హరియాణా ఫలితాలను అంగీకరించం
ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ ఆలస్యమెందుకు?
నిలదీసిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్
న్యూఢిల్లీ: ప్రతికూల ఫలితాలిచి్చన హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ‘‘ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం(లోక్‌తంత్ర) ఓడిపోయింది. మరో వ్యవస్థ(తంత్ర) అక్రమంగా గెలిచింది’’ అంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్రకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది
‘‘ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వెల్లడైన ఫలితాలివి. వీటిని మేం ఒప్పుకోం. పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైంది. హరియాణా అంకం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే, 70 శాతం బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచింది. ఇందులో కుట్ర దాగుంది. 12 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరిగితే మొదట ఆశ్రయించేది ఎన్నికల సంఘాన్నే.
పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అది. అందుకే తీవ్రమైన ఈ అంశంపై లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. నిరీ్ణత గడుపులోగా చర్యలు తీసుకోవాలని పట్టుబడతాం. ఓట్ల లెక్కింపు, ఈవీఎంల పనితీరుపై చాలా నియోజకవర్గాల్లో సందేహాలు పెరిగాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఇది విశ్లేషణల సమయం కాదు. మా నుంచి విజయాన్ని లాక్కున్నారు. వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నారనే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనికి ఫలితాలు దర్పణం పట్టట్లేవు.
ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం కౌంటింగ్, ఈవీఎంల పనితీరు, సమగ్రత ప్రశ్నార్థకంలో పడటమే. దాదాపు 3–4 జిల్లాల్లోని 12–14 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి మోపారు. ఇదంతా కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఒత్తిడే’’ అని జైరాం రమేశ్ అన్నారు.
200 ఓట్ల తేడాతో ఓడారు : ‘‘ 200 ఓట్లు, 300 ఓట్లు, 50 ఓట్లు.. ఇలా అత్యల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడారు. చక్కని ఆధిక్యత కనబరిచిన అభ్యర్థులు హఠాత్తుగా 100–200 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటి?. అవకతవకలు, అక్రమాల వల్లే ఇది సాధ్యం. అనూహ్య, దిగ్భ్రాంతికర పరిణామమిది. మార్పును కోరుకుంటూ హరియాణా ప్రజలు ఆశించిన దానికి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వెల్లడైన ఫలితమిది’’ అని జైరాం ఆరోపించారు.
ఎందుకంత నెమ్మది? : అంతకుముందు మధ్యాహ్నం వేళ జైరాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ‘‘ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఈసీఐ వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ అనూహ్యంగా నెమ్మదించాయి. దీనికి కారణమేంటి? అదమ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాశ్ 1,268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఆయనకు గెలుపు సరి్టఫికేట్ ఇవ్వట్లేదు. ఈసీ వెబ్‌సైట్‌లో కూడా ఆయన గెలిచినట్లుగా చూపించట్లేదు. చివరి మూడు రౌండ్ల అప్‌డేట్స్ ఇవ్వట్లేదు. అనవసర ఆలస్యానికి కారణమేంటి?’ అని జైరాం ప్రశ్నించారు.
ఆలస్యం జరగలేదు: ఈసీ : ఈసీ అప్‌డేట్స్ ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ ఆరోపణల్లో నిజం లేదు. బాధ్యతారాహిత్యంతో, తప్పుడు ఉద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల రూల్ నంబర్ 60 ప్రకారం ఆయా కౌంటింగ్ కేంద్రాల అధికారులు నడుచుకున్నారు. హరియాణా, జమ్మూకశీ్మర్‌లో లెక్కింపుపై అప్‌డేట్స్ ఆలస్యమయ్యాయన్న మీ మెమొరాండంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 25 రౌండ్ల ఫలితాలు అప్‌డేట్ అవుతూనే ఉంటాయి’ అని ఈసీ వివరణ ఇచి్చంది. ఈసీ వివరణపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. ‘‘ తటస్థ వైఖరిని అవలంబించాల్సిన ఈసీ ఏకపక్షంగా విపక్ష పార్టీ విన్నపాలను తోసిపుచ్చడం సహేతుకం కాదు. ఫిర్యాదుపై సంప్రదింపుల స్థాయిని ఈసీ దిగజార్చింది’’ అని జైరాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment