సార్వత్రిక లెక్కింపునకు సర్వం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ తెలిపారు. జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు మొత్తం మూడు కేంద్రాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్‌ఐసీలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండవ రాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో 76.84 శాతం ఓటింగ్ నమోదైంద న్నారు.
మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు పటాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో, సంగారెడ్డి మండలం పసల్‌వాదిలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కాశీపూర్‌లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నారాయణ్‌ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జహీరాబాద్ పార్లమెంటరీ స్థానం ఓట్ల లెక్కింపు డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో, మెదక్ పార్లమెంటరీ ఓట్ల కౌంటింగ్ గీతం విశ్వవిద్యాలయంలో ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్‌లను ముందుగా లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వీడియో ద్వారా చిత్రీకరిస్తామని తెలిపారు.