ఏలూరు(ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తానాల రామకృష్ణారావు సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 7వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నట్లు రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అసెంబ్లీ తిరస్కరించి తిప్పి పంపిన రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో మూజువాణి ఓటుతో పాస్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సీమాంధ్ర ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయడం, రాజ్యసభలో ప్రతిపక్ష బీజేపీ మద్దతుతో బిల్లును ఆమోదించడం చట్టం వ్యతిరేకమని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాదులు అయ్యంకి రమేష్, నారిమన్ ఆల్తాఫ్ అహ్మద్, ఎంఎన్ రావుల సహకారంతో సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశామని రామకృష్ణారావు పేర్కొన్నారు.
పిటిషన్‌ను సుప్రీంకోర్టు 6791/14 నెంబర్‌తో విచారణకు స్వీకరించిందని తెలిపారు. పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ కోసం ప్రతిపాదించిన అంశాలకు చట్టబద్ధత లేదని, తమ ఆర్థిక అంశాలు ఉన్నప్పుడు బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం చెల్లదని, అందువల్ల ఈ బిల్లు చట్టవ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తమ వాదనాలు నమోదు చేశామన్నారు. సుప్రీంకోర్టు ఈనెల 7వ తేదీన విచారించనుందని రామకృష్ణారావు తెలిపారు.