=‘ఇందిరమ్మ’లో అధికారుల అవినీతి
=పేర్లు ఎస్సీలవి... బిల్లులు బీసీలకు
=ముగ్గురు డీఈలు, ఒక ఏఈ బాధ్యులు
=‘సాక్షి’ కథనంపై కదిలిన యంత్రాంగం
=చార్జిమెమోలు జారీ... త్వరలోనే వేటు
వరంగల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అధికారుల అవినీతి తేటతెల్లమైంది. ఏకంగా ముగ్గురు డీఈలు అవినీతి బాగోతంలో భాగస్వాములయ్యారు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు.. ఎస్సీల పేరిట బీసీలకు బిల్లులిచ్చారు. బీసీ వర్గాలకు రూ.45 వేలు బిల్లు ఉండటంతో ఎస్సీల పేరిట మార్చి వారికి రూ.65 వేలు మంజూరు చేసి... రూ.20 వేలను కలిసికట్టుగా పంచుకున్నారు. ఈ అంశాన్ని జూన్ 10న పూర్తి వివరాలతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. హసన్‌పర్తి మండలంలో అధికారులు చేపట్టిన విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీల పేరిట బీసీల జాబితాను మార్చినా... లబ్ధిదారులకు మాత్రం కొంతే ముట్టజెప్పినట్లు వెల్లడైంది. మిగిలిన సొమ్మును అధికారులే పంచుకున్నట్లు గుర్తించారు.
ఇదీ విషయం
రూ.20 వేల అదనపు బిల్లుల కోసం అధికారులు.. బీసీల జాబితా ఎస్సీలుగా మార్చారు. వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీసీ వర్గాలకు రూ.45 వేలు, ఎస్సీలకు రూ. 65 వేలు మంజూరు చేస్తారు. బీసీల జాబితాను ఎస్సీల జాబితాలో పెట్టారు. హసన్‌పర్తి మండలానికి చెందిన మాటేటి సుశీల, బుగ్గ సరోజన, చిదిర విజయ, చిదిర రమాదేవి, బుగ్గ రమాదేవి, బల్కూరి కల్పన, ఆలేటి కొమురమ్మ, మాచర్ల విజయలక్ష్మీ, కొత్తకొండ కనకలక్ష్మీ, కోదారి రాజకొమురమ్మ, కూర్ల సముద్రమ్మ, మాచర్ల వరలక్ష్మీ, గోపరాజు రమ్య, కందుకూరి సమ్మక్క, అరుణ, కోమల, కాళేశ్వర, లక్ష్మీ... ఇలా చాలా మందికి ఎస్సీలంటూ బిల్లులిచ్చినట్లు చూపించారు. వీరందరి పేరిట ఒక్కొక్కరిపై రూ.65 వేలు డ్రా చేసిన అధికారులు.. రూ.40 వేలే వారికి ఇచ్చారు. మిగిలిన రూ.20వేలు పంచుకున్నారు.
ఎవరెవరంటే..?
గృహ నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు డీఈలు ఈ అవినీతి వ్యవహారంలో పాలుపంచుకున్నట్టు విచారణలో తేలింది. అదే విధంగా అప్పట్లో హసన్‌పర్తిలో పనిచేసినఏఈ కూడా ఈ అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏఈ మరికొన్ని అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నట్లు విచారణలో గుర్తించారు. ముచ్చర్ల, జయగిరి, సీతంపేట, నాగారం, అనంతసాగర్, హసన్‌పర్తితో పాటు పలు గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టని ఇళ్లకు బిల్లులిచ్చినట్లు విచారణలో తేలింది.
విచారణ నివేదికలను ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ ఎండీకి నివేదించారు. ఈ అవినీతికి పాల్పడిన వీరికి ఇప్పటికే చార్జిమెమోలను జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకోనున్నారు. ‘సాక్షి’ కథనంతో కుంభకోణంపై విచారణ చేపట్టామని, అవినీతి జరిగినట్టు విచారణలో తేలిందని వరంగల్ ఈఈ రమేష్ చెప్పారు. డీఈలు, ఏఈపై చర్యలకు సిఫారసు చేసినట్టు వివరించారు.