ప్రజల అభీష్టం మేరకే విభజన జరిగింది కదా!
► ‘విభజన’ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
► అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రజల అభీష్టం మేరకే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కదా..! విభజన జరిగిన తర్వాత దీనిపై ఇప్పుడు విచారణ జరపాలని కోరడంలో ఆంతర్యం ఏమిటి?’ అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎంపీ రాయపాటి సాంబశివరావు సహా 26 మంది దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహెర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజ న జరిగింది కదా! దీనిపై విచారణ జరపాలని కోర డంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.
కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది ఏడీఎన్ రావు జోక్యం చేసుకుంటూ.. ‘రాష్ట్ర విభజన ఏపీ ప్రజల కోరికకు విరుద్ధంగా విభజన జరిగింది. కాబట్టి బిల్లు ఆమోదానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేలా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించండి..’ అని కోరారు. విభజనకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేయలేదని, దీనిపై కూడా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఇతర పిటిషనర్లు రఘురామకృష్ణ రాజు, పద్మనాభరావు తరఫు న్యాయవాది సతీశ్ ధర్మాసనాన్ని కోరారు. కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏపీని విభజించామని కేంద్రం తరఫున అదనపు సొలిటర్ జనరల్ పరంజిత్ సింగ్ పట్వాలియా ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నామని, అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోతే దాఖలు చేయాలని ఆదేశించింది.