ST cases
-
అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి
జిన్నారం: మంబాపూర్లో దళితులను దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజుతో పాటు నాయకులు దళితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. దళితులపై దాడి జరిపి, వారిని గుడిలోకి రాకుండా అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు
క్రిమినల్ కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులకు కలెక్టర్ క్లాస్ సివిల్ కేసుల్లో రెవిన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణలో పోలీసు యంత్రాంగం అవలంబిస్తున్న వైఖరిపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసుల విచారణలోనూ నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తున్న పలువురు డీఎస్పీలకు ఆయన క్లాస్ తీసుకున్నారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరుతెన్నులపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల విచారణలో పోలీసు శాఖ వేగవంతంగా స్పందించాల్సి ఉండగా, విచారణ పేరుతో వివిధ కేసులను సంవత్సరాల తరబడి సాగదీస్తుండటం సరికాదన్నారు. 2012లో నమోదైన ఓ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కమిటీ ముందు ఉంచని కారణంగా డీఎస్పీల తీరును తప్పుబట్టారు. 4 సంవత్సరాలుగా కేసు విచారణ కొనసాగిస్తూనే ఉంటే, ఇక బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సమావేశం దృష్టికి పలు కేసులు... పెదనందిపాడులో ఐలా మాణిక్యరావు ఇందిరమ్మ ప«థకం కింద నిర్మించిన ఇంటిని రెవిన్యూ అధికారులు కూల్చేశారని కమిటీ సభ్యుడు అంకం శ్యాం ప్రసాద్ సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, గుంటూరు ఆర్డీవోదే తప్పిదమని నిర్ధారించిన హైకోర్టు తిరిగి ఇంటిని నిర్మించాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన 12 ఏళ్ల యాదిద్యరాజును డబ్బు కోసం అపహరించి దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు మరింత వేగవంతంగా స్పందించి ఉంటే బాలుడి ప్రాణాలు కాపాడి ఉండే వారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అన్నారు. గుంటూరు విద్యానగర్‌లో నివశిస్తున్న దళితుడైన యరమాల విజయ్ కుమార్‌పై అక్కడి అగ్ర వర్ణాలు దాడి చేసిన సంఘటనపై గుంటూరు ఆర్డీవో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై కమిటీ సభ్యుడు కొర్కపాటి చెన్న కేశవులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాపట్లలో మోడల్ స్కూల్స్ పేరుతో ఎస్సీ, ఎస్టీ కాలనీలోని పాఠశాలలను విద్యాశాఖాధికారులు విలీనం చేస్తున్న విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయా పాఠశాలలను విలీనం చేయరాదని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పోలీసు, రెవిన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలో 2012 నుంచి నమోదైన 44 కేసులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో 2010 నుంచి నమోదైన 143 కేసులపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో కె. నాగబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లిఖార్జునరావు, అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, రామాంజనేయులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముందే గెలిచిన రాజకీయ కోడి
కోడి పందేల మూలంగా మహాభారత పర్వాన్ని తలపించే పల్నాటియుద్ధం చోటుచేసుకుందన్న చరిత్ర మన పొరుగు జిల్లా కృష్ణా దరి గుంటూరు సొంతం. పల్నాటి యుద్ధ నేపథ్యం మన జిల్లాకు లేకపోవచ్చు కానీ కురుక్షేత్రానికి ఏ మాత్రం తీసిపోని సంక్రాంతి కోడిపందేలకు ‘పశ్చిమ’ పెట్టని కోట. ప్రతి ఏటా పండుగ ముందురోజు వరకు కోడి పందేల నిర్వహణపై అటు నిర్వాహకులకు, పోలీసులకు మధ్య దోబూచులాట జరుగుతూనే ఉంటుంది. కోడి పందేల నిర్వహణ చట్ట విరుద్ధమని, పందేలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పండుగ ముందు వరకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ రాజకీయనేతల అండతో ప్రతి ఏడాదీ పందేల రాయుళ్ల కోడే నెగ్గుతూ వస్తోంది. భోగి పండుగ రోజున ప్రభుత్వ పెద్దల నుంచి అనధికారిక అనుమతులు తెచ్చుకుని పోలీసుల కళ్లకు గంతలు కట్టి మూడురోజులపాటు పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎటువంటి టెన్షన్లు లేకుండా ముందుగానే కోడి పందేలకు అనుమతి తెచ్చుకోవాలనే ఊపులో పందేల రాయుళ్లు ఉన్నారు. పైగా తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతల అండతో పందేల నిర్వాహకులు తెగ జోరు మీదున్నారు. బాబు చంకలో కోడిపెట్టి బరి కట్టిన రాయుళ్లు సంక్రాంతికి సంప్రదాయబద్ధంగా తాము కోడి పందేలు నిర్వహించుకుంటామని పందేల రాయుళ్లు సీఎం చంద్రబాబునాయుడుకు ముందుగానే సిగ్నల్ ఇచ్చారు. గత నెల జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కలవపూడి వచ్చిన చంద్రబాబు వద్ద పందాల రాయుళ్లు బరికట్టారు. ఆయన చంకలో పందెం కోడిని పెట్టి పందేలకు అనధికారిక అనుమతి ఇవ్వాలని చెప్పకనే చెప్పారు. అదేవిధంగా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఏకైక మంత్రి పీతల సుజాత మన్ననలు పొందేందుకు నిర్వాహకులు శక్తివంచన లేని కృషి చేస్తున్నారు.పందేలకు లైన్ క్లియర్ చేసుకునే దిశగా డెల్టాలో పందేలకు పేరుగాంచిన భీమవరం మండలం వెంప గ్రామానికి ఇటీవల ఆమెను ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో తీసుకువచ్చారు. పందేలకు సిద్ధంగా ఉంచిన కోళ్లను చూపించే యత్నం చేశారు. అదేవిధంగా పందేలకు కేంద్రంగా ఉన్న భీమవరం పట్టణానికి ఇటీవల వస్తున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ప్రసన్నం చేసుకునే దిశగా కొందరు పావులు కదుపుతున్నారు. పందేల రాయుళ్ల కోసం పోలీసులపై ‘శివ’తాండవం ఇక ఏకంగా కోడిపందేల నిర్వాహకుల కోసం ఇటీవల పోలీసులపైనే టీడీపీకి చెందిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ వీరంగం సృష్టించారు. గత 16వ తేదీన ఉండి మండలం అర్తమూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేశారు. పందేల నిర్వాహకుడైన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీని స్టేషన్‌కు పిలిపించారు. అయితే అతను నన్నే స్టేషన్‌కు పిలిపిస్తారా.. అంటూ పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే శివ నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి మా కార్యకర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తారా... అంటూ హల్చల్ చేశారు. స్టేషన్లోనే నేలపై బైఠాయించి పోలీసులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని భీష్మించారు. చివరికి ఎందుకొచ్చిన గొడవని పోలీసులే తగ్గడంతో అక్కడికి కథ సుఖాంతమైంది. ఇలా అధికార పార్టీ పెద్దల అండదండలు బహిరంగంగానే ఉండటంతో ఈ ఏడాది నూతన సంవత్సరం తొలినాళ్ల నుంచే పందేలకు రంగం సిద్ధం చేసుకునే పనిలో పందేలరాయుళ్ల నిమగ్నమయ్యారని అంటున్నారు. అధికార పార్టీకి చెందిన పందేల రాయుళ్ల జోరు ఎలా ఉన్నా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డెల్టా ప్రాంతంలో జనం ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వ్యవసాయం అంతా నష్టాల బాటలో నడుస్తున్నాయి. జిల్లా ఆర్థిక రాజధానిగా పేరొందిన భీమవరం పరిస్థితి కూడా గడ్డుగానే ఉంది. ఈ నేపథ్యంలో పండుగ సరదాల పేరిట ఎంతోమంది జీవితాలను బుగ్గిపాలు చేసే కోడిపందేల నిర్వహణపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపి పల్లెల్లో నిజమైన సం‘క్రాంతి’ని తీసుకువస్తారా.. ఏమో చూద్దాం!? -జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు.