సిక్కోలును అభివృద్ధి చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరినట్టు తెలిసింది. గురువారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి చేయాల్సిన అంశాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వెనుకబడిన జిల్లాగా ఉండిపోయిన శ్రీకాకుళాన్ని భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిందేనని, ఇందుకు ఇక్కడ ఉన్న వనరులు, భూ లభ్యతపై వివరించినట్టు సమాచారం.
వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినటు అవుతోందని కలెక్టర్ వివరించినట్టు భోగట్టా. అలాగే వలసల్ని నివారించాలంటే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిందేనని వివరించారు. మొత్తం 29 అంశాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ ఉప్పల్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే వంశధార, వంశధార ప్రాజెక్టు ఫలాల్ని జిల్లా రైతులకు చేర వేయాలని, శివారు ప్రాంత రైతులకు కూడా సాగునీటిని చేర్చేందుకు పెండింగ్ పనుల్ని పూర్తిచేయాలని కోరారు.
బి.ఆర్.రాజగోపాలరావు (వంశధార) రెండోదశ పనుల్ని సకాలంలో పూర్తిచేస్తే జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని, పంటలు నష్టపోకుండా ఉండేందుకు ఈ నీరు ఎంతో అవసరమని వివరించారు. సాగు, తాగు నీటి సరఫరా, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా జిల్లా మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందని సీఎంకు కలెక్టర్ వివరించారు. అలాగే ఫోర్టుల ఏర్పాట్లు, అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు..సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఎంతో అవసరమని వివరించారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.