జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బిల్లులు ఎప్పుడు వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయం హాయినిచ్చింది. ఇటీవల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ మంత్రిత్వ శాఖ లేదు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఆ వెనువెంటనే సంబంధిత అధికారుల సమీక్ష నిర్వహించి రాష్ట్రం ఏర్పాటుకు ముందు నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో 3 లక్షల 89 వేల 655 మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల చెల్లింపునకు బ్రేక్ పడింది. సుమారు సంవత్సర కాలం నుంచి లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం ఈ శాఖకు మంత్రినికేటాయించడంతో పాటు బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నారని ప్రభుత్వం సీఐడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బిల్లులు నిలిపివేయడంతో లబ్ధిదారులు ఇప్పటివవరకు ఇబ్బందులు పడ్డారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇప్పటి దాకా మొత్తం 5,80,732 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,89,655 ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు మొత్తం బిల్లులు చెల్లించారు. 3,02,283 లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. వీరికి చివరిదైన చెత్తు బిల్లు చెల్లించాల్సి ఉంది. 87,372 మంది వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఉన్నారు. ఇందులో పునాదిదశలో 12,569, బేస్‌మెంట్ లెవెల్‌లో 42,577, లెంటల్ లెవెల్ 7,172, రూఫ్ లెవెల్‌లో 25,048 నిర్మాణాల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పటిదాకా 1,91,077 ఇళ్ల లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు.
1,91,077 ఇళ్లు రద్దు..?
జిల్లాలో 1,91,077 ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఇళ్లను రద్దు చేయాలా.. లేక కొనసాగించాలా అన్న మీమాంసలో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు. బిల్లులు చెల్లించాల్సిన వాటిలో కూడా అంతా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తిరిగి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపికను పక్రియను పూర్తి చేసి బిల్లులను చెల్లించే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
‘ఇందిరమ్మ’కు ఊరట
Published Sun, Dec 28 2014 3:09 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement