
మహిళపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి దాష్టీకం
ఎన్నికలప్పుడే గుర్తొస్తామా అని నిలదీసిన ప్రజలు
నిగ్రహం కోల్పోయి దూషణకు దిగిన బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరంలో ఘటన
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ డివిజన్‌లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.
అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.
ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్
పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్‌కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అడుగడుగునా నిలదీతలే
అంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు.
వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment