ఉద్యోగుల వైద్య పథకం (ఈహెచ్‌ఎస్)పై ప్రభుత్వానికి, ప్రైవేటు ఆస్పత్రులకు మధ్య పేచీ మొదలైంది. లక్షలాదిమందికి సంబంధించిన వైద్యంపై తమను సంప్రదించకుండానే ప్యాకేజీ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం(ఆశా), ఏపీ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్(అప్నా) ఆరోపించాయి. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పాయి. ఆరోగ్యశ్రీ సీఈవోను కలిసి తమ అభిప్రాయాన్నీ చెప్పాయి. ప్రస్తుత రేట్లు తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతం కాదని పేర్కొన్నాయి. రేట్లు తక్కువగా నిర్ణయించి మెరుగైన వసతులు కల్పించాలంటే తమవల్ల కాదని, ఎలాంటి వైద్యం అందుతుంతో ఉద్యోగులే తేల్చుకోవాల్సి ఉందని తెలిపాయి. దీనిపై రెండ్రోజుల్లో ఆశా, అప్నా సంఘాలు ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిసిం ది. మరోవైపు 1885 జబ్బుల్లో 347 జబ్బుల్ని మౌలిక వసతుల్లేని ప్రభుత్వాసుపత్రులకు బదలాయించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వెలిబుచ్చాయి.
ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తాం: ప్రభుత్వ హెచ్చరిక
ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్)ను కార్పొరేట్ ఆస్పత్రులుగానీ, ప్రైవేటు నర్సింగ్ హోంలుగానీ వ్యతిరేకిస్తే వాటిని ఆరోగ్యశ్రీ ప్యానెల్ నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో 340 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ఈహెచ్‌ఎస్ పరిధిలోకొచ్చే ఉద్యోగులకు సేవలందించాలని, లేకుంటే ఆరోగ్యశ్రీ ప్యానల్ నుంచి తొలగించి, కొత్త ఆస్పత్రులను తీసుకుంటామనడమేగాక.. కొత్త ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవచ్చంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
హెల్త్ కార్డులపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి
ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. తాము పదేపదే చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం తాననుకున్న తీరులో కార్డుల జారీకి యత్నిస్తోందంటున్న ఉద్యోగ సంఘాలు.. ఈ అంశంపై మరోసారి సీఎంతో చర్చించాలని నిర్ణయించాయి.
ఈహెచ్‌ఎస్ రేట్లను ఒప్పుకోం
Published Wed, Nov 6 2013 2:28 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement