ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు | ST, SC cases investigation meeting | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు

Published Tue, Jul 26 2016 4:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు

ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు

 క్రిమినల్‌ కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులకు కలెక్టర్‌ క్లాస్‌
సివిల్‌ కేసుల్లో రెవిన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి
 
గుంటూరు ఎడ్యుకేషన్‌: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణలో పోలీసు యంత్రాంగం అవలంబిస్తున్న వైఖరిపై జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్‌ కేసుల విచారణలోనూ నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తున్న పలువురు డీఎస్పీలకు ఆయన క్లాస్‌ తీసుకున్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరుతెన్నులపై జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల విచారణలో పోలీసు శాఖ వేగవంతంగా స్పందించాల్సి ఉండగా, విచారణ పేరుతో వివిధ కేసులను సంవత్సరాల తరబడి సాగదీస్తుండటం సరికాదన్నారు. 2012లో నమోదైన ఓ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కమిటీ ముందు ఉంచని కారణంగా డీఎస్పీల తీరును తప్పుబట్టారు. 4 సంవత్సరాలుగా కేసు విచారణ కొనసాగిస్తూనే ఉంటే, ఇక బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
సమావేశం దృష్టికి పలు కేసులు...
పెదనందిపాడులో ఐలా మాణిక్యరావు ఇందిరమ్మ ప«థకం కింద నిర్మించిన ఇంటిని రెవిన్యూ అధికారులు కూల్చేశారని కమిటీ సభ్యుడు అంకం శ్యాం ప్రసాద్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, గుంటూరు ఆర్డీవోదే తప్పిదమని నిర్ధారించిన హైకోర్టు తిరిగి ఇంటిని నిర్మించాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   అదే విధంగా గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన 12 ఏళ్ల  యాదిద్యరాజును  డబ్బు కోసం అపహరించి దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు మరింత వేగవంతంగా స్పందించి ఉంటే బాలుడి ప్రాణాలు కాపాడి ఉండే వారని  వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అన్నారు. గుంటూరు విద్యానగర్‌లో నివశిస్తున్న దళితుడైన యరమాల విజయ్‌ కుమార్‌పై అక్కడి అగ్ర వర్ణాలు దాడి చేసిన సంఘటనపై గుంటూరు ఆర్డీవో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై కమిటీ సభ్యుడు కొర్కపాటి చెన్న కేశవులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. బాపట్లలో మోడల్‌ స్కూల్స్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీ కాలనీలోని పాఠశాలలను విద్యాశాఖాధికారులు విలీనం చేస్తున్న విషయమై కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, ఆయా పాఠశాలలను విలీనం చేయరాదని విద్యాశాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పోలీసు, రెవిన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలో 2012 నుంచి నమోదైన 44 కేసులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో 2010 నుంచి నమోదైన 143 కేసులపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో కె. నాగబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లిఖార్జునరావు, అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, రామాంజనేయులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement