జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా కొత్త కలెక్టర్‌గా పి.లక్ష్మీనరసింహాన్ని ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజుల క్రితం వరకు కలెక్టర్‌గా ఉన్న గౌరవ్ ఉప్పల్ ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించడంతో ఈ నెల మూడో తేదీన ఆయన రిలీవై వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రస్తుతం ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా బుధవారం జరిపిన ఐఏఎస్‌ల పోస్టింగులు, బదిలీల్లో భాగంగా లక్ష్మీనరసింహం జిల్లా కలెక్టర్‌గా రానున్నారు. రాష్ట్ర సచివాలయంలోని భూపరిపాలనలో ప్రస్తుతం పని చేస్తున్న ఆయన గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ సర్వీసులో చేరి, 2008లో ఐఏఎస్ హోదా పొందారు. ఆ వెంటనే విజయనగరం జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేశారు. 2010 నుంచి 2013 వరకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.
అక్కడి నుంచి భూ పరిపాలన విభాగానికి బదిలీ పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీసీఎల్‌ఏలో విజిలెన్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పి గోపాలక్రిష్టారెడ్డి వద్ద పీఎస్‌గా పనిచేశారు. హూద్‌హుద్ తుపాను సమయంలో సహయ చర్యల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చిన ఆయనపాలకొండ డివిజన్‌లో పని చేశారు. కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల కావడంతో బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. అయితే కొత్త కలెక్టర్ విధుల్లో చేరేందుకు కొద్ది రోజులు పట్టవచ్చని తెలిసింది.