ఆర్భాటం చేశారు.. ఆదిలోనే వదిలేశారు!  | Arasavalli Temple UnDevelopment Story In Srikakulam | Sakshi
Sakshi News home page

ఆర్భాటం చేశారు.. ఆదిలోనే వదిలేశారు! 

Published Sun, Feb 16 2020 11:13 AM | Last Updated on Sun, Feb 16 2020 11:14 AM

Arasavalli Temple UnDevelopment Story In Srikakulam - Sakshi

సాక్షి, అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఖ్యాతిని మరింత పెంచేందుకు.. తద్వారా చిరస్థాయిగా అభివృద్ధి సాధించేలా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నిత్యపూజలందుకుంటున్న సూర్యదేవాలయంగా అరసవల్లి క్షేత్రానికి గుర్తింపు ఉంది. అయితే ఆ స్థాయిలో ఇక్కడ అభివృద్ధి కనిపించదు. భక్తులకు సరైన సౌకర్యాలు అందని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆదిత్యాలయానికి రూ.30 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ అంటూ బాకా ఊదిన అప్పటి చంద్రబాబు సర్కార్‌.. పనుల విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన గుండ లక్ష్మీదేవి కూడా తన స్వగ్రామ సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టేయడంతో దేవాలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

నాటి మాస్టర్‌ ప్లాన్‌ ఇదే 

దీంతో ఇక్కడి ప్రజలు ఆమెకు గుణపాఠం చెప్పి, అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ధర్మాన ప్రసాదరావుకు మరో అవకాశమిచ్చారు. ఆయన తన నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆదిత్యాలయానికి సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయాన్ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దేవదాయ శాఖ పరిధిలోని ప్రఖ్యాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో అరసవల్లి ఆలయంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.  

కొండెక్కిన పాత మాస్టర్‌ ప్లాన్‌.. 
గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన అరసవల్లి మాస్టర్‌ప్లాన్‌ అమలు కొండెక్కిపోయింది. మాస్టర్‌ ప్లాన్‌ అంటూ మ్యాప్‌లు సిద్ధం చేసి.. నాటి కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శోభను ప్రత్యేకాధికారిగా నియమించారు. అయితే నిధుల రూపంలో ఒక్క రూపాయి కూడా విదల్చక పోవడంతో మాస్టర్‌ ప్లాన్‌ అమలు ప్రశ్నార్థకమయ్యింది. ఐదేళ్లు మాటలకే పరిమితమై.. కేవలం తొలిదశ పనులంటూ ఆలయం ఎదురుగా ఉన్న 11 ఇళ్లను తొలగించి చేతులు దులుపుకున్న నాటి ప్రభుత్వ చర్యలపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.

అప్పట్లో ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు స్వయంగా ఆలయంలో కూర్చుని ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయిందంటూ తీవ్రంగా విమర్శలు వినిపించాయి. కేవలం ప్రకటనలకే పరిమితమైన ఆనాటి మాస్టర్‌ ప్లాన్‌కు మంగళం పలికి సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ముందుగా ఆలయానికి ట్రస్ట్‌బోర్డు నియామకాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పలువురు దరకాస్తులు చేసుకున్నారు. త్వరలోనే బోర్డు మెంబర్ల ఖరారుతోనే సరికొత్త అభివృద్ధికి అడుగులు పడనున్నట్లు సమాచారం.  

మార్పులు చేర్పులతో కొత్త ప్లాన్‌! 
గత మాస్టర్‌ ప్లాన్‌లో కీలక మార్పులు చేసి, కొత్త డిజైన్‌తో, భక్తులకు మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి జరిగేలా, నవ్యాంధ్రలో అద్భుత ఆలయాల సరసన అరసవల్లిని చేర్చేందుకు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేక నిపుణులతో కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలంటూ.. అందునా విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉండాలంటూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో.. ఈ ప్రభావం అరసవల్లిపై ఉంటుందనే అంచనాలున్నాయి.

నవ్యాంధ్రలో అరసవల్లి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా విశాఖపట్నంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా సూర్యదేవాలయ అభివృద్ధిపై చర్చలు జరిగాయి. మాస్టర్‌ ప్లాన్‌ అడుగులను వడివడిగా వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు స్వయంగా రంగంలోకి దిగి తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఈక్రమంలో అరసవల్లి భవిష్యత్‌లో అద్భుత పుణ్యక్షేత్రంతో పాటు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారే అవకాశముంది. 

నాటి మాస్టర్‌ ప్లాన్‌ ఇలా..
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో సమూల మార్పులు చేపడుతూ పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు 2016లోనే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ప్లాన్‌ అమలుకు మొత్తం 79 అసెస్‌మెంట్లు తొలిగించాలని నిర్ణయించారు. తొలి దశలో ఆలయం తూర్పు భాగాన ఉన్న 11 ఇళ్లను తొలిగించి తర్వాత పనులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. వాస్తవానికి రెండో దశలో తూర్పు భాగాన 12 షాపులు, సూర్యనమస్కార మండపం, సుమారు 20 ఇళ్లును కూడా తొలిగించాల్సి ఉంది. ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా పలు ఇళ్లు తొలిగించాల్సి ఉంటుంది. బ్రాహ్మణవీధి, ఆలయ ఉత్తర ద్వార వీధి, కాపు వీధి తదితర ప్రాంతాల్లో ఇళ్లను తొలిగించాలని నిర్ణయించారు.

మూడో దశ పనుల్లో భాగంగా అరసవల్లి ఆలయానికి ప్రధాన మార్గంగా అసిరితల్లి అమ్మవారి ఆలయానికి పక్కనున్న మార్గంగా గుర్తించి, ముఖద్వారం నిర్మించాలని నిర్ణయించారు. భక్తులంతా అదే మార్గం నుంచి వచ్చేలా నిర్ణయించారు. అయితే ఇదంతా గత ప్రభుత్వ ప్రతిపాదన కావడంతో ప్రస్తుత సర్కారు ఈ మాస్టర్‌ప్లాన్‌ను మార్చి, సరికొత్త డిజైన్లతో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు ఒక్కరూపాయి కూడా విదల్చకపోగా, తాజా ప్రభుత్వంలో ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కూడా మంజూరు చేయించి, ప్రతిష్టాత్మకంగా చేయించేలా ఎమ్మెల్యే ధర్మాన కృతనిశ్చయంతో ఉన్నారు. ఆరోగ్య ప్రదాత అరసవల్లి ఆదిత్యుని ఆలయాన్ని చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం పనులు చేపట్టకుండానే అర్ధంతరంగా వదిలేసింది. మాస్టర్‌ ప్లాన్‌ అంటూ హడావుడి చేసి పదకొండు ఇళ్లు పడగొట్టేసి అక్కడితో చేతులు దులిపేసింది. ఈ పరిస్థితిలో సూర్యదేవుని ఆలయాన్ని చరిత్రలో చరిస్థాయిగా నిలిచేలా సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

రివైజ్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌కు చర్యలు.. 
గత ప్రభుత్వ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు నిలిచిపోయింది. ప్రస్తుతం రివైజ్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు దీనిపై పలు సూచనలు చేశారు. భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న క్రమంలో వారికి అవసరమైన మెరుగైన సౌకర్యాలను కలి్పంచే దిశగా అడుగులు వేస్తున్నాం.  
–  వి.హరిసూర్యప్రకాష్‌, ఆలయ ఈవో 
    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement