సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల లబ్ధిదారుల సౌకర్యార్థం ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాలు తెరిచేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక బ్యాంక్ మేళాలకు అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె గణాంకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 292 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ బ్రాంచీలలో 93,249 ఖాతాలు తెరిచేందుకు దరఖాస్తులు అందగా 76,458 మంది లబ్ధిదారులకు కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు.
మిగిలిన 16,791 లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన ముగిసిన తర్వాత వారి ఖాతాలు సైతం ప్రారంభిస్తామన్నారు. ఎస్‌బీహెచ్ తన 36 బ్రాంచీల ద్వారా అత్యధికంగా 34,112 ఖాతాలు ప్రారంభిస్తే.. ఎస్‌బీఐ తన 41 బ్రాంచీల్లో 20,413 ఖాతాలు, ఏపీజీవీబీ 85 శాఖల ద్వారా 14,038 ఖాతాలు, ఆంధ్రాబ్యాంక్ 27 శాఖల ద్వారా 4600 ఖాతాలను తెరిచినట్లు కలెక్టర్ తెలిపారు. నగదు బదిలీ పథకం కింద వంట గ్యాస్, ఉపకార వేతనాలు, బంగారుతల్లి, పింఛన్లు, జననీ సురక్ష యోజన, ఇన్‌పుట్ సబ్సిడీ తదితర పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంక్ మేళాలు నిర్వహించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ టీటీ వెంకయ్య, ఆయా బ్యాంకుల మేనేజర్లకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఎల్డీఎం వివరణ:
‘కొండాపూర్‌లో జీరో మేళాలు’ అనే శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనంపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య స్పందించారు. తొగరపల్లి ఎస్‌బీఐలో 150 ఖాతాలు, ఏపీజీవీబీ అనంతసార్‌లో 172 ఖాతాలు, తేర్పొల్ శాఖలో 148 ఖాతాలను తెరిచినట్లు ఆయన వివరణ ఇచ్చారు.
బ్యాంక్ మేళా.. భళా
Published Fri, Nov 29 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement