అర్హతే కొలమానం
శ్రీకాకుళం అర్బన్: పింఛన్ లబ్ధిదారుల ఎంపికకు అర్హతే కొలమానమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగానే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని.. ప్రతి ఒక్క అర్హుడూ లబ్ధి పొందాల్సిందేనన్నారు.
గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 10 లక్షల మంది అనర్హులు లబ్ధి పొందినట్టు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసునన్నారు. ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వెళ్లి వారి సమస్యల పరిష్కరించాలనే లక్ష్యంతోనే జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగం రోజంతా ఒకే గ్రామంలో ఉండి అక్కడి సమస్యలను తెలుసుకుంటారన్నారు. పేదల ఆరోగ్యానికి ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. 2029 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన పేదరికం లేని పరిశుభ్ర రాష్ట్రంగా తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. 2019 నాటికి పరిశుభ్ర భారత్‌లో భాగంగా పరిశుభ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను స్థాపించినట్టు వెల్లడించారు. జిల్లాలో రెండు మండలాలను 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎంపిక చేసినట్టు మంత్రి ప్రకటించారు. అలాగే విద్యుత్ ఆదా చేయడానికి పేదలకు రూ. 400 విలువ చేసే ఎల్‌ఈడీ బల్బును పది రూపాయలకే అందిస్తున్నామని, ఇందుకోసం జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశామన్నారు. ఎన్‌టీఆర్ భరోసా కార్యక్రమం కింద పింఛన్‌ను ఐదురెట్లు పెంచి రెండు వందల పింఛన్‌ను రూ.వెరుు్య చేశామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జన్మభూమి మాఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25న ప్రారంభించామని, ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకూ కొనసాగుతోందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌లో నమోదు కానివారు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్లను రూపొందించనున్నట్లు తెలి పారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రచార పోస్టర్లను మంత్రి తదితరులు విడుదల చేశారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.హెచ్.షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషా ఖాసీం, మెప్మా పీడీ ఎం.సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, డీఈవో ఎస్.అరుణకుమారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, నాయకులు జామి భీమశంకర్, పి.వి.రమణ, వెంకటలక్ష్మి, సుగుణ పాల్గొన్నారు.
తొలిరోజు ఆర్భాటమే !
శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో తొలి రోజైన గురువారం ఆర్భాటమే మిగిలింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని సంక్షేమాలకు, హమీలకు ఆక్టోబర్ రెండో తేదీ గడువని ప్రజలను పాలకులు నమ్మిస్తూ వచ్చారు. పలు పథకాలు, పెరిగిన పింఛన్లు ప్రజలకు అందజేయనున్నట్టు ప్రచారం చేశారు. అయితే జన్మభూమి ప్రారంభంతో మాత్రం ప్రజల ఆశలు తీరలేదు. అన్ని ఆరకొరగానే జరిగాయి. అయితే నాలుగో తేదీ శనివారం నుంచి జన్మభూమి కార్యక్రమం పూర్తిస్థారుులో ప్రారంభం కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలిరోజు జిల్లా అంతటా గాంధీ జయంతి ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించారే తప్పా హామీల మేరకు సంక్షేమ పథకాలు మాత్రం ప్రారంభం కాలేదు.
సుజలధార పథకం శ్రీకాకుళం పట్టణంతోపాటు మరో రెండుచోట్ల మాత్రమే ప్రారంభించారు.
నిరంతర విద్యుత్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. వైద్య శిబిరాలు నిర్వహించలేదు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నామమాత్రంగానే ప్రారంభమైంది.