ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం రోజున బయట వ్యక్తులు ఎవరూ ఒంగోలు నగరంలో ఉండవద్దని ఒంగోలు డీఎస్పీ పి.జాషువా చెప్పారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో తీసుకుంటున్న జాగ్రత్తలు, బందోబస్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కౌంటింగ్ జరుగుతున్న క్విస్, పేస్, రైజ్ ఇంజనీరింగ్ కాలేజీల వద్ద మొత్తం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్‌తోపాటు 30 పోలీసు యాక్టూ అమల్లో ఉంటుందన్నారు.
అంతేగాక నగరంలో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాస్తుంటాయని చెప్పారు. లెక్కింపు రోజున బయట వ్యక్తులకు అవకాశమివ్వొద్దని లాడ్జీల యజమానులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోకి వచ్చే కొత్త వ్యక్తుల గురించి వాకబు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఒంగోలు రావద్దని సూచించారు. ఎక్కువమంది వస్తే వారికి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థిని బాధ్యునిగా చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కౌంటింగ్ సెంటర్లలోకి అభ్యర్థులు, ఏజెంట్ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, వారి వాహనాలు కూడా కౌంటింగ్ జరుగుతున్న కాలేజి లోపల వరకు వచ్చేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు సెల్‌ఫోన్లు తెచ్చుకోవద్దన్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, ఆ గ్రామాల్లో పికెట్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, బాణసంచా కాల్చడం, గులాం చల్లుకోవడం లాంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ ఏటీఏ రామారావు, తాలూకా సీఐ శ్రీనివాసన్ పాల్గొన్నారు.
సార్వత్రిక కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
Published Thu, May 15 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement