ముందే గెలిచిన రాజకీయ కోడి | Cock Fight At West Godavari In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ముందే గెలిచిన రాజకీయ కోడి

Published Sun, Dec 7 2014 5:30 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

ముందే గెలిచిన రాజకీయ కోడి - Sakshi

ముందే గెలిచిన రాజకీయ కోడి

 కోడి పందేల మూలంగా మహాభారత పర్వాన్ని తలపించే పల్నాటియుద్ధం చోటుచేసుకుందన్న చరిత్ర మన పొరుగు జిల్లా కృష్ణా దరి గుంటూరు సొంతం. పల్నాటి యుద్ధ నేపథ్యం మన జిల్లాకు లేకపోవచ్చు కానీ కురుక్షేత్రానికి ఏ మాత్రం తీసిపోని సంక్రాంతి కోడిపందేలకు ‘పశ్చిమ’ పెట్టని కోట. ప్రతి ఏటా పండుగ ముందురోజు వరకు కోడి పందేల నిర్వహణపై అటు నిర్వాహకులకు, పోలీసులకు మధ్య దోబూచులాట జరుగుతూనే ఉంటుంది. కోడి పందేల నిర్వహణ చట్ట విరుద్ధమని, పందేలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పండుగ ముందు వరకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ రాజకీయనేతల అండతో ప్రతి ఏడాదీ పందేల రాయుళ్ల కోడే నెగ్గుతూ వస్తోంది. భోగి పండుగ రోజున ప్రభుత్వ పెద్దల నుంచి అనధికారిక అనుమతులు తెచ్చుకుని పోలీసుల కళ్లకు గంతలు కట్టి మూడురోజులపాటు పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎటువంటి టెన్షన్‌లు లేకుండా ముందుగానే కోడి పందేలకు అనుమతి తెచ్చుకోవాలనే ఊపులో పందేల రాయుళ్లు ఉన్నారు. పైగా తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతల అండతో పందేల నిర్వాహకులు తెగ జోరు మీదున్నారు.
 
 బాబు చంకలో కోడిపెట్టి  బరి కట్టిన రాయుళ్లు
 సంక్రాంతికి సంప్రదాయబద్ధంగా తాము కోడి పందేలు నిర్వహించుకుంటామని పందేల రాయుళ్లు సీఎం చంద్రబాబునాయుడుకు ముందుగానే సిగ్నల్ ఇచ్చారు. గత నెల జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కలవపూడి వచ్చిన చంద్రబాబు వద్ద పందాల రాయుళ్లు బరికట్టారు. ఆయన చంకలో పందెం కోడిని పెట్టి పందేలకు అనధికారిక అనుమతి ఇవ్వాలని చెప్పకనే చెప్పారు. అదేవిధంగా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఏకైక మంత్రి పీతల సుజాత మన్ననలు పొందేందుకు నిర్వాహకులు శక్తివంచన లేని కృషి చేస్తున్నారు.పందేలకు లైన్ క్లియర్ చేసుకునే దిశగా డెల్టాలో పందేలకు పేరుగాంచిన భీమవరం మండలం వెంప గ్రామానికి ఇటీవల ఆమెను ఒక ప్రారంభోత్సవ  కార్యక్రమం పేరుతో తీసుకువచ్చారు. పందేలకు సిద్ధంగా ఉంచిన  కోళ్లను చూపించే యత్నం చేశారు. అదేవిధంగా పందేలకు కేంద్రంగా ఉన్న  భీమవరం పట్టణానికి ఇటీవల వస్తున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ప్రసన్నం చేసుకునే దిశగా కొందరు పావులు కదుపుతున్నారు.
 
 పందేల రాయుళ్ల కోసం పోలీసులపై ‘శివ’తాండవం
 ఇక ఏకంగా కోడిపందేల నిర్వాహకుల కోసం ఇటీవల పోలీసులపైనే టీడీపీకి చెందిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ వీరంగం సృష్టించారు. గత 16వ తేదీన ఉండి మండలం అర్తమూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేశారు. పందేల నిర్వాహకుడైన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీని స్టేషన్‌కు పిలిపించారు. అయితే అతను నన్నే స్టేషన్‌కు పిలిపిస్తారా.. అంటూ పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే శివ నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి మా కార్యకర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తారా... అంటూ హల్‌చల్ చేశారు.
 
 స్టేషన్‌లోనే నేలపై బైఠాయించి పోలీసులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని భీష్మించారు. చివరికి ఎందుకొచ్చిన గొడవని పోలీసులే తగ్గడంతో అక్కడికి  కథ సుఖాంతమైంది. ఇలా అధికార పార్టీ పెద్దల అండదండలు బహిరంగంగానే ఉండటంతో ఈ ఏడాది నూతన సంవత్సరం తొలినాళ్ల నుంచే పందేలకు రంగం సిద్ధం చేసుకునే పనిలో పందేలరాయుళ్ల నిమగ్నమయ్యారని అంటున్నారు. అధికార పార్టీకి చెందిన పందేల రాయుళ్ల జోరు ఎలా ఉన్నా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డెల్టా ప్రాంతంలో జనం ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వ్యవసాయం అంతా నష్టాల బాటలో నడుస్తున్నాయి. జిల్లా ఆర్థిక రాజధానిగా పేరొందిన భీమవరం పరిస్థితి కూడా గడ్డుగానే ఉంది. ఈ నేపథ్యంలో పండుగ సరదాల పేరిట ఎంతోమంది జీవితాలను బుగ్గిపాలు చేసే కోడిపందేల నిర్వహణపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపి పల్లెల్లో నిజమైన సం‘క్రాంతి’ని తీసుకువస్తారా.. ఏమో చూద్దాం!?
 -జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement