా తీసుకున్నారు. 1975లో జన్మించిన ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో విజయవాడ్ సబ్ కలెక్టర్‌గా, గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లి రైల్వేల్లో పని చేశారు. అనంతరం గత నెల 26నే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈయన్ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమించింది.