గ్రామగ్రామాన వైఎస్ వర్ధంతి నిర్వహించాలి
హుజూర్‌నగర్ :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 5వ వర్ధంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలు, గ్రామాలలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, ప్రాంతాలకతీతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకం, పింఛన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి పథకాలను అమలుచేసి బడుగు, బలహీనవర్గాల, రైతుల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.
వైఎస్సార్ పాలనను స్వర్ణయుగంగా ప్రజలు కొని యాడారని, ఆయన అకాల మృతిని నేటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆయన పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు నేటికీ వైఎస్సార్‌ను తమ ఇంటి దేవుడిగా కొలుస్తున్నారని తెలిపారు. వైఎ స్సార్ వర్ధంతిని పురస్కరించుకొని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్, నాయకులు కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు, పిల్లి మరియదాసు తదితరులు పాల్గొన్నారు.