కన్నతండ్రే కాలయముడయ్యాడు | father murdered his sons | Sakshi
Sakshi News home page

కన్నతండ్రే కాలయముడయ్యాడు

Published Sun, Jun 22 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

కన్నతండ్రే కాలయముడయ్యాడు

కన్నతండ్రే కాలయముడయ్యాడు


ప్రేమను పంచాల్సిన కన్నతండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెనుభూతమై...ఆ కోపాన్ని ముక్కుపచ్చలారని పసివారిపై చూపాడు. పాము తన బిడ్డల్ని తానే చంపుకుతిన్నట్లు..కాలనాగులా మారి కన్నబిడ్డల్ని కాటేశాడు. ప్రేమగా ఎత్తుకు పెంచిన చేతులతోనే వారి ఊపిరి ఆగేదాకా నీటముంచి..ఉసురు తీశాడు. చివరకు తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

ఒంగోలు టౌన్: భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని  హతమార్చిన దారుణ సంఘటన ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... యర్రగొండపాలేనికి చెందిన పగ్గల వెంకటేశ్వర్లుకు ఐదేళ్ల క్రితం నాగమణితో వివాహమైంది. పొట్టకూటి కోసం ఒంగోలు వచ్చిన వెంకటేశ్వర్లు స్థానిక గాంధీనగర్ నాలుగో లైనులో నివాసం ఉంటూ ఒక టీస్టాల్‌లో టీమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వెంకట దుర్గాసాయి (3), చిన్నకుమారుడు వెంకట శ్రీనివాస్ (13 నెలలు).
 
భార్యపై ఎప్పటి నుంచో ఉన్న అనుమానం పెనుభూతమై...చివరకు కన్నబిడ్డలతో సహా భార్యను హతమార్చాలనుకున్నాడు. చిన్నారులకు, భార్యకు శుక్రవారం రాత్రి బాదంపాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. కొద్దిగా తాగాక అనుమానం వచ్చిన భార్య వాటిని పడేసింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో...అర్ధరాత్రివేళ ఇద్దరు పిల్లల్ని నిండుగా నీరున్న డ్రమ్ములో ముంచి అత్యంత పాశవికంగా అంతమొందించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకుని మృతదేహాలను ఇంట్లో మంచంపై పడుకోబెట్టాడు. ఆ తరువాత తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈలోగా మత్తు నుంచి తేరుకున్న భార్య నాగమణి భర్త ఇంట్లోకి..బయటకు తిరుగుతుండటాన్ని గమనించింది.
 
అయితే బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యారన్న సంగతి గుర్తించలేకపోయింది. భార్యతో ఘర్షణపడి..శరీరంపై చొక్కా కూడా లేకుండా పరిగెత్తుకుంటూ బజారున పడ్డాడు. నేరుగా మంగమూరు రోడ్డు సెంటర్‌కు చేరుకుని బైపాస్‌రోడ్డుగుండా 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. ఏదో ఒక వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చివరకు సింగరాయకొండ వైపు నుంచి వస్తున్న లారీకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎదురెళ్లాడు.
 
అది గమనించిన లారీ డ్రైవర్ అతన్ని తప్పించేందుకు ప్రయత్నించాడు. అయినా లారీకి ఒక పక్క వెంకటేశ్వర్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పాక్కుంటూ మధ్యలో ఉన్న డివైడర్‌పై వెళ్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. చిన్నారుల మృతి ఘటనపై సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై జీ పాండురంగారావు చిన్నారుల మృతదేహాలు తీసుకుని..రిమ్స్‌కు బైపాస్‌గుండా వెళ్తున్న సమయంలో రోడ్డుపక్కన వెంకటేశ్వర్లు పడిఉండటాన్ని గుర్తించి అతన్ని రిమ్స్‌లో చేర్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
 
మృతదేహాలను సందర్శించిన డీఎస్పీ:
ఒంగోలు డీఎస్పీ పి.జాషువా గాంధీనగర్‌లో హత్యకు గురైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను శనివారం ఉదయం సందర్శించారు. తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్సై జి.పాండురంగారావులతో కలిసి  వెళ్లిన ఆయన  సంఘటన జరిగిన తీరుపై వాకబు చేశారు. చిన్నారుల తల్లి నాగమణితోపాటు కుటుంబ సభ్యులను విచారించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ ఐ శ్రీనివాసన్ దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగా ఇద్దరు కుమారులను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు అతనిపై హత్య కేసు నమోదు చేశారు.  
 
సాయి ఇక రాడా..

ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు తెల్లవారేసరికి విగత జీవులుగా కనిపించడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దకుమారుడు దుర్గాసాయి మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లే సమయంలో.. బాలుడి స్నేహితుల్లో ఒకరు ‘అరే సాయి ఇక రాడా..’ అన డం అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. చిన్నారుల మృతదేహాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  అక్కడున్న వారి అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement