ఇళ్ల బిల్లులకు జియో‘బంధనం’ | Geo tagging in indiramma housing | Sakshi
Sakshi News home page

ఇళ్ల బిల్లులకు జియో‘బంధనం’

Published Mon, Dec 1 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

ఇళ్ల బిల్లులకు జియో‘బంధనం’

ఇళ్ల బిల్లులకు జియో‘బంధనం’

జియో ట్యాగింగ్.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను గుర్తించేందుకు ఉపకరించే అధునాత న జీపీఎస్ సర్వే విధానమంటోంది ప్రభుత్వం. కానీ నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా కావాలని చేస్తున్న జాప్యంగా దీన్ని లబ్ధిదారులు అభివర్ణిస్తున్నారు. గత పదేళ్లలో నిర్మించిన ఇళ్లన్నింటినీ సర్వే చేయాలని ఆదేశించడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇల్లూ మంజూరు కాలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.14 కోట్ల
 బకాయిలు ఉన్నాయి. మరోవైపు మొక్కుబడిగా.. మందకొడిగా సర్వే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జియో ట్యాగింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది.. డబ్బులు ఎప్పుడు అందుతాయోనని పేద లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
 క్షేత్రస్థాయిలో వివరాలు, ఆధారాలు లభించక సర్వే బృందాలు నానాపాట్లు పడుతున్నాయి.
 
 కొత్తవి లేవు.. పాత బకాయిలు రావు
 గత ఆర్థిక సంవత్సరంలో నిర్మించిన ఇళ్లకు రూ.14 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రస్తుత(2014-15) ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా వీటి విషయం పట్టించుకోవడం లేదు. పైగా జియో ట్యాగింగ్ సర్వే బాధ్యత అప్పగించడంతో కార్యాలయాల్లో కూర్చొని బిల్లులు, లబ్ధిదారుల గుర్తింపు వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సిన గృహనిర్మాణశాఖ సిబ్బంది లబ్ధిదారుల జాబితాలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు. దీంతో కార్యాలయాల్లో పనులు స్తంభించాయి. పైగా గత పదేళ్లలో జరిగిన నిర్మాణాలను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జాబితాల్లో ఉన్న చిరునామాలు, ఆధారాలు క్షేత్రస్థాయిలో సరిపోలక సర్వే మందకొడిగా సాగుతోంది. ఇదంతా ఎప్పటికి పూర్తి అవుతుందో.. తమ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి గానీ.. లబ్ధిదారులకు గానీ కలిగి ప్రయోజనం ఏమీ లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి.
 
 లక్ష్యం కొండంత..
 పదేళ్ల నిర్మాణాలను సర్వే చేయాలని ప్రభుత్వం కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో 2004 నుంచి నిర్మించిన ఇళ్లు 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. గత నెల రోజుల్లో 27వేల ఇళ్లకు మాత్రమే జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. ఇంకా 3.70 లక్షల ఇళ్లున్నాయి. గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. అప్పట్లోగా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో చాలా ఇళ్ల, లబ్ధిదారుల వివరాలు లభించడం లేదని సర్వే బృందాలు వాపోతున్నాయి. దీంతో సర్వే చాలా మందకొడిగా సాగుతోంది. ఉదాహరణకు వంగర మండలంలో 27 పంచాయతీలు ఉండగా.. ఇప్పటికి నీలయ్యవలస, బాగెంపేట పంచాయతీల్లోనే సర్వే పూర్తి చేశారు.
 
 ప్రయోజనాలు
 జియో ట్యాగింగ్ వల్ల గతంలో ఇళ్లు పొందినవారు భవిష్యత్తులో మళ్లీ పొందే అవకాశం ఉండదు, ఒకే ఇంటికి రెండు మూడుసార్లు  బిల్లులు చేయడం వంటి అక్రమాలను అరికట్టవచ్చు. ఒకే రేషన్ కార్డుతో ఇద్దరు, ముగ్గురు ఇళ్లు పొందే అవకాశం కూడా ఉండదు.
 
     సర్వే కోసం వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను నియమించారు.
     ఆయా మండలాల్లో పనిచేస్తున్న వారే ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు.
     పతి మండలంలో రెండు బృందాలు సర్వే చేస్తున్నాయి.
     పతి బృందానికి మైక్రోమాక్స్ సెల్‌ఫోన్, ఎయిర్‌టెల్ సిమ్ కార్డు, ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ అందజేశారు.
     లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇళ్లను గుర్తించి వాటికి సంబంధించి రెండుకు తగ్గకుండా ఫొటోలు తీసుకుంటారు.
     ఇంటి ఐడీ నెంబరు, గృహ యజమాని పేరు తీసుకుంటారు.
     ఫొటోలతోపాటు ఆ వివరాలను జియో ట్యాగింగ్ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తారు.
     వివరాల సేకరణలో ఇందిరా ఆవాస్ యోజన, ఇందిరమ్మ, తర్వాత ఇతర గృహనిర్మాణ పథకాలను ప్రాధాన్యక్రమంగా అనుసరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement