ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 11మంది అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏడుగురు అబ్జర్వర్ల నియామకానకి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాకు 2600 పవర్ ప్యాక్స్ అవసరమన్నారు. 1.24 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు ప్రతిపదనలు పంపినట్టు చెప్పా.
ఈవీఎంలను భద్రపరచేందుకు నిర్మిస్తున్న గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయినట్టు చెప్పారు. మొదటి అంతస్తు పనులు పురోగతిలో ఉన్నాయని, దీనికిగాను 14.74 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, కౌంటింగ్ ఏజెంట్ల జాబితా ఇవ్వాలని కోరామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసినట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి డ్యూటీలు వేశామన్నారు. కౌంటింగ్‌ను పటిష్టంగా నిర్వహించేందుకు వివిధ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు బ్యాలెట్ ఈవీఎంలను తీసుకొచ్చేప్పుటి నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో దివ్య, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, ఏఓ చూడామణి, ఎన్నికల అధికారి యూసఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
Published Sat, May 10 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement