‘ఇందిరమ్మ’కు విభజన సెగ | indiramma hous Two months payment of bills STOP | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు విభజన సెగ

Published Sun, May 25 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

‘ఇందిరమ్మ’కు విభజన సెగ

‘ఇందిరమ్మ’కు విభజన సెగ

ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ ఇళ్లనూ తాకింది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో మార్చి 15 తర్వాత లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ మూడో విడత కింద జిల్లాలో వివిధ వర్గాలకు మంజూరైన మొత్తం 39,951 ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేసేందుకు యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వీటిలో 10 వేల ఇళ్ల నిర్మాణం చివరి మజిలీలో ఉండగా మిగి లినవి వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్ర విభజన అంశం కారణంగా బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. మార్చి నెలలో 10 వేల ఇళ్లకు చెల్లింపులు నిలిచిపోగా ఏప్రిల్ నుంచి ఏ ఒక్క లబ్ధిదారుకూ బిల్లు చెల్లింపు జరగలేదు. సుమారు రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది.
 
 బిల్లుల చెల్లింపులకు బ్రేక్
 ఎన్నికలు ముగియడంతో మార్చి 15 వరకు పురోగతిలో ఉన్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేసినప్పటికీ ఖజానా శాఖలో ఆన్‌లైన్ లావాదేవీలు శనివారం నిలిచిపోవడంతో ఈ బిల్లుల చెల్లింపులకు బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ జిల్లాల వారీగా లెక్కలు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలను వేరు చేసే రెండింటికీ వేర్వేరు వెబ్‌సైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో బిల్లుల చెల్లింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక తీసుకునే నిర్ణయాన్ని బట్టి బిల్లులు చెల్లింపు జరగవచ్చనని అధికారులు చెబుతున్నారు. అది కూడా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న వాటికే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. దీంతో వేసవిలో ఇళ్ల నిర్మాణాలకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ సీజన్‌లో సొంతింటిని పూర్తి చేసుకుందామని భావించిన వారికి చేదు అనుభవమే ఎదురైంది.  
 
 రచ్చబండలో మంజూరైన ఇళ్లకు మోక్షం కలిగేనా?
 జిల్లాలో రెండో విడత రచ్చబండ కింద 89,771 ఇళ్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మంజూరు చేసింది. ఇప్పటి వరకు 10 శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో వేలాది ఇళ్ల నిర్మాణాలకు కొత్త ప్రభుత్వంలో మోక్షం క లగటం అనుమానంగా ఉంది. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్‌లో మూడో విడత రచ్చబండ సభల్లో వచ్చిన దరఖాస్తులకు దాదాపుగా 30 వేలపైనే ఇళ్ల మంజూరుకు ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం ముందు కూడా కాంగ్రెస్ సర్కార్ ఓట్ల కోసం భారీ ఎత్తున ఇళ్లను ఆన్‌లైన్ మంజూరుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు రచ్చబండల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి టీడీపీ ప్రభుత్వం హయాంలో వారి లెక్క కింద చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కొలువు తీరి ఇళ్ల నిర్మాణాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలోకి వచ్చేసరికి ఐదు నెలల కాలం పట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement