Indiramma housing
-
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం ఇంది రమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తెచ్చినట్లు రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం సచివాల యంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుని, వివరాలను ఫిర్యాదు దారు మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి 32 జిల్లాలలో 95% పూర్తికాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం కార్యాచరణపై దృష్టి సారిస్తా మన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి, రెండో దశలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు, మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
అమ్మకానికి ఇందిరమ్మ స్థలాలు..
మండపేట పట్టణానికి చెందిన మహిళకు పదేళ్ల క్రితం రాజీవ్ గృహకల్పలో ప్లాటు, గొల్లపుంత కాలనీలో ఇందిరమ్మ స్థలం మంజూరయ్యాయి. ఏదో ఒక పథకానికి మాత్రమే అర్హులన్న నిబంధనతో ఆమె స్థలాన్ని వదులుకుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని దళారులు అన్యాక్రాంతం చేసేశారు. తాజాగా కొనుగోలు చేసుకున్న వారు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమవుతుండగా స్థానికుల ఫిర్యాదుతో హౌసింగ్ అధికారులు అడ్డుకుని నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. గొల్లపుంత కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెలుగు చూసిన ఉదంతమిది. బయటకు రాకుండా అన్యాక్రాంతమైన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, ఇళ్లు 400 పైనే ఉంటాయని అంచనా. మండపేట: పట్టణంలోని ఇందిరమ్మ స్థలాల్లో రియల్ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఖాళీ స్థలం నుంచి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను రూ.మూడు లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మేస్తున్నారు. వ్యాపారులు, దళారులతో పాటు ఉద్యోగులు సైతం బినామీ పేర్లపై ఇక్కడ స్థలాలు కొనుగోళ్లు చేసి నిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. పేదల స్థలాల్లో సాగుతున్న రియల్ వ్యాపారం ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో.. దివంగత వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకం మండపేటలో వేలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసింది. వైఎస్ ప్రోత్సాహంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి పట్టణంలోని గొల్లపుంతలో రెండు విడతలుగా 122.72 ఎకరాలను సేకరించారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్థలసేకరణ. తొలి విడతలోని 55.77 ఎకరాల లేఅవుట్‌ను సెంటున్నర చొప్పున రెవెన్యూ అధికారులు 2,125 ప్లాట్లుగా విడదీశారు. 1,890 మంది లబి్ధదారులకు పంపిణీ చేయగా మిగిలిన 235 ప్లాట్లను ఖాళీగా ఉంచారు. 2010 నవంబరు నుంచి నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అమ్మకానికి స్థలాలు, ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ సిబ్బంది అవకతవకలకు పాల్పడడంతో అక్రమాలకు తెరలేచింది. పలువురు సొంతిళ్లు ఉన్న వారికి, రాజీవ్ గృహకల్పలో ప్లాట్లు మంజూరైన వారికి స్థలాలు మంజూరు చేశారు. ఇళ్లు ఉన్న వారు స్థలాల అమ్మకాలు మొదలుపెట్టడంతో పేదల స్థలాల్లో రియల్ వ్యాపారం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా దళారులు స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు చేయిస్తున్నారు. లబి్ధదారుల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు చేసేస్తున్నారు. పేదలకు పంపిణీ చేయగా ఖాళీగా ఉంచిన 235 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. స్థలం రూ.మూడు లక్షల నుంచి ఉండగా, నిర్మాణంలో ఉన్నవి, పూర్తి చేసిన ఇంటిని రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు ఇళ్లను నిర్మించి అద్దెకు ఇస్తుండడం గమనార్హం. పట్టణంతో పోలిస్తే కాలనీలో అద్దె తక్కువగా ఉండడంతో ఇక్కడకు అద్దెకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాలనీలో అద్దెకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు 300 కు పైగా ఉంటాయని అంచనా. బయట అద్దెలు చెల్లించలేక, అర్హత ఉన్నా స్థలం రాని పలువురు పేదవర్గాల వారు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అటువంటి వారికి అన్యాయం జరుగకుండా చూడడంతోపాటు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దర్జాగా కబ్జాలు కాలనీలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలీ్టకి ఆదాయం సమకూర్చే దిశగా పట్టణంలో మాదిరి కాలనీలోను మెయిన్ రోడ్డు వెంబడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లో అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గొడ్డు కాలువ వంతెన వద్ద నుంచి అందరికీ ఇళ్లు, ప్లాట్ల వరకూ రోడ్డు నుంచి దాదాపు 20 మీటర్ల మేర స్థలం వదిలి మిగిలిన దానిలో ప్లాట్లను విభజించారు. కాగా విలువైన ఈ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. కాలనీలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ స్థలాల్లో జరుగుతున్న రియల్ వ్యాపారాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మండపేట తహసీల్దార్ రాజేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చానని, అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదులేమీ రాలేని అన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
‘ఇందిరమ్మ’కు ఊరట
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బిల్లులు ఎప్పుడు వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయం హాయినిచ్చింది. ఇటీవల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ మంత్రిత్వ శాఖ లేదు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఆ వెనువెంటనే సంబంధిత అధికారుల సమీక్ష నిర్వహించి రాష్ట్రం ఏర్పాటుకు ముందు నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో 3 లక్షల 89 వేల 655 మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల చెల్లింపునకు బ్రేక్ పడింది. సుమారు సంవత్సర కాలం నుంచి లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ శాఖకు మంత్రినికేటాయించడంతో పాటు బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నారని ప్రభుత్వం సీఐడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బిల్లులు నిలిపివేయడంతో లబ్ధిదారులు ఇప్పటివవరకు ఇబ్బందులు పడ్డారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇప్పటి దాకా మొత్తం 5,80,732 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,89,655 ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు మొత్తం బిల్లులు చెల్లించారు. 3,02,283 లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. వీరికి చివరిదైన చెత్తు బిల్లు చెల్లించాల్సి ఉంది. 87,372 మంది వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఉన్నారు. ఇందులో పునాదిదశలో 12,569, బేస్మెంట్ లెవెల్లో 42,577, లెంటల్ లెవెల్ 7,172, రూఫ్ లెవెల్లో 25,048 నిర్మాణాల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పటిదాకా 1,91,077 ఇళ్ల లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు. 1,91,077 ఇళ్లు రద్దు..? జిల్లాలో 1,91,077 ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఇళ్లను రద్దు చేయాలా.. లేక కొనసాగించాలా అన్న మీమాంసలో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు. బిల్లులు చెల్లించాల్సిన వాటిలో కూడా అంతా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తిరిగి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను ఆన్లైన్లో ఉంచేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపికను పక్రియను పూర్తి చేసి బిల్లులను చెల్లించే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఇళ్ల బిల్లులకు జియో‘బంధనం’
