employees health cards
-
హెల్త్‌కార్డులతో వైద్యం అందట్లేదు: టీచర్ల జేఏసీ
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన హెల్త్ కార్డులతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో ఎక్కడా తమకు వైద్యం అందడం లేదని టీచర్ల జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో టీచర్ల జేఏసీ నాయకులు గురువారం సమావేశమయ్యారు. తమకు పదో పీఆర్సీని 63 శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలుచేయాలని డిమాండు చేశారు. హెల్త్ కార్డులను తీసుకెళ్తే తమకు వైద్యం చేయడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. వెంటనే ప్యాకేజి రేట్లను సవరించి, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని.. వైద్యం అందించేలా చూడాలని కోరారు. ప్రతినెలా ప్రీమియం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీచర్ల జేఏసీ నాయకులు సీఎస్ రాజీవ్ శర్మకు తెలిపారు. సర్వీసు రూల్స్ లేని కారణంగా తమ పదోన్నతులు కూడా నిలిచిపోయాయని, వాటిని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. -
‘ఆరోగ్య కార్డులు’ అక్కరకు వచ్చేనా?
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యంపై భరోసా లేకుండాపోతోంది. ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల ద్వారా నగదు రహిత చికిత్సలను అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యకార్డులను ఇస్తామని ప్రకటించి వాటిని జారీ చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో వందల రూపాయలు వెచ్చించి ప్రైవేటు నెట్ సెంటర్ల ద్వారా వివరాలను అప్లోడ్ చేసి ఆరోగ్యకార్డులను తీసుకున్నారు. అయితే అవి గుర్తింపుకార్డులుగానే మిగిలిపోయాయి. అప్పటి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరోగ్య కార్డులు పనికి రాకుండా పోగా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌నే కొనసాగించాల్సి వచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామంటూ ఆరోగ్యకార్డులు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్నిచోట్ల ఈ కార్డులను విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. ఈ కార్డులు కూడా గుర్తింపుకార్డులుగానే ఉండిపోయే పరిస్థితి ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి కార్డులు ఇచ్చేప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి ధరలను నిర్ణయించాల్సి ఉంది. అటువంటి దేమీ చేయకుండా కార్డులు జారీ చేయడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యకార్డులు ద్వారా చికిత్సను అందించలే మని చేతులెత్తేస్తున్నాయి. అయినా ప్రభుత్వ పెద్దల్లో మాత్రం స్పందన కన్పించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటువంటి ప్రకటనలు చేసిన తరువాతైనా వారితో చర్చించి ఉంటే సమంజసంగా ఉండేది. అవేమి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30వ తేదీ తరువాత మెడికల్ రీయింబర్స్మెంట్ ఉండదని, డిసెంబరు 1 నుంచి ఆరోగ్యకార్డుల ద్వారానే చికిత్సలు పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్డుల ద్వారా ఆరోగ్యసేవలు అందే అనుకూల పరిస్థితులు కన్పించక పోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఈ కార్డుల ద్వారా చికిత్సలు పొందేందుకు రూ. 50 నుంచి రూ.100 వరకు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరికైనా ఉచితంగా వైద్యసేవలు అందిస్తారని, అటువంటప్పుడు తాము ఆరోగ్యకార్డులు పట్టుకు వెళ్లి రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించడం వల్ల ఉపయోగమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 30 లోగా కార్డుల ద్వారా వైద్యసేవలు పొందేందుకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపట్టాలని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. పీఆర్సీలోనూ కాలయాపన ధోరణే... ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన ధోరణిని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలించిన తరువాత గత ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలుపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా మరో సబ్ కమిటీని వేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కాలయాపన చేసేందుకే తప్ప చిత్తశుద్ధితో చేసిన పనికాదని వారంటున్నారు. దీనిపైన కూడా ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల హెచ్చరికలకు తల వంచుతుందో తన ధోరణిని కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కొత్త వివాదం
* భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకరి తల్లిదండ్రులకే పథకం వర్తింపు * ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో సర్కారు స్పష్టీకరణ.. ఉద్యోగుల అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం విషయంలో క్రమంగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య అగాధం పెరుగుతోంది. ఉద్యోగులు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వకుండానే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, కొత్తగా మరిన్ని మెలిక లు పెట్టడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా పరిస్థితులు ఉత్పన్నం కావటంపట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు వారిద్దరి తల్లిదండ్రులు ఈ పథకం పరిధిలోకి రావాల్సి ఉండగా... కేవలం ఒకరి తల్లిదండ్రులకే పథకం వర్తిస్తుందన్న కొత్త మెలిక తాజాగా ఉద్యోగాల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం మెడికల్ రీయింబర్స్మెంట్ పథకంలో ప్రీమియం చెల్లించే వారు తల్లిదండ్రులకు పథకం వర్తిస్తోంది. ఇదే పద్ధతిని ఉద్యోగుల ఆరోగ్య పథకంలోనూ వర్తింప చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు విరుద్ధంగా, ఒకరి తల్లిదండ్రులనే పథకం పరిధిలోకి తెచ్చారు. ఉద్యోగుల వివరాలను ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఇటీవల ప్రభుత్వం సూచించటంతో, ఆ కసరత్తు ప్రారంభించిన సందర్భంగా ఉద్యోగులకీ విషయం తెలిసింది. అందులో ఒకరి తల్లిదండ్రుల వివరాలనే నమోదు చేసే పరిస్థితి ఉండటంతో ఉద్యోగులు మళ్లీ స్పష్టత కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరూ ఉద్యోగులైనప్పుడు పథకం నిబంధనల ప్రకారం ఇద్దరూ ప్రీమి యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెల్లిస్తే సరిపోతుందం టూ కొన్ని రోజులక్రితం ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎవరు ప్రీమియం చెల్లించారో వారి తల్లిదండ్రులకే పథకం వర్తించే వీలుందన్న సంగతి అప్పట్లో ఉద్యోగులు గ్రహించలేకపోయారు. తీరా వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేసే సందర్భంలో వారికి అసలు విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలిద్దరు ప్రీమియం చెల్లించేందుకు సిద్ధమని, వారి ఇద్దరి తల్లిదండ్రులను కూడా పథకం పరిధిలోకి తేవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాత అభ్యంతరాలపై స్పష్టత రాని సమయంలో, కొత్త అభ్యంతరాలు రావటంతో పథకం కాస్తా మళ్లీ చిక్కుముడిలా మారుతోంది. 184 జీఓ, 174 జీఓల ప్రకారం చూసినా ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలు ఇద్దరి తల్లిదంద్రులకు పథకం వర్తిం చాల్సి ఉన్నందున ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో పలు జిల్లాలకు చెందిన కొందరు టీచర్ల వివరాలు గల్లంతయ్యాయని, వాటిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. -
ఈహెచ్ఎస్ రేట్లను ఒప్పుకోం
ఉద్యోగుల వైద్య పథకం (ఈహెచ్ఎస్)పై ప్రభుత్వానికి, ప్రైవేటు ఆస్పత్రులకు మధ్య పేచీ మొదలైంది. లక్షలాదిమందికి సంబంధించిన వైద్యంపై తమను సంప్రదించకుండానే ప్యాకేజీ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం(ఆశా), ఏపీ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్(అప్నా) ఆరోపించాయి. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పాయి. ఆరోగ్యశ్రీ సీఈవోను కలిసి తమ అభిప్రాయాన్నీ చెప్పాయి. ప్రస్తుత రేట్లు తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతం కాదని పేర్కొన్నాయి. రేట్లు తక్కువగా నిర్ణయించి మెరుగైన వసతులు కల్పించాలంటే తమవల్ల కాదని, ఎలాంటి వైద్యం అందుతుంతో ఉద్యోగులే తేల్చుకోవాల్సి ఉందని తెలిపాయి. దీనిపై రెండ్రోజుల్లో ఆశా, అప్నా సంఘాలు ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిసిం ది. మరోవైపు 1885 జబ్బుల్లో 347 జబ్బుల్ని మౌలిక వసతుల్లేని ప్రభుత్వాసుపత్రులకు బదలాయించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వెలిబుచ్చాయి. ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తాం: ప్రభుత్వ హెచ్చరిక ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్)ను కార్పొరేట్ ఆస్పత్రులుగానీ, ప్రైవేటు నర్సింగ్ హోంలుగానీ వ్యతిరేకిస్తే వాటిని ఆరోగ్యశ్రీ ప్యానెల్ నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ప్యానెల్లో 340 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ఈహెచ్ఎస్ పరిధిలోకొచ్చే ఉద్యోగులకు సేవలందించాలని, లేకుంటే ఆరోగ్యశ్రీ ప్యానల్ నుంచి తొలగించి, కొత్త ఆస్పత్రులను తీసుకుంటామనడమేగాక.. కొత్త ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవచ్చంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హెల్త్ కార్డులపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. తాము పదేపదే చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం తాననుకున్న తీరులో కార్డుల జారీకి యత్నిస్తోందంటున్న ఉద్యోగ సంఘాలు.. ఈ అంశంపై మరోసారి సీఎంతో చర్చించాలని నిర్ణయించాయి. -
ఉద్యోగులకు దీపావళి కానుక: హెల్త్ కార్డుల జీవో జారీ
కిరణ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండగ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. హెల్త్ కార్డుల పథకానికి సంబంధించి 174,175,176 జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు అందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవోలో పొందుపరిచింది. హెల్త్ కార్డులు పథకంలో చేరే గెజిటెడ్ అధికారులు రూ.120, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.90 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు క్యాష్‌లెస్ వైద్యసేవలు అంద చేసేందుకు ప్రభుత్వం హెల్త్‌కార్డుల పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వ జీవో జారీ చేయడంపై సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు నరేంద్రరావు, మురళీకృష్ణ శనివారం హైదరాబాద్‌లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.