
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు రిజర్వు చేసింది. రాయలసీమపై గతంలో ఎన్జీటీ ఇచి్చన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
వీటిని తాజాగా సోమవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. జియాలజిస్టుల సూచనలు, డీపీఆర్ అవసరాల మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. ఎన్జీటీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టం లేదని స్పష్టం చేశారు. ఆదేశాల ధిక్కరణ పిటిషన్ల విచారణ ఎన్జీటీ పరిధిలో లేదంటూ పలు కేసులు ప్రస్తావించారు.
ఎన్జీటీని ఏపీ తప్పుదోవ పట్టించలేదని పేర్కొన్నారు. డీపీఆర్ పరిధి దాటి పనులు చేస్తే దానిపై చర్యలు తీసుకొనే అధికారం విషయంలో చట్టపరంగా ఎక్కడా స్పష్టత లేదన్నారు. అదనపు పనులపై చర్యలు తీసుకొనే అధికారం పర్యావరణ శాఖకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది మాధురి దొంతిరెడ్డి, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment