అయోమయం
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : పేదలకు సొంతింటి కల నిజం చేయడమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగించింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ పాలన రావడం, సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో కోడ్ అమలులోకి వచ్చి లబ్ధిదారులకు మార్చి 17 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.32 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ.3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టడంతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశలలో ఉన్న లబ్ధిదారులు తమకు గత ప్రభుత్వంలో అందించిన ప్యాకేజీ వర్తిస్తుందా లేదా, కొత్త ప్రభుత్వం అందజేయనున్న ప్యాకేజీ వర్తిస్తుందా అని తర్జనభర్జన పడుతున్నారు.
గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి అందించిన సాయం..
గత ప్రభుత్వం జిల్లాలో మొత్తం 4,03,969 ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి ఎస్సీ లబ్ధిదారులకు రూ.1,05,000, ఎస్‌టీ లబ్ధిదారులకు రూ.1,00,000, ఇతరులకు రూ.70,000 ఇచ్చేవారు. ఈ నగదును ఇంటినిర్మాణంలో దశల వారీగా అందజేసేవారు. మంజూరైన ఇళ్లలో 2,22,943 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో మిగతావి వివిధ దశల్లో ఉండగా, 1,22,874 ఇళ్లనిర్మాణం మొదలుపెట్టనే లేదు. అయితే పెరిగిన ధరలు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోకపోవడం, బిల్లులు సకాలం లో అందజేయకపోవడంతో నిరుపేదల సొంతిం టి కల తీరని కోరికగానే మిగిలిపోయింది.
కొత్త ఆశలు రేకెత్తిస్తున్న కేసీఆర్ హామీ
120 చదరపు గజాలలో రూ.3 లక్షలతో ఇంటి నిర్మాణం చేయిస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్ట డంతో.. ఆ హామీని అమలుచేస్తారని ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టని 1,22,874 మంది లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థగా ఉన్న గృహ నిర్మాణ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పేరు మార్పిడి జరగడం ఖాయమైనందున ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు కూడా మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీప్రకారం నిర్మించబోయే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలపై ఇప్పటివరకు ఆ శాఖ అధికారులలో చర్చకు రాలేదని తెలిసింది. ఈ పరిస్థితులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉండగా గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న 32 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు చేపట్టడం పూర్తయ్యాక నూతన ఇళ్ల నిర్మాణ విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించవచ్చని తెలిపారు.