‘పుంజు’కుంటున్న బరులు
- కేసులకు బెదరని పందేలరాయుళ్లు
- హైకోర్టు ఆదేశాలను పాటించాలంటూ పోలీసుల ఫ్లెక్సీలు
- మూడు రోజుల అనుమతి వస్తుందని నిర్వాహకుల ఆశ
- పెద్దనోట్లు రద్దు ప్రభావం పెద్దగా ఉండదని భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించగా.. ఆ నిషేధాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. దీంతో పందేలను అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నా రు. అయినా.. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేల రాయుళ్లు వెనుకంజ వేయకుండా పందేల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. సంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహిస్తామని చెబుతున్నారు. పండగ మూడు రోజులు అనుమతులు ఇచ్చే విషయం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పందెంరా యుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు.
పందేలు సంక్రాంతి పండగ ఆనవాయితీ అని.. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదని నిర్వాహ కులు తేల్చి చెబుతున్నారు. కోడిపందేలకు ప్రసిద్ధిగాంచిన భీమవరం, పరిసర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. తణుకు మండలం తేతలి, వేల్పూరు గ్రామాల్లో ఇప్పటికే నిర్వాహకులు బరులు సిద్ధం చేయగా ఇరగవరం, అత్తిలి మండలాల్లో బరుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పెనుమంట్ర మండలం మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలం వడలి, సిద్ధాంతం, పెళ్లికూతురమ్మ చెరువు, ఆచంట మండలం ఆచంట, వల్లూరు గ్రామాలలో కోడి పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
నరసాపురం పట్టణ శివారు రుస్తుంబాద, నరసాపురం మండలం వేములదీవి, లక్ష్మణేశ్వరం, సీతారామపురం, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీ పాలెం, పేరుపాలెం, కాళీపట్నం గ్రామాల్లో అప్పటికప్పుడు పందేలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, వెంప ఖరీదైన పందేలకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలు తిలకించేందుకు సినీ స్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో ఇంకా సన్నాహాలు ప్రారంభం కాకపోయినా చివరి మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తా మని పందెం కాసి మరీ చెబుతున్నారు.
మెట్టలో ముఖ్యంగా చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, పంగిడి గూడెం, కామవరపుకోట మండలం కళ్లచెర్వు, రావికంపాడు, సాగిపాడు, కామవరపుకోట, లింగపాలెం మండలంలో ములగలంపాడు, కొణిజర్ల, కలరాయనగూడెం గ్రామాల్లో ఏటా భారీ పందాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ములగలంపాడు, కళ్లచెర్వు గ్రామాల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి మరీ డే అండ్ నైట్ పందే లు నిర్వహిస్తారు. కోసాట, పేకాట, గుండాట వంటి జూదాలను కూడా యథేచ్ఛగా నిర్వహిస్తా రు. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లోనూ పందేలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు
పందేలా రాయుళ్లు బరులు సిద్ధం చేస్తుంటే జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను పెంచి జూదరులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్లకు కత్తులు కట్టేవారు, గతంలో కోడిపందేల కేసులు ఉన్నవారిపై నిఘా ఉంచి బైండోవర్ కేసులు పెడుతున్నారు. బరులు సిద్ధం చేసిన చోట హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలు నిర్వహించరాదని, బరుల కోసం స్థలం ఇచ్చినవారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కానీ ఏటా వచ్చినట్లే భోగిరోజు ఉదయం తొమ్మిది గంటల తర్వాత మూడు రోజులకు అనధికార అనుమతులు వచ్చేస్తాయని నిర్వాహకులు భరోసాగా ఉన్నారు. పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందేలపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మొగ్గు చూపడం లేదు. వారంతా ఇప్పటికే నోట్లు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.