సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఆర్భాటంగా ప్రారంభమై హడావుడిగా ముగిసింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం హడావుడిగా చేరుకుని అంతే వేగంగా కార్యక్రమానికి ముగింపు పలికారు.
తొలిసారి నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరులోని మేరిమాత ఇంగ్లిషు మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పార్టీ గొప్పగా చేస్తుందని కార్యకర్తలు, నాయకులు భావించారు. పార్టీకి విశిష్ట సేవలు చేసిన 26 మంది కార్యకర్తలను సత్కరించాలనీ నిర్ణయించారు. అయితే అధినేత చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడానికి వచ్చిన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
సింగపూర్ వెళ్లే హడావుడిలో అధినేత ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించే క్రమంలో వారిని పట్టించుకోలేదు. ప్రశంసాపత్రం ఒకరికి ఇచ్చి, పురస్కారం మరొకరికి చేశారు. ఆవిర్భావ దినోత్సవానికి జిల్లాస్థాయి అధికారుల నుంచి మంత్రులు, ముఖ్యనేతలు మూడు రోజులు కష్టపడి జనాన్ని సమీకరించి వేదిక ఏర్పాటు చేసి హైరానా పడితే చంద్రబాబు అలా వచ్చి ఇలా వెళ్లడంతో నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.
గంటలో ముగింపు..
ఆదివారం సాయంత్రం మూడు గంటలకు సీఎం తుళ్లూరులోని మేరీమాత హైస్కూలులో ఏర్పాటు చేసిన వేదికపైకి వస్తారని మంత్రులు ప్రకటించారు. దీంతో ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం రెండు గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. తీరా సీఎం సాయంత్రం 5 గంటలకు వేదికపైకి వచ్చారు. అప్పటి వరకు కార్యకర్తలను ఆకట్టుకునే విధంగాా వేదికపై హాస్యం, చోటామోటా నాయకుల ఊకదంపుడు ప్రసంగాలతో సరిపెట్టారు.
మేరీమాత హైస్కూలు విద్యార్థులతో మా తెలుగుతల్లి, వందేమాతరం, అల్లూరిసీతారామరాజు ఘట్టాలను ప్రదర్శించారు. సీఎం రెండు గంటలు ఆలస్యంగా రావటంతో నేరుగా ప్రసంగం ప్రారంభించి గంటలో ముగించారు.
కార్యకర్తల సన్మానం గందరగోళం...
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 13 జిల్లాల నుంచి జిల్లాకు ఇద్దరేసి చొప్పున 26 మంది కార్యకర్తలను సన్మానించాలని నిర్ణయించి ఆహ్వానించారు. సన్మాన సమయానికి వేదికపై గందరగోళం ఏర్పడింది. సన్మాన గ్రహీతలకంటే ముందే నాయకులు, యువత, కార్యకర్తలు వేదికపైకి దూసుకుపోయి పోలీసులను సైతం లెక్కచేయకుండా సీఎంకు పూలదండలు, బొకేలు అందించారు.
దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన సన్మానగ్రహీతలు తోపులాటలో చిక్కుకు పోయారు. ఒక దశలో పోలీసులు నాయకులకు మధ్య వాగ్వావాదం జరిగింది. దీంతో సీఎం హడావుడిగా కార్యకర్తలను శాలువాలు, ప్రశంసాపత్రాలతో సన్మానించాల్సి వచ్చింది. రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావును సీఎం ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి నారాయణ, రావెల కిశోర్‌బాబు, దేవినేని ఉమా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, మన్నవ సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, గ్రామ సర్పంచ్ ఇందుర్తి నరసింహారావు, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు.