స్వయం శక్తి సంఘాలకు ఇసుక రవాణా బాధ్యతలు!
ఎచ్చెర్ల: త్వరలో ఇసుక రవాణా బాధ్యతలను స్వయంశక్తి సంఘాలకు అప్పగించి ఇసుక అక్రమ తరలింపునకు చెక్ చెబుతామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. ఎచ్చెర్ల మహిళా ప్రాంగణ శిక్షణ కేంద్రం(టీటీడీసీ)లో జిల్లాలోని స్వయంశక్తి సంఘాల పని తీరుపై ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని 13 జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం జిల్లాలోని స్వయం శక్తి సహాయక సంఘాల పని తీరు బాగుందన్నారు. ఐకేపీ కార్యక్రమాలు, పింఛన్ పంపిణీల వివరాలను సమాఖ్య సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పని తీరులో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఐకేపీ సిబ్బంది, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలాలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర స్థాయిలో అధికారులతో మాట్లాడి పరి ష్కరిస్తామని చెప్పా రు. మండలాల్లో ఆధార్ సీడింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆధార్ సీడింగ్ జరగనిదే ప్రభుత్వ పథకాలు ప్రజలకు, లబ్ధిదారులకు చేరవని తేల్చి చెప్పారు. గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు ఎస్.తనూజారాణి మాట్లాడుతూ జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య భవనాల నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయన్నారు. ఆ పనులకు మరో * 5 లక్షల వరకు నిధులు అవసరమౌతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నిధుల మంజూరుకు త్వరలో చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం తనిఖీ
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎచ్చెర్ల మహిళా శిక్షణా కేంద్రంలోని కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని తనిఖీచేశారు. కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను సైతం పరిశీలించారు. ఏర్పాట్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను సున్నితంగా మందలించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కె.సావిత్రి, ఏపీడీ ల్యాండ్ జి.సుజాత, తహశీల్దార్ బి.వెంకటరావు, ఎంపీడీవో పి.రాధ, జిల్లాలోని పలు మహిళా సంఘాల సమాఖ్య సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.