charge memo
-
డీఈవో కార్యాలయంలో స్టేషనరీ మాయం
జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా స్టేషనరీని అమ్ముకోగా, మరో అటెండర్ ఏకంగా ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లనే చిత్తుకాగితాల కింద అమ్మేశాడు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో ముగ్గురి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో దాచిన ఆన్సర్ షీట్లను అమ్ముకున్న ఉద్యోగిని సంబంధిత ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి పట్టించారు. ♦ రద్దీకి అమ్ముకున్న సిబ్బంది ♦ అందులో మూడు సర్వీసు రికార్డులు ♦ ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లనే అమ్మేసిన మరో అటెండర్ ♦ మొత్తం విలువ రూ.3 లక్షలు ♦ నెల తర్వాత వెలుగులోకి ♦ మెమోలు జారీ నిజామాబాద్ అర్బన్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పాత పేపర్లు, ఇతర విభాగాలకు చెందిన స్టేషనరీ మూడు సంవత్సరాలుగా పేరుకుపోయింది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో టెండర్ నిర్వహించి విక్రయించవల్సి ఉంది. అయితే రాత్రివేళ విధులు నిర్వర్తించే ఇద్దరు అటెండర్లు, మరో అటెండర్ కలిసి ఎవరికీ తెలియకుండా రాత్రివేళ అమ్ముకున్నట్లు తెలిసింది. రూ. లక్ష 50 వేల విలువ చేసే స్టేషనరీని సంచుల్లో నింపి విక్రయించారు. వచ్చిన డబ్బులను పంచుకున్నారు. ఈ పంపకాల్లో తేడాలు రావడంతో విక్రయించిన నెలరోజులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషనరీ విక్రయించారని డీఈవో దృష్టికి వెళ్లడంతో ఆయన ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. ఈ స్టేషనరీలో రిటైర్డు ఉద్యోగులకు సంబంధించి ముగ్గురి సర్వీస్ రికార్డులు ఉన్నాయి. రిటైర్డు అయిన ఓ ప్రధానోపాధ్యాయుడు బిల్లుల కోసం సర్వీస్ రికార్డును గతంలోనే డీఈవో కార్యాలయం లో అందజేశారు. ప్రస్తుతం సర్వీస్ రికార్డు కావాలని ఇటీవల డీఈవో కార్యాలయానికి వచ్చారు. సర్వీస్ రికార్డు స్టేషనరీకి సంబంధించిన స్థలంలో ఉందని సంబంధిత క్లర్క్ అక్కడవెళ్లి పరిశీలించగా స్టేషనరీ కనిపించలేదు. దీనిపై ఆరా తీయగా స్టేషనరీని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన విషయం తేలింది. ఆ స్టేషనరీలో మూడు సర్వీస్ రికార్డులు ఉన్నాయని కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దొంగచాటున స్టేషనరీని విక్రయించిన ఇద్దరు ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లు సైతం.. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాలను భద్రపరిచారు. వీటిని ఇటీవల వాల్యుయేషన్ నిర్వహించి అక్కడ ఒక గదిలో ఉంచారు. డీఈవో కార్యాలయానికి చెందిన అటెండర్ జవాబుపత్రాలను చిత్తుకాగితాల కింద విక్రయించాడు. సుమారు రూ. లక్ష 50 వేలు స్టేషనరీ విక్రయించడం ద్వారా అటెండర్ లబ్ధిపొందినట్లు తెలిసింది. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్టేషనరీని అటెండర్ విక్రయించేటప్పుడు ఫొటోలు తీసి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో ఉద్యోగికి మెమో జారీ చేసి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. స్టేషనరీ విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవల్సింది పోయి మెమోజారీ జారీ చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఘటన జరిగి నెలలు గడిచినా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహవరిస్తున్నారని అంటున్నారు. -
..అయినా తీరు మారలేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తోన్న ఎస్ఐ, సీఐలకు ఎస్పీ సెంథిల్‌కుమార్ చార్జ్ మెమోలు జారీ చేస్తున్నా పలువురు పోలీసుల తీరు మారడం లేదు. ఖద్దరు చొక్కాలకు గులాంగిరి చేస్తూ.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. ఇందుకు తార్కాణం రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసుకున్న అమానుషమే. మైనర్ బాలికను నమ్మించి పదే పదే అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన మురళి అనే కీచకుడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వ్యవహరించిన తీరే అందుకు తార్కాణం. టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గడం వల్లే నిందితునిపై సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారనే విమర్శ ఆ శాఖ నుంచే బలంగా వ్యక్తమవుతుండటమే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. జిల్లా ఎస్పీగా ఈ నెల 2న సెంథిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజు నుంచే ఓ వైపు ఎస్పీ సెంథిల్‌కుమార్.. మరో వైపు డీఐజీ బాలకృష్ణ పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొరడా ఝుళిపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే పోలీసు అధికారులపై తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఆ క్రమంలోనే ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలకు చార్జి మెమోలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించినా.. ప్రజలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను పోలీసు సిబ్బందికి పంపారు. కానీ.. డీఐజీ, ఎస్పీ చేపట్టిన చర్యలు కొందరు ఎస్ఐ, సీఐల్లో మార్పు తేవడం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల దన్నుతో పోస్టింగ్‌లు తెచ్చుకున్న కొందరు ఎస్ఐ, సీఐలు వారి సేవలో తరించిపోతున్నారనే విమర్శలు పోలీసు శాఖ నుంచే వ్యక్తమవుతున్నాయి. తమపై ఈగ వాలనివ్వకుండా తమకు దన్నుగా నిలుస్తోన్న ప్రజాప్రతినిధులు చూసుకుంటారనే ధీమా వారిలో ఉండటమే అందుకు కారణమే భావన బలంగా విన్పిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల దన్నుతో కొందరు ఎస్ఐ, సీఐలు పేట్రేగిపోతున్నారు. వారికి వంత పాడుతూ శాంతిభద్రతల పరిరక్షణను విస్మరిస్తున్నారు. ప్రజల మానప్రాణాలను దోచుకుంటున్నా వారు కిమ్మనడం లేదు. ఇందుకు నిదర్శనమే రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసున్న దాష్టీకం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు బాలాజీ అనుచరుడిగా భావిస్తున్న మురళి రామగిరి మండలం గంగంపల్లిలో ఓ మైనర్ బాలికను నమ్మించి, లోబర్చుకున్నాడు. ఆ బాలికపై పదే పదే అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. గుట్టు రట్టువుతుందని భావించిన మురళి, అతని తల్లిదండ్రులు.. మైనర్ బాలిక, తల్లిపై దాడి చేసి.. ఈనెల 11న బలవంతంగా నాటు పద్దతిలో అబార్షన్ చేశారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో బాలికను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఈనెల 11న చేర్పించారు. ఈ వ్యవహారంపై సర్వజనాసుపత్రిలో అదే రోజున మెడికో లీగల్ విభాగంలో కేసు నమోదైంది. ఈ తరహా ఘటనలపై ఆయా పోలీసుస్టేషన్లకు ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు ముందుస్తు సమాచారం ఇచ్చే సంప్రదాయం ఆ శాఖలో ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయా పోలీసుస్టేషన్లకు ఇచ్చామని ఔట్‌పోస్టు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ.. రామగిరి పోలీసులు ఈ వ్యవహారంపై సకాలం కేసు నమోదు చేయలేదు. నింపాదిగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ‘సాక్షి’ ప్రశ్నిస్తే.. సీఐ నర్సింహరావు మాట్లాడుతూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిదని చెప్పడం గమనార్హం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదులో జాప్యం జరిగినట్లు మైనర్ బాలిక తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఎస్పీ సెంథిల్‌కుమార్ తీవ్రంగా స్పందించడంతో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు తీరిగ్గా కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ అంశంపై ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితుడు మురళీపై ఐపీసీ 313, 376, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతని తల్లి ముత్యాలమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితున్ని పట్టుకుంటామన్నారు. కేసు ఆలస్యం చేయడంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 13న రాత్రి 9 గంటలకు కేసు కట్టామని తెలియజేశారు. బాధితురాలికి నిర్భయ చట్టం వర్తిస్తే.. ఆ చట్టం కిందే కేసు పెడతామని స్పష్టీకరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనేగానీ బాధితులకు కొందరు పోలీసులు న్యాయం చేయరన్నది మరో సారి స్పష్టమైంది. -
అవును... నిజమే
=‘ఇందిరమ్మ’లో అధికారుల అవినీతి =పేర్లు ఎస్సీలవి... బిల్లులు బీసీలకు =ముగ్గురు డీఈలు, ఒక ఏఈ బాధ్యులు =‘సాక్షి’ కథనంపై కదిలిన యంత్రాంగం =చార్జిమెమోలు జారీ... త్వరలోనే వేటు వరంగల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అధికారుల అవినీతి తేటతెల్లమైంది. ఏకంగా ముగ్గురు డీఈలు అవినీతి బాగోతంలో భాగస్వాములయ్యారు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు.. ఎస్సీల పేరిట బీసీలకు బిల్లులిచ్చారు. బీసీ వర్గాలకు రూ.45 వేలు బిల్లు ఉండటంతో ఎస్సీల పేరిట మార్చి వారికి రూ.65 వేలు మంజూరు చేసి... రూ.20 వేలను కలిసికట్టుగా పంచుకున్నారు. ఈ అంశాన్ని జూన్ 10న పూర్తి వివరాలతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. హసన్‌పర్తి మండలంలో అధికారులు చేపట్టిన విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీల పేరిట బీసీల జాబితాను మార్చినా... లబ్ధిదారులకు మాత్రం కొంతే ముట్టజెప్పినట్లు వెల్లడైంది. మిగిలిన సొమ్మును అధికారులే పంచుకున్నట్లు గుర్తించారు. ఇదీ విషయం రూ.20 వేల అదనపు బిల్లుల కోసం అధికారులు.. బీసీల జాబితా ఎస్సీలుగా మార్చారు. వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీసీ వర్గాలకు రూ.45 వేలు, ఎస్సీలకు రూ. 65 వేలు మంజూరు చేస్తారు. బీసీల జాబితాను ఎస్సీల జాబితాలో పెట్టారు. హసన్‌పర్తి మండలానికి చెందిన మాటేటి సుశీల, బుగ్గ సరోజన, చిదిర విజయ, చిదిర రమాదేవి, బుగ్గ రమాదేవి, బల్కూరి కల్పన, ఆలేటి కొమురమ్మ, మాచర్ల విజయలక్ష్మీ, కొత్తకొండ కనకలక్ష్మీ, కోదారి రాజకొమురమ్మ, కూర్ల సముద్రమ్మ, మాచర్ల వరలక్ష్మీ, గోపరాజు రమ్య, కందుకూరి సమ్మక్క, అరుణ, కోమల, కాళేశ్వర, లక్ష్మీ... ఇలా చాలా మందికి ఎస్సీలంటూ బిల్లులిచ్చినట్లు చూపించారు. వీరందరి పేరిట ఒక్కొక్కరిపై రూ.65 వేలు డ్రా చేసిన అధికారులు.. రూ.40 వేలే వారికి ఇచ్చారు. మిగిలిన రూ.20వేలు పంచుకున్నారు. ఎవరెవరంటే..? గృహ నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు డీఈలు ఈ అవినీతి వ్యవహారంలో పాలుపంచుకున్నట్టు విచారణలో తేలింది. అదే విధంగా అప్పట్లో హసన్‌పర్తిలో పనిచేసినఏఈ కూడా ఈ అవినీతి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏఈ మరికొన్ని అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నట్లు విచారణలో గుర్తించారు. ముచ్చర్ల, జయగిరి, సీతంపేట, నాగారం, అనంతసాగర్, హసన్‌పర్తితో పాటు పలు గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టని ఇళ్లకు బిల్లులిచ్చినట్లు విచారణలో తేలింది. విచారణ నివేదికలను ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ ఎండీకి నివేదించారు. ఈ అవినీతికి పాల్పడిన వీరికి ఇప్పటికే చార్జిమెమోలను జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకోనున్నారు. ‘సాక్షి’ కథనంతో కుంభకోణంపై విచారణ చేపట్టామని, అవినీతి జరిగినట్టు విచారణలో తేలిందని వరంగల్ ఈఈ రమేష్ చెప్పారు. డీఈలు, ఏఈపై చర్యలకు సిఫారసు చేసినట్టు వివరించారు.