స్వైన్‌ఫ్లూపై భయం వద్దు | Do not fear to Swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై భయం వద్దు

Published Thu, Jan 22 2015 2:05 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

స్వైన్‌ఫ్లూపై భయం వద్దు - Sakshi

స్వైన్‌ఫ్లూపై భయం వద్దు

ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది
నేటి నుంచి జిల్లా అంతటా ఫీవర్ సర్వే
⇒  వైద్యులు, మందులు అందుబాటులోనే ఉంచాం
లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రులకు రావాలి
⇒  ప్రైవేటు వైద్యులు రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలి
⇒  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
కలెక్టర్ రాహుల్ బొజ్జా

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో స్వైన్‌ఫ్లూ తీవ్రత లేదని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, వ్యాధిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. స్వైన్‌ఫ్లూను అరికట్టేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా బుధవారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

జిల్లాలో ఇప్పటి వరకు కేవలం నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు మాత్రమే నమోదు అయినట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించిన రోగులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వైద్య బృందాలు ప్రజల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో కొన్నిరోజులుగా బాధపడుతుంటే వారిని పరిశీలిస్తారని తెలిపారు. వారి నుంచి రక్తం నమూనాలను సేకరించడం జరుగుతుందన్నారు. రక్తం నమూనాలను పరిశీలించటం ద్వారా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులను గుర్తిస్తామని తెలిపారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులకు అవసరమైన చికిత్సలు అందజేసేందుకు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్యులతో పాటు మందులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
 
స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రోగులు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వెంటనే వారికి అవసరమైన చికిత్సలు చేయటం ఆరంభమవుతుందన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూ ఎదుర్కొనే విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రోగులు తమ వద్దకు వస్తే వారిని మూడు, నాలుగు రోజుల పాటు తమ వద్ద ఉంచుకోకుండా వెంటనే ప్రభుత్వాస్పత్రులకు పంపాలని సూచించారు.

ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు రోగుల సంక్షేమానికి ప్రాధ్యానత ఇవ్వాలని తెలిపారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులు బయట సంచరించకుండా వెంటనే ప్రభుత్వాస్పత్రులకు రావాలని కలెక్టర్ సూచించారు. స్వైన్‌ఫ్లూను ఎదుర్కోవడంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వెంటనే యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్యం పనులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
 
పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి
ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా కోరారు. స్వైన్‌ఫ్లూ కారకమైన హెచ్-1, ఎన్-1 వైరస్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుందని, చిన్నపిల్లలు, గర్భిణిలు, వృద్ధులకు వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుందన్నారు. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు, గొంతువాపు స్వైన్‌ఫ్లూ లక్షణాలుగా తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చల్లగాలికి దూరంగా ఉండడం వల్ల స్వైన్‌ఫ్లూకు దూరంగా ఉండవచ్చని తెలిపారు.  వ్యాధి లక్షణాలు ఉన్న రోగులు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. స్వైన్ ఫ్లూ వచ్చిన రోగులు భయపడవద్దని వైద్యులు నిర్ధేశించిన మందులు వాడితే సరిపోతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement