ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నియోజకవర్గాలకు గానూ 99 టేబుళ్ల ద్వారా మొత్తం 253 రౌండ్లలో ఓట్లు లెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అత్యధికంగా సతుపల్లి 36 రౌండ్లు, తరువాత అశ్వారావుపేట నియోజకవర్గానికి 29 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 197 రౌండ్లలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆయా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గెలుపొందిన అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. అలాగే ఎంపీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల వివరాలు కూడా అసెంబ్లీ ఫలితాల రౌండ్ల మాదిరిగానే వెల్లడిస్తారు. అయితే పార్లమెంట్ పూర్తి ఫలితాల వివరాలు విజయ ఇంజనీరింగ్ కళాశాలలో వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ కేంద్రాలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేర్వేరుగా ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇల్లెందు, పినపాక, ఖమ్మం అసెంబ్లీ ఫలితాలు ముందుగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌కు 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 99 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 700 మంది సిబ్బందిని నియమించారు. వారిలో 200 మందిని కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా, 500 మందిని కౌంటింగ్ అసిస్టెంట్లుగా నియమించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూండంచెల భద్రత కల్పిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రౌండ్ల వారీ ఫలితాల కోసం ఉఇఐ.ూఐఇ.ఐూ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు
Published Thu, May 15 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement