సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తోన్న ఎస్‌ఐ, సీఐలకు ఎస్పీ సెంథిల్‌కుమార్ చార్జ్ మెమోలు జారీ చేస్తున్నా పలువురు పోలీసుల తీరు మారడం లేదు. ఖద్దరు చొక్కాలకు గులాంగిరి చేస్తూ.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. ఇందుకు తార్కాణం రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసుకున్న అమానుషమే. మైనర్ బాలికను నమ్మించి పదే పదే అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన మురళి అనే కీచకుడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వ్యవహరించిన తీరే అందుకు తార్కాణం.
టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గడం వల్లే నిందితునిపై సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారనే విమర్శ ఆ శాఖ నుంచే బలంగా వ్యక్తమవుతుండటమే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. జిల్లా ఎస్పీగా ఈ నెల 2న సెంథిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజు నుంచే ఓ వైపు ఎస్పీ సెంథిల్‌కుమార్.. మరో వైపు డీఐజీ బాలకృష్ణ పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొరడా ఝుళిపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే పోలీసు అధికారులపై తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
ఆ క్రమంలోనే ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలకు చార్జి మెమోలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించినా.. ప్రజలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను పోలీసు సిబ్బందికి పంపారు. కానీ.. డీఐజీ, ఎస్పీ చేపట్టిన చర్యలు కొందరు ఎస్‌ఐ, సీఐల్లో మార్పు తేవడం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల దన్నుతో పోస్టింగ్‌లు తెచ్చుకున్న కొందరు ఎస్‌ఐ, సీఐలు వారి సేవలో తరించిపోతున్నారనే విమర్శలు పోలీసు శాఖ నుంచే వ్యక్తమవుతున్నాయి. తమపై ఈగ వాలనివ్వకుండా తమకు దన్నుగా నిలుస్తోన్న ప్రజాప్రతినిధులు చూసుకుంటారనే ధీమా వారిలో ఉండటమే అందుకు కారణమే భావన బలంగా విన్పిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల దన్నుతో కొందరు ఎస్‌ఐ, సీఐలు పేట్రేగిపోతున్నారు.
వారికి వంత పాడుతూ శాంతిభద్రతల పరిరక్షణను విస్మరిస్తున్నారు. ప్రజల మానప్రాణాలను దోచుకుంటున్నా వారు కిమ్మనడం లేదు. ఇందుకు నిదర్శనమే రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసున్న దాష్టీకం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు బాలాజీ అనుచరుడిగా భావిస్తున్న మురళి రామగిరి మండలం గంగంపల్లిలో ఓ మైనర్ బాలికను నమ్మించి, లోబర్చుకున్నాడు. ఆ బాలికపై పదే పదే అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. గుట్టు రట్టువుతుందని భావించిన మురళి, అతని తల్లిదండ్రులు.. మైనర్ బాలిక, తల్లిపై దాడి చేసి.. ఈనెల 11న బలవంతంగా నాటు పద్దతిలో అబార్షన్ చేశారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో బాలికను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఈనెల 11న చేర్పించారు. ఈ వ్యవహారంపై సర్వజనాసుపత్రిలో అదే రోజున మెడికో లీగల్ విభాగంలో కేసు నమోదైంది. ఈ తరహా ఘటనలపై ఆయా పోలీసుస్టేషన్‌లకు ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు ముందుస్తు సమాచారం ఇచ్చే సంప్రదాయం ఆ శాఖలో ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయా పోలీసుస్టేషన్‌లకు ఇచ్చామని ఔట్‌పోస్టు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ.. రామగిరి పోలీసులు ఈ వ్యవహారంపై సకాలం కేసు నమోదు చేయలేదు.
నింపాదిగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ‘సాక్షి’ ప్రశ్నిస్తే.. సీఐ నర్సింహరావు మాట్లాడుతూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిదని చెప్పడం గమనార్హం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదులో జాప్యం జరిగినట్లు మైనర్ బాలిక తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఎస్పీ సెంథిల్‌కుమార్ తీవ్రంగా స్పందించడంతో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు తీరిగ్గా కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ అంశంపై ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితుడు మురళీపై ఐపీసీ 313, 376, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసులు నమోదు చేశామన్నారు.
నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతని తల్లి ముత్యాలమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితున్ని పట్టుకుంటామన్నారు. కేసు ఆలస్యం చేయడంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 13న రాత్రి 9 గంటలకు కేసు కట్టామని తెలియజేశారు. బాధితురాలికి నిర్భయ చట్టం వర్తిస్తే.. ఆ చట్టం కిందే కేసు పెడతామని స్పష్టీకరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనేగానీ బాధితులకు కొందరు పోలీసులు న్యాయం చేయరన్నది మరో సారి స్పష్టమైంది.
..అయినా తీరు మారలేదు!
Published Sun, Dec 15 2013 3:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement