నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: పారిశుధ్యలోపం జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. విషజ్వరాలు ప్రబలుతుండటంతో పల్లెలకు పల్లెలే మంచం పట్టాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా కొందరు ప్రైవేటు వైద్యులు వైద్యపరీక్షల పేరిట అందినకాడికి గుంజుకుంటున్నారు. అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల కాలంలో తరచూ వర్షం కురుస్తోంది. అదే సమయంలో పారిశుధ్యంపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. మురుగునీరు నిల్వ చేరడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటి నిర్మూలనకు అధికారుల చర్యలు కరువవడంతో దోమలు కుట్టి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.
ప్రధానంగా డెంగీ, చికున్‌గున్యా బారిన పడి విలవిలలాడుతున్నారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు వైద్యఆరోగ్యశాఖలోని కొందరు ఉద్యోగులు పారిశుధ్య నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 77 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీల పరిధిలో 477 ఉపకేంద్రాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు 2013-14లో ఒక్కో సబ్‌సెంటర్‌కు రూ.10 వేల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను ఎక్కడా సద్వినియోగం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కువశాతం నిధులను అధికారులు, సిబ్బంది కలిసి స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దోమలు స్వైరవిహారం చేస్తూ, ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో డెంగీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, వింజమూ రు, రాపూరు, దగదర్తి, చేజర్ల, తల మంచి, కొడవలూరు, పొట్టేపాళెం తదితర ప్రాంతాల్లో డెంగీ వ్యాధి ప్రబలుతోంది. పదుల సంఖ్యలో ప్రజలు డెంగీ బారిన పడితే అధికారుల లెక్కలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు జిల్లాలో రెండు డెంగీ కేసులే నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. డెంగీ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో వాటిని ఎక్కించుకునే విషయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్లేట్‌లెట్లు సకాలంలో అందుబాటులో లేక కొందరు మృత్యువాత పడుతున్నారు. దీనిని అవకాశంగా చేసుకున్న పలువురు వైద్యులు వివిధ రకాల పరీక్షల పేరుతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులకు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితులు నెలకొనడం ఇందుకు నిదర్శనం. మరోవైపు ఐదారేళ్ల క్రితం జిల్లా ప్రజలను వణకించిన చికున్‌గన్యా మళ్లీ జడలు విప్పుతోంది. కుటుంబాలకు కుటుం బాలే వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి బారిన పడినవారు నెలల తరబడి కోలుకోలేని పరిస్థితి ఉండటంతో పేద,మధ్య తరగతి ప్రజలు కుటుంబాలు గడవక అవస్థ పడుతున్నారు.
వ్యాధులు ప్రబలేందుకు కారణమైన దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో రెండు డెంగీ కేసులు గుర్తించాం. దోమల నివారణకు వైద్య,ఆరోగ్య, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పారిశుధ్య నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాం.
డాక్టర్ సుధాకర్, డీఎంహెచ్‌ఓ
కంటి మీద కునుకు కరవు
దోమల కారణంగా రాత్రిపూట కంటి మీద కునుకు ఉండటం లేదు. అవి కుట్టి ఎక్కడ రోగాల బారిన పడతామేమోనని భయంగా ఉంది. దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
సుజాత, ఏసీనగర్, నెల్లూరు
డెంగీతో భయం
దోమలు కుట్టి ఎక్కువ మంది డెంగీ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆత్మకూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయినా దోమల నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. సందానీ, ఆత్మకూరు
పారిశుధ్యం అధ్వానం
పల్లెల్లో పారిశుధ్యం దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా మురుగు పేరుకుపోవడంతో దోమలు ఎక్కువైపోయాయి. రోడ్లపై మురుగునీరు పారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
అంజి, తోటపల్లి, టీపీగూడురు
మంచంపట్టిన పల్లె
Published Tue, Sep 17 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement