నకిలీ నోట్లు.. పందాలకు కోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు:‘సుప్రీం కోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు అనుకూలమో.. ప్రతికూలమో ఎవరికెరుక. మా పందాలు మావే’ అంటూ కోడి పందాల రాయుళ్లు ముహూర్తాలు చూసుకుని మరీ బరులు సిద్ధం చేసేశారు. మరోపక్క జూదాలు, బెట్టింగుల ముసుగులో దొంగనోట్ల చలామణికి జిల్లాలో రంగం సిద్ధమవుతోంది. నకిలీ నోట్లను విచ్చలవిడిగా మార్పిడి చేసేందుకు సంక్రాంతి వేళ కోడి పందాలు, జూదాలే వేదికలవుతున్నారుు. ఈసారి కూడా వీటిని పెద్దఎత్తున చలామణి చేసేందుకు జూదగాళ్లు, నేరగాళ్లు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
కొల్లేరు.. డెల్టా కేంద్రాలుగా..
కొల్లేరు, ప్రాంతాల నుంచి చేపలు, రొయ్యల ఎగుమతులతో నిత్యం రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. ఇదే అదనుగా నకిలీనోట్ల తయారీ ముఠా కొల్లేరు, డెల్టాలోని పల్లెలపై దృష్టి సారించింది. ఈ ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ పంపిణీ భారీ ఎత్తున సాగుతున్నట్టు పోలీసు వర్గాలూ అంగీకరించే వాస్తవం. గత ఏడాది జూలై 25న కొల్లేరు గ్రామమైన కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన జలసూత్రం వెంకన్న ఇంట్లో ప్రింటర్, కంప్యూటర్‌తో పాటు దాదాపు రూ.55 వేల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రూ.28 లక్షలు టర్నోవర్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను అతడు బయటపెడ్డాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముదినేపల్లి జెడ్పీటీసీ నాగకల్యాణి భర్త భూపతి రవీంద్రకు రూ.ఐదు లక్షల నకిలీ నోట్లు ఇచ్చానని, అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఆ నోట్లే పంపిణీ చేశారని చెప్పడంతో పోలీసులు వెంటనే రవీంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
ఈ నిందితుల వెనుక అసలు సూత్రధారువెవరు.. ఎవరి అండతో, ఎవరున్నారనే ధైర్యంతో విచ్చలవిడిగా దొంగనోట్ల ముద్రణకు, పంపిణీకి శ్రీకారం చుట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయలేదు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈ కేసును క్లోజ్ చేసేశారన్న వాదనలు ఉన్నాయి. ఇదిలావుండగా, జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా నెలక్రితం జలసూత్రం వెంకన్న మళ్లీ నకిలీ నోట్ల కేసులోనే అరెస్టయ్యాడు. ఆ ప్రాంతంలో పేకాట సొమ్ములో నకిలీ నోట్లు రావడంతో పోలీసులు వెంకన్న ఇల్లు సోదా చేయగా, తిరిగి నకిలీ కరెన్సీతోనే పట్టుబడ్డాడు. వాస్తవానికి ఆరు నెలల కిందట పట్టుబడినప్పుడే అసలు సూత్రధారులపై పోలీసులు దృష్టిసారించి ఉంటే మొత్తం డొంకంతా కదిలేది. కానీ అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లతోపాటు నజరానాలూ ముట్టడంతో ఈ కేసు నుంచి ప్రధాన నిందితులను బయట పడేశారన్న ఆరోపణలను కృష్ణా జిల్లా పోలీసు అధికారులు మూట కట్టుకున్నారు.
ఏలూరు కేసూ అంతేనా
ఏలూరులోని అమీనాపేట లూథరన్ చర్చి వెనుక ప్రాంతంలో నకిలీ నోట్లను తయారు చేస్తున్న మహారాష్ట్రకి చెందిన గోపాల్‌సింగ్ ఠాగూర్‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంట్లో సుమారు రూ.6 లక్షల విలువైన నకిలీ నోట్లు పోలీసులకు లభించాయి. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టి ఎవరి సహకారంతో నిందితుడు నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడు.. ఎలా చలామణి చేస్తున్నాడో త్వరలోనే బహిర్గతం చేస్తామని ఆ సందర్భంగా పోలీసులు ఘనంగా ప్రకటించారు. ఇంతవరకు ఆ దిశగా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న దాఖలాలు కానరావడం లేదు. వాస్తవానికి నగరానికి చెందిన ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధికి ఈ కేసుతో సంబంధం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సదరు ప్రజాప్రతినిధి ఇచ్చిన సమాచారం మేరకే గోపాల్‌సింగ్ ఠాకూర్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడికి, ప్రజాప్రతినిధికి మధ్య లావీదేవీల్లో వచ్చిన పొరపొచ్చాల వల్లే అతను పోలీసులకు ఉప్పందించాడని అంటున్నారు.
సదరు ప్రజాప్రతినిధిని నెలన్నర క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని నకిలీ నోట్ల విషయంపై ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలోనూ దొంగ బంగారం, దొంగ వాహనాల కొనుగోళ్ల వ్యవహారంలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ప్రజాప్రతినిధికి ఓ ఎమ్మెల్యే అండ ఉండటం వల్లే పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభిస్తే జిల్లాలో నకిలీ నోట్ల డొంకమొత్తం కదిలే అవకాశం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా బుధవారం నుంచి విచ్చలవిడిగా కోడి పందాలు, బెట్టింగ్‌ల మాటున జరిగే నకిలీ కరెన్సీ చలామణికి అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు. మరి పోలీసులు ఏస్థాయిలో స్పందిస్తారో చూడాల్సిందే.