సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పూర్తికాని భూసేకరణ.. మరోవైపు కోర్టు కేసులు.. ఇంకోవైపు చేసిన పనులకు చెల్లింపులు జరగకపోవడంతో పనులు ఆపేస్తామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సంకేతాలు పంపినట్లుగా తెలిసింది.
గతేడాది ఆగస్టు నుంచి ప్రభుత్వం నయాపైసా నిధులు చెల్లించని దృష్ట్యా కాంట్రాక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరానికి నిధుల లభ్యత పుష్కలంగా ఉండటం, ప్రాజెక్టు పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో పనుల వేగిరానికి చర్యలు చేపడుతుండటంతో అక్కడ పనులను దక్కించుకున్న ఇదే కాంట్రాక్టర్లు తమ యంత్ర పరికరాలను అటువైపు మళ్లిస్తున్నట్లుగా తెలిసింది.
ఉల్టా.. పల్టా..
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.32 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్, కేపీలక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా మొత్తం 5 రిజర్వాయర్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి రూ.30 వేల కోట్లతో పనులు చేపట్టారు.
2015–16 నుంచే ప్రాజెక్టు భూసేకరణ మొదలైనా, 2016–17 మార్చి నుంచి ఏజెన్సీలు పనులు మొదలెట్టాయి. ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వస్తోంది. మొదట్లో పనులు ఘనంగా మొదలైనా తర్వాత చతికిలబడ్డాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.7,510.34 కోట్లు కేటాయించినా, భూసేకరణ జరగక, కోర్టు కేసుల కారణంగా పనులు జరగకపోవడంతో దాన్ని తిరిగి రూ.1,650 కోట్లకు సవరించారు.
ఈ ఏడాది సైతం రూ.4,067 కోట్లు కేటాయించగా, ఇంతవరకు రూ.1,282 కోట్ల మేర ఖర్చు జరిగింది. మరో రూ.1,282 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇందులో చేసిన పనులకు చెల్లించాల్సిన మొత్తాలు రూ.900 కోట్ల మేర ఉండగా, భూసేకరణకు సంబంధించి రూ.380 కోట్ల వరకు ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు పనులకు నయా పైసా ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ నుంచే పనులు నెమ్మదించాయి.
ప్యాకేజీ–10లో మూడు రీచ్‌లు ఉండగా, ఇందులో ఒక రీచ్ పని ఆరంభమే కాలేదు. ప్యాకేజీ–1లో భూసేకరణ కారణంగా పనులు ముందుకు కదలడం లేదు. ప్యాకేజీ–9లో పనులు చేస్తున్న ఏజెన్సీ తన యంత్రాంగాన్ని పూర్తిగా కాళేశ్వరం రిజర్వాయర్లకు తరలించినట్లు సమాచారం. ప్యాకేజీ–6లో మెజార్టీ పనులు జరగ్గా, అక్కడ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అక్కడి నుంచి ఏజెన్సీ తన యంత్రాలను కాళేశ్వరం పనులకే తరలిస్తున్నట్లుగా తెలిసింది.
ప్రాజెక్టుల బడ్జెట్‌పై మల్లగుల్లాలు..
ఉద్ధండాపూర్ రిజర్వాయర్ పరిధిలో 16, 17, 18 ప్యాకేజీలు ఉండగా, ఇక్కడ 16 ప్యాకేజీ పనులు ఇటీవలే మొదలవ్వగా, మిగతా రెండింటిలో పనులు ఆరంభమే కాలేదు. ఇప్పట్లో ఆ పనులను ఆరంభించే అవకాశం కనిపించట్లేదు. ఇంకా ప్రాజెక్టు పరిధిలో అవసరమైన 27 వేల ఎకరాల్లో మరో 9,692 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు ప్రస్తుతం నిధులు విడుదల జరగడం లేదు. అదీగాక ప్రస్తుతం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్‌పై మల్లగుల్లాలు పడుతోంది.
నిధుల లేమి కారణంగా తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించినట్లుగా తెలుస్తోంది. దీన్ని గమనించిన కాంట్రాక్టు సంస్థలు పనులు నిలిపివేసే దిశగా ప్రభుత్వానికి సంకేతాలు పంపినట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలిసింది. కొన్ని పెద్ద కాంట్రాక్టు సంస్థలు పనులను యథావిధిగా కొనసాగిస్తున్నా, మార్చి వరకు వేచిచూసి ఆ తర్వాత పనులు నిలిపివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment