సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న, సోయా బీన్, వరిధాన్యం తదితర పంటలు అమ్మిన రైతులకు చెల్లింపులలో జాప్యాన్ని సహించేదిలేదని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను హెచ్చరించారు. బాధ్య తారహితంగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఇతర శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి.. జిల్లా జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రెండు రోజుల కిందట తాను షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించినప్పుడు మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ సిబ్బందిపై రైతులు ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ మార్కెట్‌లో రూ.4.83 కోట్ల విలువచేసే మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేయగా, కేవలం రూ.66 లక్షలు చెల్లించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. మొక్కజొన్నల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం రూ.500 కోట్లు సమకూర్చినా రైతులకు చెల్లింపుల్లో బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్నలు, కందులు, ధాన్యం, పెసలు, మినుములు, పత్తి తదితర పంట దిగుబడులు మార్కెట్‌కు రాగా నే కొన్నవెంటనే 72 గంటలలోపు రైతులకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఖాతరు చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హరీశ్‌రావు హెచ్చరించారు.
పత్తిని తక్కువ ధరకు అమ్మవద్దు..
పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నందున రైతులు తక్కువ ధరకు అమ్మ రాదని హరీశ్ సూచించారు. సకాలంలో చెల్లిం పులు జరపకపోవడంవల్లే రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని మంత్రి తెలిపారు. పలు జిల్లాల్లో సోయాబీన్ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారుల దృష్టికి తెచ్చారు. వరంగల్‌లో పత్తి, మరికొన్ని చోట్ల మొక్కజొన్నల రైతులకు చెల్లింపులు జరగలేదన్నారు. వీటన్నిటినీ యుద్ధప్రాతిపదికన చెల్లించాలని ఆదేశించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో లైసెన్సు లేకుండా కొందరు వ్యాపారులు లావాదేవీలు నిర్వహిస్తుండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లులలో రకరకాల పేర్లతో సామాన్య రైతులను మోసం చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులొస్తున్నాయని, అలాంటి మిల్లులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ప్రభుత్వ గోదాములు సరిపడేన్ని ఉన్నందున ప్రైవేటు గోదాములను ప్రోత్సహించవద్దని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు పాల్గొన్నారు.
యాసంగిలో 17 లక్షల ఎకరాలకు సాగు నీరు
ప్రస్తుత యాసంగి సీజన్‌లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నట్టు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. చిట్టచివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, నీటిపారుదలశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment