మరో వికెట్ డౌన్! | Director of the water Project Management Institute transfered as 'social welfare' department | Sakshi
Sakshi News home page

మరో వికెట్ డౌన్!

Published Sat, Nov 30 2013 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Director of the water Project Management Institute transfered as  'social welfare' department

 సాక్షి, సంగారెడ్డి: మరో వికెట్ పడింది. కలెక్టర్ స్మితా సబర్వాల్ కఠిన వైఖరి, ముక్కుసూటి వ్యవహారం మరో జిల్లా అధికారి బదిలీకి దారితీసింది. ఇటీవల పలుమార్లు కలెక్టర్ ఆగ్రహానికి గురై వార్తల్లో నిలిచిన నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సి. శ్రీధర్ బదిలీ అయ్యారు. డ్వామా పీడీగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఆయన్ను మాతృశాఖ ‘సాంఘిక సంక్షేమ’కు తిప్పి పంపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె. రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌కు  డ్వామా పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు. 2012 ఫిబ్రవరి 29న డ్వామా పీడీగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ స్మితా సబర్వాల్ పలుమార్లు డ్వామా పీడీ శ్రీధర్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో పీడీ శ్రీధర్ సొంత శాఖకు బదిలీ చేయాలని కోరుతూ గ్రామీణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవడం.. చకచక ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. బదిలీని కోరుతూ గట్టిగా ప్రయత్నించడంవల్లే వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారుల్లో చర్చ జరుగుతోంది. కాగా బదిలీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత పీడీ శ్రీధర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ .. పదవీ కాలంలో మెదక్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివారని పేర్కొన్నారు. బదిలీకి వెనుక గల కారణాలను తెలపాలని కోరగా.. ‘నో కామెంట్’ అని స్పందించారు.
 క్యూ కట్టారు...
 గత నెల 16న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ తొలి రోజు నుంచే దూకుడును అవలంబిస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయా ప్రభుత్వ ప్రభుత్వ శాఖల అధిపతులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అధికారుల పనితీరు, సామర్థ్యం, వ్యవహార శైలిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆమె.. పనితీరు సరిగ్గా లేని కొందరు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదే కోవలో కలెక్టర్ ఆగ్రహానికి గురైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రంగారెడ్డి ఈ నెల 18 నుంచి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయారు. జిల్లా రెవెన్యూ అధికారి ఐ. ప్రకాశ్ కుమార్ సైతం ఈ నెల 6న దీర్ఘకాలిక సెలవుపై తప్పుకున్నారు. వీరిద్దరూ కూడా కలెక్టర్ ఆగ్రహానికి గురైనవారే. ఇక జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా గత నెల 4న బాధ్యతలు స్వీకరించిన ఇ. రవికుమార్‌ను ఆ మర్నాడే కలెక్టర్ స్మితా సబర్వాల్ వెనక్కి పంపించారు. మరి కొంతమంది జిల్లాధికారులు సైతం స్వచ్ఛందంగా తప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇతర జిల్లాల్లో మంచి పోస్టింగ్‌ల కోసం స్థానిక నేతల మద్దతు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement