bank mela
-
బ్యాంక్ మేళా.. భళా
సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల లబ్ధిదారుల సౌకర్యార్థం ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాలు తెరిచేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక బ్యాంక్ మేళాలకు అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె గణాంకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 292 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ బ్రాంచీలలో 93,249 ఖాతాలు తెరిచేందుకు దరఖాస్తులు అందగా 76,458 మంది లబ్ధిదారులకు కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. మిగిలిన 16,791 లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన ముగిసిన తర్వాత వారి ఖాతాలు సైతం ప్రారంభిస్తామన్నారు. ఎస్బీహెచ్ తన 36 బ్రాంచీల ద్వారా అత్యధికంగా 34,112 ఖాతాలు ప్రారంభిస్తే.. ఎస్బీఐ తన 41 బ్రాంచీల్లో 20,413 ఖాతాలు, ఏపీజీవీబీ 85 శాఖల ద్వారా 14,038 ఖాతాలు, ఆంధ్రాబ్యాంక్ 27 శాఖల ద్వారా 4600 ఖాతాలను తెరిచినట్లు కలెక్టర్ తెలిపారు. నగదు బదిలీ పథకం కింద వంట గ్యాస్, ఉపకార వేతనాలు, బంగారుతల్లి, పింఛన్లు, జననీ సురక్ష యోజన, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంక్ మేళాలు నిర్వహించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ టీటీ వెంకయ్య, ఆయా బ్యాంకుల మేనేజర్లకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎల్డీఎం వివరణ: ‘కొండాపూర్లో జీరో మేళాలు’ అనే శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనంపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య స్పందించారు. తొగరపల్లి ఎస్బీఐలో 150 ఖాతాలు, ఏపీజీవీబీ అనంతసార్లో 172 ఖాతాలు, తేర్పొల్ శాఖలో 148 ఖాతాలను తెరిచినట్లు ఆయన వివరణ ఇచ్చారు. -
మేళా బే‘ఖాత’ర్!
సాక్షి, సంగారెడ్డి: ‘‘జిల్లాలోని అన్నీ బ్యాంకులు తమ శాఖల వద్ద ఈనెల 26, 27వ తేదీల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలి. విద్యార్థులు, వంట గ్యాస్ వినియోగదారులు, బంగారుతల్లి, జననీ సురక్ష యోజన, ఇన్పుట్ సబ్సిడీ పథకాల లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఈ మేళాలు నిర్వహించాలి..’’ - కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాలు. కానీ జిల్లాలో చాలా చోట్ల కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదు. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడానికి వచ్చిన వినియోగదారులతో బ్యాంకర్లు చెడుగుడు ఆడుకున్నారు. అడ్డగోలు నిబంధనలు, సూటిపోటి మాటలతో వినియోగదారులను బెదరగొట్టి తిప్పి పంపారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశాల మేరకు మంగళ, బుధవారాల్లో జిల్లాలోని అన్నీ బ్యాం కులు ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి మూకుమ్మడిగా భారీ సంఖ్యలో జీరో బ్యాలెన్స్(నో ఫ్రిల్) ఖాతాలు తెరవాల్సి ఉంది. ఈ రెండు రోజులు బ్యాంకులన్నీ రోజువారీ వ్యాపార లావాదేవీలను నిలిపివేసి ఈ మేళాలపై పూర్తి దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించగా.. బ్యాంకర్లు ఎప్పటిలాగే రోజువారీ లావాదేవీల్లో తీరిక లేకుండా గడిపారు. కొన్ని బ్యాంకు లు మాత్రం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మేళాలు నిర్వహించగా..ఇంకొన్ని బ్యాంకులు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే తూతూ మంత్రంగా పనిని కానిచ్చాయి. ఈ బ్యాంకుల వద్ద మూసివేత సమయానికి సైతం దరకాస్తుదారులు బారులు తీరి కనిపించారు. జిల్లాలో 28 బ్యాకింగ్ సంస్థలు, వీటికి సంబంధించిన 282 శాఖలు వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు సంస్థలకు సంబంధించిన కొన్ని శాఖలు మాత్రమే తొలి రోజు మేళాలు నిర్వహించాయి. మిగిలిన శాఖలు ఎప్పటిలాగే మొండికేశాయి. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి బ్రాంచీలు అసలు మేళాల నిర్వహణ ఊసే ఎత్తలేదు. కలెక్టర్ ప్రకటన చూసి కొత్త ఖాతా కోసం వళ్లిన వినియోగదారులపై నానా ప్రశ్నలు సంధించి వెనుతిరిగేలా చేశాయి. ఆధార్ ఉంటేనే .. కొత్త ఖాతాలు తెరవడానికి బ్యాంకులు నిబంధనలతో కొర్రీలు వేశాయి. మంగళవారం ఖాతాల కోసం సమీపంలోని బ్యాంకుకు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహక పథకాల లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ (నో ఫ్రిల్) ఖాతాలు తెరవాలని ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలూ ఉన్నా యి. కానీ, కొన్ని బ్యాంకులు రూ.500 నుంచి రూ.వెయ్యి డిపాజిట్ చెల్లించనిదే ఖాతా తెరచేది లేదని భిష్మించుకుని కూర్చున్నాయి. అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్లు నివాస గుర్తింపుగా ఇంటి విద్యుత్ బిల్లును సమర్పిస్తే స్వీకరించలేదు. అదే విధంగా సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని ఎస్బీఐ తదితర బ్యాంకులు ఆధార్ కార్డు ఉంటేనే కొత్త ఖాతా తెరుస్తామన్నాయి.