వసతి గృహంలో మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటూ వసతి గృహల్లో ఉంటున్న విద్యార్థులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆప్యాయంగా ప్రశ్నించారు.
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్: వసతి గృహంలో మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటూ వసతి గృహల్లో ఉంటున్న విద్యార్థులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆప్యాయంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఆముదాలవలసలోని బాలుర సాంఘీక సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు నిర్వహించి వసతి గృహంలో బస చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి కష్ట సుఖాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా వసతి గృహంలో విద్యార్థులకు పెట్టే మెనూపై ఆరా తీశారు. వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అంటూ.. విద్యార్థులు ఉపయోగించే స్నానపు గదుల, మరుగు దొడ్లను స్వయంగా పరిశీలించారు.
విద్యార్థులు ఇలా చెప్పారు...
నిత్యం వసతి గృహంలో పెట్టే మెనూలో కిచిడీ, టమాటా రైస్, పొంగలి వంటివి మాకు నచ్చడంలేదని వాటిని వృథాగా కొంతమంది బయటపడేస్తున్నారని విద్యార్థులు చెప్పారు. అలాగే వసతి గృహంలో దోమలు బెడద ఎక్కువుగా ఉందని, తాగునీటి బోరు ఉన్నా ఎన్నటికప్పుడే మరమ్మతులకు గురవుతోందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ముందస్తుగా వసతిగృహాధికారి విద్యార్థులు సార్‌వస్తే అంతా సక్రమంగా ఉందని చెప్పాలని చెప్పడంతో విద్యార్థులు కొంతమంది భయపడి అంతా బాగుందని మొదటగా చెప్పారు. కలెక్టర్ ఈ విషయాన్ని గమనించి వారి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసి అధికారులు ఎవరూ లేరని భయం లేకుండా చెప్పండని విద్యార్థులను ప్రశ్నించడంతో కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
వసతిగృహాల అభివృద్ధికే ఈ పరిశీలన..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల అభివృద్ధికే ఈ పరిశీలన నిర్వహిస్తునట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. జిల్లాలో 69వ సాంఘికసంక్షేమ, ట్రైబుల్ వెల్‌ఫేర్ వసతి గృహాలు ఉన్నాయని అందులో 53 వసతి గృహాల్లో 53 మంది జిల్లా అధికారులు శుక్రవారం రాత్రి ఇలా పరిశీలనలకు వెళ్లి వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు బసచేసి ఉదయాన్నే వారితో కలిసి టిఫిన్ చేసి నివేదిక సమర్పిస్తారని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తాను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. వసతి గృహాధికారులు తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ వారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ వారిని ఇంటిని మరిపించే విధంగా చూడాలని వసతి గృహాధికారి కె. ప్రహ్లాదరావవుకు సూచించారు. కార్యక్రమంలో సహాయక సాంఘిక సంక్షేమాధికారి ఎస్. కృష్ణారావు, ఆమదాలవలస తహశీల్దారు కె. శ్రీరాములు, ఆర్‌ఐ రామశాస్త్రి, వీఆర్‌వోలు కిరణ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.