పర్యాటక పరుగులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు నవ్య శోభతో కళకళలాడనున్నాయి. విశాలమైన తీరప్రాం తం, సహజసిద్ధమైన ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఆలవాలమైన శ్రీకాకుళం జిల్లాను పర్యాటక రంగంలో పరుగులు తీయించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రతి పాదనలు రూపుదిద్దుకుంటున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యాటక రంగానికి రూ.4.50 కోట్లు విడుదల కావడంతో రెట్టిం చిన ఉత్సాహంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల పనులు ప్రారంభించగా రానున్న రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. పలు గ్రోత్ సెం టర్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్ ఈనెల 26 నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తుండటంతో ఆమెకు సమర్పించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రోత్ సెంటర్ల వివరాలు
* పొన్నాడ కొండ-బ్రిడ్జి ప్రాంతంలో రూ.2 కోట్ల అంచనాతో విశాఖలోని కైలాసగిరి తరహాలో మినీ కైలాసగిరి ఏర్పాటు కానుంది.
* భావనపాడులో ఫిషింగ్ హార్బర్, మినీ పార్కు, స్పీడ్ బోట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
* గుళ్ల సీతారాంపురంలో 16వ శతాబ్దానికి చెందిన రామాలయంలో విద్యుత్ ధగధగలు, తోటలు, కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలతో పనులు ప్రారంభం కానున్నాయి.
* సరుబుజ్జిలి మండలం దంతపురి ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
* జిల్లాకే తలమానికంగా ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి దైవ క్షేత్రాలతోపాటు శాలిహుండం, కళింగపట్నం, తేలి నీలాపురం, బారువ బీచ్ వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధు లు కావాలని ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి.
జరుగుతున్న పనులివే..
* శ్రీకాకులం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలో ఉన్న డచ్‌హౌస్‌ను రూ.50 లక్షలతో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మూడు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
* అరసవల్లి రోడ్డులోని ఇందిరా విజ్ఞాన్ భవన్ సమీపంలో రూ.13 కోట్ల ఖర్చుతో బడ్జెట్ హోటల్ రానుంది. ఇప్పటికే రూ.6 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి.
* కళింగపట్నం బీచ్‌లో రూ.17 కోట్లతో బీచ్ రిసార్ట్స్‌తో పాటు శిల్పారామం కూడా ప్రారంభం కానున్నాయి.
* అరసవల్లిలో రూ.16 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టగా శ్రీకూర్మంలో రూ.35 లక్షలతో, శ్రీముఖలింగంలో రూ.18 లక్షలతో, రావివలస మల్లిఖార్జునస్వామి ఆలయంలో రూ.1.12లక్షలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాం తాల్లో గదులు, ఇతరత్రా వసతుల కల్పనకు తొలి దశలో రూ.50 లక్షలతో టెండర్లు పిలవనున్నారు.
* మడ్డువలస జలాశయంలో బోట్ షికారుకు రూ.60 లక్షలతో టెం డర్లు పిలవనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే తమ శాఖ కు రూ.4.57 కోట్లు జమ అయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్
శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు బౌద్ధారామాలను అనుసంధానం చేస్తూ త్వరలో అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్’ను తీర్చిదిద్దనున్నారు. ఇది పూర్తిస్థాయిలో తయారైతే చైనా తదితర దేశాలకు చెందిన బౌద్ధ మతస్తులు తరచూ ఇక్కడకూ వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు. శాలిహుండం, నగరాలపేట, దంతపురి ప్రాం తాల్లో ఇప్పటికే ప్రముఖ బౌద్ధమతస్తుడు శాంతన్‌సేథ్ పర్యటించి ఓ ప్రణాళిక సిద్ధం చేశారని, త్వరలో దానిని కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు.