అరసవల్లి(శ్రీకాకుళం): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ నెల 28న జరగనున్న రథసప్తమి మహోత్సవానికి సూర్యదేవాలయ ప్రాంగణ, పరిసరాలు ముస్తాబవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల (తెల్లవారితే శనివారం) నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించనున్నారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనల అనంతరం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రూట్ మ్యాప్‌ను బుధవారం విడుదల చేశారు. భక్తులకు వివిధ దర్శన మార్గాల వివరాలు స్పష్టంగా తెలియజేసేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో క్లాత్ బ్యానర్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు.
దాతల పాసులు
ఆలయ అభివృద్ధికి, వివిధ రకాలుగా విరాళాలు ఇచ్చిన వారికిచ్చే డోనర్ (దాతల) పాసులున్న వారు ప్రధాన రోడ్డులో బొంపాడ వీధి కూడలి నుంచి ప్రత్యేక క్యూలైన్‌లో వస్తారు. ఉత్తర ద్వారం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్‌లో ఆలయం లోపలికి వెళ్లనున్నారు. ఈ పాసుతో నలుగురికి అనుమతించనున్నారు. ఈ పాసులకు 27వ తేది అర్ధరాత్రి 12 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
ఉచిత దర్శనాలు
అరసవల్లి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నుంచి సాధారణ (ఉచిత) దర్శనాల క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఆలయానికి ఏ వైపు నుంచి వచ్చిన భక్తులైనా ఉచిత దర్శనానికి రావాలంటే ఇదొక్కటే మార్గం. ఇంద్రపుష్కరిణికి ఆగ్నేయంగా ఉన్న మార్గం ద్వారా పుష్కరిణి చుట్టూ ఉన్న కంపార్ట్‌మెంట్ల నుంచి ఆలయంలోకి దర్శనాలకు వెళ్తారు.
రూ.100 ప్రత్యేక టికెట్ దర్శనాలు
ఈ టికెట్‌తో దర్శనాలు కూడా అరసవల్లి హైస్కూల్ నుంచే క్యూలైన్లు ప్రారంభం కానున్నాయి. వీరు మాత్రం ఇంద్ర పుష్కరిణి ఈశాన్య గేటు, కేశఖండన శాల పక్క నుంచి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయానికి ఏ వైపు నుంచి వచ్చిన భక్తులైనా రూ.100 దర్శనానికి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఉచిత దర్శన భక్తులు, రూ.100 దర్శన టికెట్లు తీసుకున్న భక్తులు వేర్వేరుగా క్యూలైన్లలో వచ్చినప్పటికీ ఆలయ ప్రధాన గోపురం ముందు ఉన్న ఒకే క్యూలైన్లో కలిసిపోయి ఒకే లైన్ ద్వారా ఆలయంలోనికి దర్శనానికి వెళ్లనున్నారు.
క్షీరాభిషేక సేవ (ఇద్దరికి అనుమతి)
అరసవల్లి ప్రధాన రోడ్డులో బొంపాడ వీధి కూడలి వద్ద నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా వెళ్లనున్నారు. క్యూలైన్‌లోనే ఈ టికెట్టును రూ.500తో కొనుగోలు చేసుకున్న భక్తులు(ఇద్దరికి అనుమతి) ఆలయ ప్రధాన ఆర్చిగేట్ మీదుగా ప్రత్యేక లైన్లో దర్శనానికి వెళ్లనున్నారు. ఈ సేవ సప్తమి రోజున అర్ధరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
రూ.500 విశిష్ట దర్శనం (ఇద్దరికి అనుమతి)
బొంపాడ వీధి నుంచి ప్రారంభమైన క్షీరాభిషేక సేవ మార్గంలోనే వీరు కూడా వెళ్తారు. క్షీరాభిషేక సేవ అనంతరం అంటే ఉదయం 6 తర్వాత నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే లైన్‌లో విశిష్ట దర్శనం పేరిట (రూ.500) టికెట్టుదారులు దర్శనానికి వెళ్లనున్నారు.
వి.ఐ.పి టికెట్ (ఇద్దరికి అనుమతి)
ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన విఐపి టికెట్ (రూ.500)లను శ్రీకాకుళం ఆర్డీవో అనుమతితో అరసవల్లి యూనియన్ బ్యాంకులో కొనుగోలు చేసిన భక్తులు నేరుగా ఆలయ ప్రధాన ఆర్చిగేట్ నుంచి ప్రత్యేక క్యూలైన్లలో దర్శనాలకు వెళ్లనున్నారు. వీరు సుదర్శన మండపం వద్ద రూ.500 విశిష్ట దర్శనదారులతో కలిసిపోయి ఒకేలైన్లో స్వామి వారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
వీవీఐపీ భక్తులు
రాష్ట్రానికి చెందిన వీవీఐపీ స్థాయి గల ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు ఆలయ ప్రధాన ఆర్చిగేటు నుంచి నేరుగా అనివెట్టి మండపం నుంచి వెళ్లి మళ్లీ అదే మార్గంలో వెనుదిరిగేలా ఏర్పాట్లు చేశారు. వీరి వాహనాలు కూడా ప్రధాన ఆర్చిగేటు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎగ్జిట్ మార్గం
ఇక సాధారణ భక్తులు, దాతలు, రూ.100, రూ.500 దర్శన టికెట్లు, రూ.500 వీఐపీ టికెట్లు భక్తులంతా స్వామి దర్శనానంతరం ఆలయ ఎగ్జిట్ ద్వారం నుంచే నేరుగా బ్రాహ్మణవీధి మీదుగా బొంపాడ వీధి కూడలి ప్రధాన రోడ్డుకు చేరుకునేలా ఈ మ్యాప్ సిద్ధం చేశారు.
వాహనాల పార్కింగ్:
అరసవల్లి మిల్లు కూడలి వైపు నుంచి వచ్చిన వాహనాలన్నీ 80 ఫీట్ రోడ్డు వద్ద వాహనాల పార్కింగ్‌కు, స్థానిక పెద్దతోట వద్ద చెప్పుల స్టాండ్లకు ఏర్పాట్లు చేశారు. కళింగపట్నం రోడ్డు నుంచి అరసవల్లి వచ్చే భక్తుల వాహనాలను అసిరితల్లి ఆలయం వద్ద పార్కింగ్, చెప్పుల స్టాండ్ కోసం సిద్ధం చేశారు. ఇక మిల్లు కూడలి, డీసీఎంఎస్ కార్యాలయం, ప్రధాన ఆర్చిగేటు, అసిరితల్లి అమ్మవారి ఆలయం కూడలి, నగర పాలక ఉన్నత పాఠశాలల వద్ద పోలీస్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment