Counting of votes in the general election
-
నేటి సార్వత్రిక ఓట్ల లెక్కింపు కోసం భారీ భద్రత
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక (ఎంపీ, ఎమ్మెల్యే) ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డికి సమీపంలోని ఫసల్వాది ఎంఎన్ఆర్ కళాశాల, కాశీపూర్‌లోని డీవీఆర్ కళాశాల, పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వ విద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎస్పీలు, ఒక ఓఎస్డీ, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 90 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 9 స్పెషల్ పార్టీ పోలీసులు, 150 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరూ కూడా గుమిగూడి ఉండరాదని ఎస్పీ శెముషీ హెచ్చరించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో 30 పోలీసు చట్టం, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎస్పీ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవరు కూడా అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, ఇంకు పెన్నులు, బ్లేడ్లు, చాకులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు, సుత్తెలు వంటివి తీసుకుని వెళ్లరాదని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
గ్రాండ్ పైనల్‌కి ఏర్పాట్లు పూర్తి
-
సార్వత్రిక కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం రోజున బయట వ్యక్తులు ఎవరూ ఒంగోలు నగరంలో ఉండవద్దని ఒంగోలు డీఎస్పీ పి.జాషువా చెప్పారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో తీసుకుంటున్న జాగ్రత్తలు, బందోబస్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కౌంటింగ్ జరుగుతున్న క్విస్, పేస్, రైజ్ ఇంజనీరింగ్ కాలేజీల వద్ద మొత్తం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్‌తోపాటు 30 పోలీసు యాక్టూ అమల్లో ఉంటుందన్నారు. అంతేగాక నగరంలో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాస్తుంటాయని చెప్పారు. లెక్కింపు రోజున బయట వ్యక్తులకు అవకాశమివ్వొద్దని లాడ్జీల యజమానులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోకి వచ్చే కొత్త వ్యక్తుల గురించి వాకబు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఒంగోలు రావద్దని సూచించారు. ఎక్కువమంది వస్తే వారికి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థిని బాధ్యునిగా చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ సెంటర్లలోకి అభ్యర్థులు, ఏజెంట్ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, వారి వాహనాలు కూడా కౌంటింగ్ జరుగుతున్న కాలేజి లోపల వరకు వచ్చేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు సెల్ఫోన్లు తెచ్చుకోవద్దన్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, ఆ గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, బాణసంచా కాల్చడం, గులాం చల్లుకోవడం లాంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ ఏటీఏ రామారావు, తాలూకా సీఐ శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. జిల్లాలోని 9 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోకవర్గాలకు సంబంధిం చిన ఈవీఎంలను డిచ్పల్లి సీఎంసీ కళాశాల భవనంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. ఇక్కడే కౌంటింగ్ నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి కలెక్టర్ సీఎంసీ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ.. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గంట ముందుగానే పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్లోకి చేరుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేసిన స్ట్రాంగ్ గదులను తెరచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్లోకి తీసుకువస్తారన్నారు. ఏజెంట్లుతమ వెంట తెల్లపేపర్, పెన్సిల్ తప్ప ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సూచించారు. ఏజెంట్లకు పాస్‌లు తప్పని సరని, పాస్ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సమయంలో బయటకు వెళ్లే ఏజెంట్లను తిరిగి లోనికి అనుమతించ బోమన్నారు. కౌంటింగ్ హాల్లోకి ముందు అధికారులు, తర్వాతే పోలింగ్ ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లకు తాగునీటి వసతి మాత్రమే కల్పిస్తామని, భోజన వసతి కల్పించడం లేదన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు, ఏజెంట్లు గమనించి అధికారులకు సహకరించాలని సూచించారు. కౌంటింగ్ జరిగే కేంద్రం వద్ద 100 గజాల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉం టుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నియమ,నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం కౌంటింగ్ జరుగుతుందని, 16నుంచి 18 వరకు రౌండ్లు ఉంటాయన్నారు. 18 గదుల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ, ఎంపీ కౌం టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌లో వేయి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్‌కు హాజ రయ్యే ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లో నికి వెళ్లాలనిసూచించారు. అభ్యర్థులు, ఏజెం ట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బోర్డులు ఏర్పాటు చేసినట్లుతెలిపారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే వాహనాలు నిలుపాలన్నారు. -
కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నియోజకవర్గాలకు గానూ 99 టేబుళ్ల ద్వారా మొత్తం 253 రౌండ్లలో ఓట్లు లెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అత్యధికంగా సతుపల్లి 36 రౌండ్లు, తరువాత అశ్వారావుపేట నియోజకవర్గానికి 29 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 197 రౌండ్లలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆయా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గెలుపొందిన అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. అలాగే ఎంపీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల వివరాలు కూడా అసెంబ్లీ ఫలితాల రౌండ్ల మాదిరిగానే వెల్లడిస్తారు. అయితే పార్లమెంట్ పూర్తి ఫలితాల వివరాలు విజయ ఇంజనీరింగ్ కళాశాలలో వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేర్వేరుగా ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇల్లెందు, పినపాక, ఖమ్మం అసెంబ్లీ ఫలితాలు ముందుగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌కు 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 99 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 700 మంది సిబ్బందిని నియమించారు. వారిలో 200 మందిని కౌంటింగ్ సూపర్వైజర్లుగా, 500 మందిని కౌంటింగ్ అసిస్టెంట్లుగా నియమించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూండంచెల భద్రత కల్పిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రౌండ్ల వారీ ఫలితాల కోసం ఉఇఐ.ూఐఇ.ఐూ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. -
సార్వత్రిక లెక్కింపునకు సర్వం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ తెలిపారు. జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు మొత్తం మూడు కేంద్రాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్ఐసీలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండవ రాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో 76.84 శాతం ఓటింగ్ నమోదైంద న్నారు. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాలకు పటాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో, సంగారెడ్డి మండలం పసల్‌వాదిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కాశీపూర్‌లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నారాయణ్‌ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జహీరాబాద్ పార్లమెంటరీ స్థానం ఓట్ల లెక్కింపు డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో, మెదక్ పార్లమెంటరీ ఓట్ల కౌంటింగ్ గీతం విశ్వవిద్యాలయంలో ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లను ముందుగా లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వీడియో ద్వారా చిత్రీకరిస్తామని తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 11మంది అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏడుగురు అబ్జర్వర్ల నియామకానకి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాకు 2600 పవర్ ప్యాక్స్ అవసరమన్నారు. 1.24 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు ప్రతిపదనలు పంపినట్టు చెప్పా. ఈవీఎంలను భద్రపరచేందుకు నిర్మిస్తున్న గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయినట్టు చెప్పారు. మొదటి అంతస్తు పనులు పురోగతిలో ఉన్నాయని, దీనికిగాను 14.74 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, కౌంటింగ్ ఏజెంట్ల జాబితా ఇవ్వాలని కోరామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసినట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి డ్యూటీలు వేశామన్నారు. కౌంటింగ్‌ను పటిష్టంగా నిర్వహించేందుకు వివిధ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు బ్యాలెట్ ఈవీఎంలను తీసుకొచ్చేప్పుటి నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో దివ్య, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, ఏఓ చూడామణి, ఎన్నికల అధికారి యూసఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఇలా...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్లను కూడా లెక్కిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత 30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పత్రాల కోసం ప్రత్యేకమైన బల్లలు ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కింపును రిటర్నింగ్ అధికారి చూస్తారు. ఓటరు నుంచి వచ్చే ప్రతి పోస్టల్ బ్యాలెట్ పత్రం ఫారం 13 బిలో లోపల ఉంచిన కవర్లో ఉంటుంది. నిర్ణీత సమయంలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఫారం 13-సి కవర్లను ఒకదాని తర్వాత ఒకటి రిటర్నింగ్ అధికారి తెరుస్తారు. ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓటును లెక్కించి ఫారం -20 ఫలితం షీట్లో నమోదు చేసి అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాలి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫైనలైజ్ చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈవీఎం లెక్కింపులలో అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించరాదు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపైనే విజయం నిర్ధారణ అయ్యే సమయంలో... వాటిని పునఃధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. పరిశీలకుడు, రిటర్నింగ్ అధికారి సమక్షంలో పనికిరావని తిరస్కరించిన అన్ని పోస్టల్ బ్యాలెట్‌పత్రాలను, ప్రతి అభ్యర్థి పక్షాన లెక్కింప బడిన ఓట్లను మరోసారి పరిశీలించి సరిచూసుకోవాలి. తిరస్కరణ ఇలా... పోస్టల్ బ్యాలెట్‌పై ఓటు నమోదు కానప్పుడు.. ఒక అభ్యర్థికి కంటే ఎక్కువ మందికి ఓటు వేసినప్పుడు.. తప్పుడు బ్యాలెట్ పత్రమైతే... నిజమైన బ్యాలెట్ పత్రమని నిశ్చయించడానికి వీలులేకుండా చిరిగి, చెడిపోయినప్పుడు.. రిటర్నింగ్ అధికారి ఓటరుకు పంపిన కవరులో తిరిగి పంపకపోయినట్లయితే... పోస్టల్ బ్యాలెట్లో ఏ అభ్యర్థికి ఓటు వేశాడో నిర్ధారణ చేసుకోలేకపోతే.... పోస్టల్ బ్యాలెట్ ఏ ఓటరు పంపించింది గుర్తించే వీలున్నా, ఇతర రాతలున్నా వాటిని తిరస్కరించవచ్చు.