జియో ట్యాగింగ్.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను గుర్తించేందుకు ఉపకరించే అధునాత న జీపీఎస్ సర్వే విధానమంటోంది ప్రభుత్వం. కానీ నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా కావాలని చేస్తున్న జాప్యంగా దీన్ని లబ్ధిదారులు అభివర్ణిస్తున్నారు. గత పదేళ్లలో నిర్మించిన ఇళ్లన్నింటినీ సర్వే చేయాలని ఆదేశించడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇల్లూ మంజూరు కాలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరోవైపు మొక్కుబడిగా.. మందకొడిగా సర్వే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జియో ట్యాగింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది.. డబ్బులు ఎప్పుడు అందుతాయోనని పేద లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలు, ఆధారాలు లభించక సర్వే బృందాలు నానాపాట్లు పడుతున్నాయి. కొత్తవి లేవు.. పాత బకాయిలు రావు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మించిన ఇళ్లకు రూ.14 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రస్తుత(2014-15) ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా వీటి విషయం పట్టించుకోవడం లేదు. పైగా జియో ట్యాగింగ్ సర్వే బాధ్యత అప్పగించడంతో కార్యాలయాల్లో కూర్చొని బిల్లులు, లబ్ధిదారుల గుర్తింపు వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సిన గృహనిర్మాణశాఖ సిబ్బంది లబ్ధిదారుల జాబితాలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు. దీంతో కార్యాలయాల్లో పనులు స్తంభించాయి. పైగా గత పదేళ్లలో జరిగిన నిర్మాణాలను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జాబితాల్లో ఉన్న చిరునామాలు, ఆధారాలు క్షేత్రస్థాయిలో సరిపోలక సర్వే మందకొడిగా సాగుతోంది. ఇదంతా ఎప్పటికి పూర్తి అవుతుందో.. తమ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి గానీ.. లబ్ధిదారులకు గానీ కలిగి ప్రయోజనం ఏమీ లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి. లక్ష్యం కొండంత.. పదేళ్ల నిర్మాణాలను సర్వే చేయాలని ప్రభుత్వం కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో 2004 నుంచి నిర్మించిన ఇళ్లు 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. గత నెల రోజుల్లో 27వేల ఇళ్లకు మాత్రమే జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. ఇంకా 3.70 లక్షల ఇళ్లున్నాయి. గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. అప్పట్లోగా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో చాలా ఇళ్ల, లబ్ధిదారుల వివరాలు లభించడం లేదని సర్వే బృందాలు వాపోతున్నాయి. దీంతో సర్వే చాలా మందకొడిగా సాగుతోంది. ఉదాహరణకు వంగర మండలంలో 27 పంచాయతీలు ఉండగా.. ఇప్పటికి నీలయ్యవలస, బాగెంపేట పంచాయతీల్లోనే సర్వే పూర్తి చేశారు. ప్రయోజనాలు జియో ట్యాగింగ్ వల్ల గతంలో ఇళ్లు పొందినవారు భవిష్యత్తులో మళ్లీ పొందే అవకాశం ఉండదు, ఒకే ఇంటికి రెండు మూడుసార్లు బిల్లులు చేయడం వంటి అక్రమాలను అరికట్టవచ్చు. ఒకే రేషన్ కార్డుతో ఇద్దరు, ముగ్గురు ఇళ్లు పొందే అవకాశం కూడా ఉండదు. సర్వే కోసం వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను నియమించారు. ఆయా మండలాల్లో పనిచేస్తున్న వారే ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. పతి మండలంలో రెండు బృందాలు సర్వే చేస్తున్నాయి. పతి బృందానికి మైక్రోమాక్స్ సెల్‌ఫోన్, ఎయిర్టెల్ సిమ్ కార్డు, ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ అందజేశారు. లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇళ్లను గుర్తించి వాటికి సంబంధించి రెండుకు తగ్గకుండా ఫొటోలు తీసుకుంటారు. ఇంటి ఐడీ నెంబరు, గృహ యజమాని పేరు తీసుకుంటారు. ఫొటోలతోపాటు ఆ వివరాలను జియో ట్యాగింగ్ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తారు. వివరాల సేకరణలో ఇందిరా ఆవాస్ యోజన, ఇందిరమ్మ, తర్వాత ఇతర గృహనిర్మాణ పథకాలను ప్రాధాన్యక్రమంగా అనుసరిస్తున్నారు. -
‘ఇందిరమ్మ’ అవినీతిపై సీబీసీఐడీ విచారణ
డిండి : మండలంలోని నెమిలిపూర్ గ్రామ పంచాయతీలో ఇం దిరమ్మ ఇళ్ల అవినీతిపై గురువారం సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో మొత్తం 219 ఇళ్లు మంజూరు కాగా 198 పూర్తయ్యాయి. ఇద్దరు ఉద్యోగులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోగా, ఒకే ఇంటిపై ముగ్గురు బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు తెలి పారు. అలాగే ఒకరు పాత ఇంటిపై బిల్లు తీసుకోగా 27 మంది ఊరిలో లేనివారి పేరుమీద బిల్లు తీసుకున్నట్లు తేలిందన్నారు. విచారణలో సీబీసీఐడీ ఇన్స్పెక్టర్లు తిర్పతిరావు, రాజ న్న, ఎస్ఐ బాసిద్, డిండి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణశాఖ డీఈ బన్సీలాల్, ఐదుగురు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన సీబీసీఐడీ విచారణ హాలియా: గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకంలో ఇళ్లనిర్మాణంలో జరిగిన అవినీతిపై చేపట్టిన సీబీసీఐడీ విచారణ గురువారం ముగిసింది. మండలంలోని కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆరు రోజులుగా విచారణ నిర్వహించినట్లు సీబీసీఐడీ డీఎస్పీ రాంచంద్రుడు తెలిపారు. ఆయా గ్రామాలకు సంబంధించిన నివేదికను ఈ నెల 20న ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. -
బిల్లు దూరం ఇల్లు భారం
మండపేట :జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇందిరమ్మ లబ్ధిదారులు తాము నిర్మించుకుంటున్న ఇళ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందక ఆక్రోశిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ నుంచి దశలవారీగా అందాల్సిన రుణసాయం నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో నిస్సహాయ స్థితిలో అలమటిస్తున్నారు. అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల చొప్పున స్థలంతో పాటు రూ.1.5 లక్షలతో పక్కా ఇంటిని నిర్మిస్తామని ఎన్నికల్లో టీడీ పీ వాగ్దానం ేసింది. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా ఆ దిశగా కార్యాచరణ లేదు సరికదా.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అంతకు ముందు మూడునెలలుగా నిలిచిపోయిన బిల్లుల విడుదలకు కించిత్తు చొరవ చూపలేదు. గత నాలుగు నెలలుగా జిల్లాలో సుమారు 16,968 ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.41.59 కోట్ల మేర గృహనిర్మాణ రుణాల విడుదల నిలిచిపోయింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, పూర్తయిన మేర బిల్లులు అందకపోవడం లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు రూ.80,000, ఎస్సీలకు రూ.1,00,000, రూరల్‌లో ఓసీ, బీసీలకు రూ.70,000, ఎస్సీలకు రూ.1,00,000లను గృహనిర్మాణ సాయంగా అందిస్తున్నారు. పరిపాలన , రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును నిర్మాణంలో అంచెలను బట్టి దశల వారీగా గృహ నిర్మాణ శాఖ బిల్లులు చెల్లిస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి గృహనిర్మాణ శాఖ ఆన్‌లైన్‌ను మూసివేసి బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. నేటికీ ఆన్‌లైన్‌ను తెరవలేదు. ఏ దశ పనులకైనా రాని బిల్లు.. ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు సుమారు 2,46,560 ఇళ్లు మంజూరవగా ఇప్పటి వరకు కేవలం 92,743 పూర్తయ్యాయి. 24,936 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇందిరమ్మతో పాటు వివిధ జీఓలకు సంబంధించి గత ఏప్రిల్ నుంచి సుమారు 6,605 ఇళ్లకు పునాది దశ పనులు జరుగ్గా, 4,277 ఇళ్లకు రూఫ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. 6,086 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఆయా దశలకు అనుగుణంగా సుమారు రూ.41.59 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని అంచనా. నిర్మాణ దశల వివరాలను గృహ నిర్మాణశాఖ ఆన్లైన్లో అప్డేట్ చేశాక ఆ శాఖ నుంచి నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి బిల్లు మొత్తం జమవుతుంది. గత నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌ను మూసి వేయడంతో లబ్ధిదారులకు బిల్లులు అందక హెచ్చు వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తీసుకుని.. తదుపరి దశల పనులను మొదలు పెడుతున్నారు. దీనికి తోడు గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి భారం తడిసిమోపెడవుతుందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో రూ.4,000 వరకు ఉన్న రెండు యూనిట్ల ఇసుక ప్రస్తుతం రూ.9,000 వరకు ఉంది. సిమెంట్ బస్తా రూ.320 వరకు పెరిగిపోయింది. ఐరన్, ఇటుక, కంకర వంటి వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. తాము మోయజాలని భారమైనా.. సొంత ఇల్లు సమకూర్చుకోవాలన్న ఆరాటంతో ప్రైవేట్ అప్పులు చేస్తున్నామని, వాటికి కట్టే పెచ్చు వడ్డీలు ఇల్లు సమకూరుతుందన్న ఆనందాన్ని ఇగిర్చివేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ దుస్థితిని గుర్తించి, స్పందించాలని, వెంటనే బిల్లులు విడుదల చేయించాలని కోరుతున్నారు.బిల్లుల విడుదలలో జాప్యంపై గృహనిర్మాణ శాఖ పీడీ సెల్వరాజ్‌ను వివరణ కోరగా గత మార్చి చివరి నుంచి ఆన్లైన్ నిలిచిపోయిందన్నారు. తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. -
అయోమయం
హుజూర్నగర్, న్యూస్‌లైన్ : పేదలకు సొంతింటి కల నిజం చేయడమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగించింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ పాలన రావడం, సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో కోడ్ అమలులోకి వచ్చి లబ్ధిదారులకు మార్చి 17 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.32 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ.3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడంతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశలలో ఉన్న లబ్ధిదారులు తమకు గత ప్రభుత్వంలో అందించిన ప్యాకేజీ వర్తిస్తుందా లేదా, కొత్త ప్రభుత్వం అందజేయనున్న ప్యాకేజీ వర్తిస్తుందా అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి అందించిన సాయం.. గత ప్రభుత్వం జిల్లాలో మొత్తం 4,03,969 ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి ఎస్సీ లబ్ధిదారులకు రూ.1,05,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1,00,000, ఇతరులకు రూ.70,000 ఇచ్చేవారు. ఈ నగదును ఇంటినిర్మాణంలో దశల వారీగా అందజేసేవారు. మంజూరైన ఇళ్లలో 2,22,943 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో మిగతావి వివిధ దశల్లో ఉండగా, 1,22,874 ఇళ్లనిర్మాణం మొదలుపెట్టనే లేదు. అయితే పెరిగిన ధరలు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోకపోవడం, బిల్లులు సకాలం లో అందజేయకపోవడంతో నిరుపేదల సొంతిం టి కల తీరని కోరికగానే మిగిలిపోయింది. కొత్త ఆశలు రేకెత్తిస్తున్న కేసీఆర్ హామీ 120 చదరపు గజాలలో రూ.3 లక్షలతో ఇంటి నిర్మాణం చేయిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్ట డంతో.. ఆ హామీని అమలుచేస్తారని ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టని 1,22,874 మంది లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థగా ఉన్న గృహ నిర్మాణ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పేరు మార్పిడి జరగడం ఖాయమైనందున ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు కూడా మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీప్రకారం నిర్మించబోయే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలపై ఇప్పటివరకు ఆ శాఖ అధికారులలో చర్చకు రాలేదని తెలిసింది. ఈ పరిస్థితులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉండగా గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న 32 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు చేపట్టడం పూర్తయ్యాక నూతన ఇళ్ల నిర్మాణ విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించవచ్చని తెలిపారు. -
‘ఇందిరమ్మ’కు విభజన సెగ
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ ఇళ్లనూ తాకింది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో మార్చి 15 తర్వాత లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ మూడో విడత కింద జిల్లాలో వివిధ వర్గాలకు మంజూరైన మొత్తం 39,951 ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేసేందుకు యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వీటిలో 10 వేల ఇళ్ల నిర్మాణం చివరి మజిలీలో ఉండగా మిగి లినవి వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్ర విభజన అంశం కారణంగా బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. మార్చి నెలలో 10 వేల ఇళ్లకు చెల్లింపులు నిలిచిపోగా ఏప్రిల్ నుంచి ఏ ఒక్క లబ్ధిదారుకూ బిల్లు చెల్లింపు జరగలేదు. సుమారు రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. బిల్లుల చెల్లింపులకు బ్రేక్ ఎన్నికలు ముగియడంతో మార్చి 15 వరకు పురోగతిలో ఉన్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేసినప్పటికీ ఖజానా శాఖలో ఆన్లైన్ లావాదేవీలు శనివారం నిలిచిపోవడంతో ఈ బిల్లుల చెల్లింపులకు బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ జిల్లాల వారీగా లెక్కలు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలను వేరు చేసే రెండింటికీ వేర్వేరు వెబ్సైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో బిల్లుల చెల్లింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక తీసుకునే నిర్ణయాన్ని బట్టి బిల్లులు చెల్లింపు జరగవచ్చనని అధికారులు చెబుతున్నారు. అది కూడా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న వాటికే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. దీంతో వేసవిలో ఇళ్ల నిర్మాణాలకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ సీజన్లో సొంతింటిని పూర్తి చేసుకుందామని భావించిన వారికి చేదు అనుభవమే ఎదురైంది. రచ్చబండలో మంజూరైన ఇళ్లకు మోక్షం కలిగేనా? జిల్లాలో రెండో విడత రచ్చబండ కింద 89,771 ఇళ్లను ప్రభుత్వం ఆన్లైన్లో మంజూరు చేసింది. ఇప్పటి వరకు 10 శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో వేలాది ఇళ్ల నిర్మాణాలకు కొత్త ప్రభుత్వంలో మోక్షం క లగటం అనుమానంగా ఉంది. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్‌లో మూడో విడత రచ్చబండ సభల్లో వచ్చిన దరఖాస్తులకు దాదాపుగా 30 వేలపైనే ఇళ్ల మంజూరుకు ఆన్లైన్లో రిజిష్టర్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం ముందు కూడా కాంగ్రెస్ సర్కార్ ఓట్ల కోసం భారీ ఎత్తున ఇళ్లను ఆన్లైన్ మంజూరుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు రచ్చబండల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి టీడీపీ ప్రభుత్వం హయాంలో వారి లెక్క కింద చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కొలువు తీరి ఇళ్ల నిర్మాణాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలోకి వచ్చేసరికి ఐదు నెలల కాలం పట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ కొరత
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : పేదోడి సొంతింటికలకు సిమెంట్ కొరత అవరోధంగా మారింది. మూడు నెలలుగా సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపివేశారు. జిల్లాకు ఇందిరమ్మ ఫేజ్ 1, 2,3లతో పాటు రచ్చ బండ మొదటి, రెండో విడతలో వచ్చిన దరఖాస్తుల మేరకు 3. 65 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ప్రస్తుతం 50 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే మూడు నెలలుగా సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలను మధ్యలోనే నిలిపి వేశారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు జిల్లాకు 8, 900 టన్నుల సిమెంట్ అవసరమని ప్రతిపాదనలు పంపించగా ఇంతవరకు సర ఫరా కాలేదు. ఇందిరమ్మ, రచ్చబండ ఇళ్లకు సిమెంట్‌ను మూడు విడతలుగా ఇస్తారు. పునాదులు వేసిన తర్వాత 20 బస్తాలు, రూప్ లెవల్‌కు వచ్చిన తర్వాత 20 బస్తాలు, శ్లాబు వేసిన తర్వాత 10 బస్తాలు చొప్పన మంజూరు చేస్తారు. సిమెంట్ బస్తాలకు డబ్బులు మినహాయించి బిల్లు చెల్లిస్తారు. అరుుతే సిమెంట్ సరఫరా నిలిచిపోవడానికి ధర పెరుగుదలే కారణమని తెలుస్తోంది. గతంలో రూ. 170 నుంచి రూ. 180 చొప్పున బస్తాలను సిమెంట్ పరిశ్రమలు సరఫరా చేసేవి. ప్రస్తుతం ధర పెరగిపోవడంతో పరిశ్రమలు సర ఫరా నిలిపివేసినట్టు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ. 300 నుంచి రూ. 330 వరకు ఉంది. దీంతో ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు అదనంగా రూ. 50 నుంచి రూ. 60 పెంచితే గాని సరఫరా చేయలేమని సిమెంట్ పరిశ్రమలు తెగేసి చెబుతున్న ట్టు భోగట్టా. దీంతో ప్రభుత్వం ఎటు తెల్చకుండా చోద్యం చూస్తోంది. అందువల్లే గృహానిర్మాశాఖ అధికారులు ప్రతిపాదనలు చేసి నా.. పరిశ్రమలు సిమెంట్ సరఫరా చేయడం లేదు. ఈ విషయమై గృహానిర్మాణశాఖ పీడీ యు.కె.హెచ్.కుమార్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా జిల్లాకు 8900 సిమెంట్ సరఫరా అవసరమని ప్రతిపాదనలు పంపించాం. త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. -
అవును... నిజమే
=‘ఇందిరమ్మ’లో అధికారుల అవినీతి =పేర్లు ఎస్సీలవి... బిల్లులు బీసీలకు =ముగ్గురు డీఈలు, ఒక ఏఈ బాధ్యులు =‘సాక్షి’ కథనంపై కదిలిన యంత్రాంగం =చార్జిమెమోలు జారీ... త్వరలోనే వేటు వరంగల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అధికారుల అవినీతి తేటతెల్లమైంది. ఏకంగా ముగ్గురు డీఈలు అవినీతి బాగోతంలో భాగస్వాములయ్యారు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు.. ఎస్సీల పేరిట బీసీలకు బిల్లులిచ్చారు. బీసీ వర్గాలకు రూ.45 వేలు బిల్లు ఉండటంతో ఎస్సీల పేరిట మార్చి వారికి రూ.65 వేలు మంజూరు చేసి... రూ.20 వేలను కలిసికట్టుగా పంచుకున్నారు. ఈ అంశాన్ని జూన్ 10న పూర్తి వివరాలతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. హసన్‌పర్తి మండలంలో అధికారులు చేపట్టిన విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీల పేరిట బీసీల జాబితాను మార్చినా... లబ్ధిదారులకు మాత్రం కొంతే ముట్టజెప్పినట్లు వెల్లడైంది. మిగిలిన సొమ్మును అధికారులే పంచుకున్నట్లు గుర్తించారు. ఇదీ విషయం రూ.20 వేల అదనపు బిల్లుల కోసం అధికారులు.. బీసీల జాబితా ఎస్సీలుగా మార్చారు. వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీసీ వర్గాలకు రూ.45 వేలు, ఎస్సీలకు రూ. 65 వేలు మంజూరు చేస్తారు. బీసీల జాబితాను ఎస్సీల జాబితాలో పెట్టారు. హసన్‌పర్తి మండలానికి చెందిన మాటేటి సుశీల, బుగ్గ సరోజన, చిదిర విజయ, చిదిర రమాదేవి, బుగ్గ రమాదేవి, బల్కూరి కల్పన, ఆలేటి కొమురమ్మ, మాచర్ల విజయలక్ష్మీ, కొత్తకొండ కనకలక్ష్మీ, కోదారి రాజకొమురమ్మ, కూర్ల సముద్రమ్మ, మాచర్ల వరలక్ష్మీ, గోపరాజు రమ్య, కందుకూరి సమ్మక్క, అరుణ, కోమల, కాళేశ్వర, లక్ష్మీ... ఇలా చాలా మందికి ఎస్సీలంటూ బిల్లులిచ్చినట్లు చూపించారు. వీరందరి పేరిట ఒక్కొక్కరిపై రూ.65 వేలు డ్రా చేసిన అధికారులు.. రూ.40 వేలే వారికి ఇచ్చారు. మిగిలిన రూ.20వేలు పంచుకున్నారు. ఎవరెవరంటే..? గృహ నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు డీఈలు ఈ అవినీతి వ్యవహారంలో పాలుపంచుకున్నట్టు విచారణలో తేలింది. అదే విధంగా అప్పట్లో హసన్‌పర్తిలో పనిచేసినఏఈ కూడా ఈ అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏఈ మరికొన్ని అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నట్లు విచారణలో గుర్తించారు. ముచ్చర్ల, జయగిరి, సీతంపేట, నాగారం, అనంతసాగర్, హసన్‌పర్తితో పాటు పలు గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టని ఇళ్లకు బిల్లులిచ్చినట్లు విచారణలో తేలింది. విచారణ నివేదికలను ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ ఎండీకి నివేదించారు. ఈ అవినీతికి పాల్పడిన వీరికి ఇప్పటికే చార్జిమెమోలను జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకోనున్నారు. ‘సాక్షి’ కథనంతో కుంభకోణంపై విచారణ చేపట్టామని, అవినీతి జరిగినట్టు విచారణలో తేలిందని వరంగల్ ఈఈ రమేష్ చెప్పారు. డీఈలు, ఏఈపై చర్యలకు సిఫారసు చేసినట్టు వివరించారు.