P. Joshua
-
కన్నతండ్రే కాలయముడయ్యాడు
ప్రేమను పంచాల్సిన కన్నతండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెనుభూతమై...ఆ కోపాన్ని ముక్కుపచ్చలారని పసివారిపై చూపాడు. పాము తన బిడ్డల్ని తానే చంపుకుతిన్నట్లు..కాలనాగులా మారి కన్నబిడ్డల్ని కాటేశాడు. ప్రేమగా ఎత్తుకు పెంచిన చేతులతోనే వారి ఊపిరి ఆగేదాకా నీటముంచి..ఉసురు తీశాడు. చివరకు తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఒంగోలు టౌన్: భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని హతమార్చిన దారుణ సంఘటన ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... యర్రగొండపాలేనికి చెందిన పగ్గల వెంకటేశ్వర్లుకు ఐదేళ్ల క్రితం నాగమణితో వివాహమైంది. పొట్టకూటి కోసం ఒంగోలు వచ్చిన వెంకటేశ్వర్లు స్థానిక గాంధీనగర్ నాలుగో లైనులో నివాసం ఉంటూ ఒక టీస్టాల్లో టీమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వెంకట దుర్గాసాయి (3), చిన్నకుమారుడు వెంకట శ్రీనివాస్ (13 నెలలు). భార్యపై ఎప్పటి నుంచో ఉన్న అనుమానం పెనుభూతమై...చివరకు కన్నబిడ్డలతో సహా భార్యను హతమార్చాలనుకున్నాడు. చిన్నారులకు, భార్యకు శుక్రవారం రాత్రి బాదంపాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. కొద్దిగా తాగాక అనుమానం వచ్చిన భార్య వాటిని పడేసింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో...అర్ధరాత్రివేళ ఇద్దరు పిల్లల్ని నిండుగా నీరున్న డ్రమ్ములో ముంచి అత్యంత పాశవికంగా అంతమొందించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకుని మృతదేహాలను ఇంట్లో మంచంపై పడుకోబెట్టాడు. ఆ తరువాత తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈలోగా మత్తు నుంచి తేరుకున్న భార్య నాగమణి భర్త ఇంట్లోకి..బయటకు తిరుగుతుండటాన్ని గమనించింది. అయితే బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యారన్న సంగతి గుర్తించలేకపోయింది. భార్యతో ఘర్షణపడి..శరీరంపై చొక్కా కూడా లేకుండా పరిగెత్తుకుంటూ బజారున పడ్డాడు. నేరుగా మంగమూరు రోడ్డు సెంటర్‌కు చేరుకుని బైపాస్రోడ్డుగుండా 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. ఏదో ఒక వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చివరకు సింగరాయకొండ వైపు నుంచి వస్తున్న లారీకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎదురెళ్లాడు. అది గమనించిన లారీ డ్రైవర్ అతన్ని తప్పించేందుకు ప్రయత్నించాడు. అయినా లారీకి ఒక పక్క వెంకటేశ్వర్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పాక్కుంటూ మధ్యలో ఉన్న డివైడర్‌పై వెళ్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. చిన్నారుల మృతి ఘటనపై సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై జీ పాండురంగారావు చిన్నారుల మృతదేహాలు తీసుకుని..రిమ్స్‌కు బైపాస్‌గుండా వెళ్తున్న సమయంలో రోడ్డుపక్కన వెంకటేశ్వర్లు పడిఉండటాన్ని గుర్తించి అతన్ని రిమ్స్‌లో చేర్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను సందర్శించిన డీఎస్పీ: ఒంగోలు డీఎస్పీ పి.జాషువా గాంధీనగర్‌లో హత్యకు గురైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను శనివారం ఉదయం సందర్శించారు. తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్సై జి.పాండురంగారావులతో కలిసి వెళ్లిన ఆయన సంఘటన జరిగిన తీరుపై వాకబు చేశారు. చిన్నారుల తల్లి నాగమణితోపాటు కుటుంబ సభ్యులను విచారించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ ఐ శ్రీనివాసన్ దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగా ఇద్దరు కుమారులను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. సాయి ఇక రాడా.. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు తెల్లవారేసరికి విగత జీవులుగా కనిపించడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దకుమారుడు దుర్గాసాయి మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లే సమయంలో.. బాలుడి స్నేహితుల్లో ఒకరు ‘అరే సాయి ఇక రాడా..’ అన డం అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. చిన్నారుల మృతదేహాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడున్న వారి అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. -
సార్వత్రిక కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం రోజున బయట వ్యక్తులు ఎవరూ ఒంగోలు నగరంలో ఉండవద్దని ఒంగోలు డీఎస్పీ పి.జాషువా చెప్పారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో తీసుకుంటున్న జాగ్రత్తలు, బందోబస్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కౌంటింగ్ జరుగుతున్న క్విస్, పేస్, రైజ్ ఇంజనీరింగ్ కాలేజీల వద్ద మొత్తం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్‌తోపాటు 30 పోలీసు యాక్టూ అమల్లో ఉంటుందన్నారు. అంతేగాక నగరంలో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాస్తుంటాయని చెప్పారు. లెక్కింపు రోజున బయట వ్యక్తులకు అవకాశమివ్వొద్దని లాడ్జీల యజమానులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోకి వచ్చే కొత్త వ్యక్తుల గురించి వాకబు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఒంగోలు రావద్దని సూచించారు. ఎక్కువమంది వస్తే వారికి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థిని బాధ్యునిగా చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ సెంటర్లలోకి అభ్యర్థులు, ఏజెంట్ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, వారి వాహనాలు కూడా కౌంటింగ్ జరుగుతున్న కాలేజి లోపల వరకు వచ్చేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు సెల్ఫోన్లు తెచ్చుకోవద్దన్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, ఆ గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, బాణసంచా కాల్చడం, గులాం చల్లుకోవడం లాంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ ఏటీఏ రామారావు, తాలూకా సీఐ శ్రీనివాసన్ పాల్గొన్నారు.