డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం సామాజిక బాధ్యత
* సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ
* రూ.230కే బస్తా సిమెంటును ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: పేదలకు నాణ్యతతో కూడిన విశాలమైన రెండు పడక గదుల ఇళ్లు (డబుల్ బెడ్‌రూం) నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా సిమెంటు కంపెనీలు తోడ్పాటునివ్వాలని వారు కోరారు. దీనికి సంబంధించి మంత్రులు శుక్రవారం సచివాలయంలో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో 2.72లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు 27లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు అవసరమని మంత్రులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లక్షా ఎనిమిది వేల ఇళ్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలో నిర్మించే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించామని..గతంలో మాదిరిగా బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండబోదని మంత్రులు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం బస్తా సిమెంటును రూ.230కి అమ్మేందుకు సిమెంటు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా సిమెంటును సరఫరా చేస్తామన్నారు. అనంతరం స్టీల్ కంపెనీల ప్రతినిధులతోనూ మంత్రులు భేటీ అయ్యారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు గాను సుమారు 4.1లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరమని మంత్రులు తెలిపారు. ధరపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రులతో జరిగిన సమావేశంలో 30 సిమెంటు కంపెనీల ప్రతినిధులతో పాటు.. వీఎస్పీ, టాటా, సెయిల్ తదితర స్టీల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి, గనుల శాఖ డైరక్టర్ సుశీల్ కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు
రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించి.. ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. బండ్లగూడ, పోచారంలో స్వగృహ పథకం కింద నిర్మించిన మూడు వేల ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. యూనిట్ ధరను నిర్ణయించాలని.. ఉద్యోగ సంఘాల నుంచి అందిన ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు.