బిల్లు దూరం ఇల్లు భారం
మండపేట :జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇందిరమ్మ లబ్ధిదారులు తాము నిర్మించుకుంటున్న ఇళ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందక ఆక్రోశిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ నుంచి దశలవారీగా అందాల్సిన రుణసాయం నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో నిస్సహాయ స్థితిలో అలమటిస్తున్నారు. అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల చొప్పున స్థలంతో పాటు రూ.1.5 లక్షలతో పక్కా ఇంటిని నిర్మిస్తామని ఎన్నికల్లో టీడీ పీ వాగ్దానం ేసింది. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా ఆ దిశగా కార్యాచరణ లేదు సరికదా.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అంతకు ముందు మూడునెలలుగా నిలిచిపోయిన బిల్లుల విడుదలకు కించిత్తు చొరవ చూపలేదు.
గత నాలుగు నెలలుగా జిల్లాలో సుమారు 16,968 ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.41.59 కోట్ల మేర గృహనిర్మాణ రుణాల విడుదల నిలిచిపోయింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, పూర్తయిన మేర బిల్లులు అందకపోవడం లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు రూ.80,000, ఎస్సీలకు రూ.1,00,000, రూరల్‌లో ఓసీ, బీసీలకు రూ.70,000, ఎస్సీలకు రూ.1,00,000లను గృహనిర్మాణ సాయంగా అందిస్తున్నారు. పరిపాలన , రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును నిర్మాణంలో అంచెలను బట్టి దశల వారీగా గృహ నిర్మాణ శాఖ బిల్లులు చెల్లిస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి గృహనిర్మాణ శాఖ ఆన్‌లైన్‌ను మూసివేసి బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. నేటికీ ఆన్‌లైన్‌ను తెరవలేదు.
ఏ దశ పనులకైనా రాని బిల్లు..
ఇందిరమ్మ మూడు విడతల్లో జిల్లాకు సుమారు 2,46,560 ఇళ్లు మంజూరవగా ఇప్పటి వరకు కేవలం 92,743 పూర్తయ్యాయి. 24,936 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇందిరమ్మతో పాటు వివిధ జీఓలకు సంబంధించి గత ఏప్రిల్ నుంచి సుమారు 6,605 ఇళ్లకు పునాది దశ పనులు జరుగ్గా, 4,277 ఇళ్లకు రూఫ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. 6,086 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఆయా దశలకు అనుగుణంగా సుమారు రూ.41.59 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని అంచనా. నిర్మాణ దశల వివరాలను గృహ నిర్మాణశాఖ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశాక ఆ శాఖ నుంచి నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి బిల్లు మొత్తం జమవుతుంది.
గత నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌ను మూసి వేయడంతో లబ్ధిదారులకు బిల్లులు అందక హెచ్చు వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తీసుకుని.. తదుపరి దశల పనులను మొదలు పెడుతున్నారు. దీనికి తోడు గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి భారం తడిసిమోపెడవుతుందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో రూ.4,000 వరకు ఉన్న రెండు యూనిట్ల ఇసుక ప్రస్తుతం రూ.9,000 వరకు ఉంది. సిమెంట్ బస్తా రూ.320 వరకు పెరిగిపోయింది. ఐరన్, ఇటుక, కంకర వంటి వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. తాము మోయజాలని భారమైనా.. సొంత ఇల్లు సమకూర్చుకోవాలన్న ఆరాటంతో ప్రైవేట్ అప్పులు చేస్తున్నామని, వాటికి కట్టే పెచ్చు వడ్డీలు ఇల్లు సమకూరుతుందన్న ఆనందాన్ని ఇగిర్చివేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ దుస్థితిని గుర్తించి, స్పందించాలని, వెంటనే బిల్లులు విడుదల చేయించాలని కోరుతున్నారు.బిల్లుల విడుదలలో జాప్యంపై గృహనిర్మాణ శాఖ పీడీ సెల్వరాజ్‌ను వివరణ కోరగా గత మార్చి చివరి నుంచి ఆన్‌లైన్ నిలిచిపోయిందన్నారు. తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు.